విశ్వ జనీనం గాంధీ ని(యి)జం

Vishwa Janinam Gandhiవివిధ రంగాల్లో ఈ శతాబ్దపు ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌,ఆంగ్‌ సాన్‌ సూకీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సి.వి.రామన్‌, బెర్నార్డ్‌ షా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, నెల్సన్‌ మండేలా, స్టీవ్‌ జాబ్స్‌, కైలాష్‌ సత్యార్థి, బరాక్‌ ఒబామా, చార్లీ చాప్లిన్‌ వంటి వారు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తూ కనిపించే వ్యక్తిత్వపు హిమగిరి శక్తి పేరు గాంధీజీ. కొన్ని సందర్భాల్లో జీసస్‌, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు వంటి వారి బోధనలను ఆచరించి చూపిన వ్యక్తి గాంధీజీ అని ప్రముఖులు పోల్చుతుంటారు.

సత్యం, అహింస పునాదులపై విశ్వమానవతా ప్రేమ శిఖరాన్ని తన సందేశంగా, మన దేశపు ముఖచిత్రంగా నిలిపిన వారు గాంధీజీ. ఆయన మార్గంలో నడిచి ఎంతోమంది నోబెల్‌ బహుమతులు గెలిచారు. కొన్ని కారణాల వల్ల గాంధీజీకి నోబెల్‌ బహుమతి ప్రకటించలేక పోయినందుకు నోబెల్‌ కమిటీ విచారం వ్యక్తంచేసింది. ఎన్నో ప్రపంచ స్థాయి ఉద్యమాలకు సత్యాగ్రహం, నిరాహారదీక్ష వంటి శాంతియుత మార్గాలే హైవేలుగా పనిచేశాయి. పనిచేస్తున్నాయి. ఫలితాలు వచ్చాయి.
వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్యం, సైన్స్‌, పర్యావరణం వంటి ఏరంగాల్లోనైనా ఆయన జీవిత పరిశోధనలే నేడు మనం అనుసరిస్తున్న పాఠ్యాంశాలయ్యాయి. ప్రేమ, సామరస్యంతో ద్వేషంపై గెలవొచ్చని, సహనానికి మించిన సింహాసనం లేదని, యుద్ధం పేరుతో అధిపత్యం మాయలో మనుషుల్ని చంపడం దారుణమని, మతోన్మాదం మంచిది కాదని ఏనాడో హెచ్చరించారు గాంధీజీ.
ప్రపంచ ఆకలిని తీర్చి, అన్నం పెట్టే రైతన్న మన దేశపు ఆత్మగా అభివర్ణించారు. కార్మికులు, సైనికుల త్యాగం గొప్పదన్నారు.
అస్పృశ్యత, అంటరానితనం, అజ్ఞానం, పేదరికం, నిరుద్యోగం, అసమానతల వంటి మహమ్మారులను ఈ దేశం నుంచి తరిమేయాలని చరిత్ర వెంట పాదయాత్రచేసి ప్రజల్లో చైతన్యం నింపారు.
మూడవ ప్రపంచ యుద్ధ పోకడలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో యావత్‌ ప్రపంచానికి ఒకే ఒక దిక్సూచి గాంధీజీ. కన్నుకు కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచం గుడ్డిదయిపోతుందంటూ మరో న్యూటన్‌ భౌతికశాస్త్ర గురుత్వాకర్షణ నియమం లాగా ఓ బతుకు శాస్త్ర మా’నవ’ ఉనికి నియమం ఏనాడో చెప్పారు.
గ్లోబల్‌ వార్మింగ్‌తో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి ‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన కోరికలను కాదు’ అని సూచించాడు. పట్టణీకరణ ముసుగులో మన గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలన్న విషయాన్ని మరువకూడదన్నారు.
మనిషిలోని అంతర్లీనంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక, నైతిక విలువలను వెలికితీసే విద్య కావాలన్నారు. శాస్త్రీయంగా ఎదుగుతూనే సాంకేతికత చాటున హింసను సష్టించడం, ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలు చేపట్టడం భవిష్యత్‌ తరాలకు ప్రమాదమన్నారు. నైపుణ్యాలను పెంపొందిస్తూ, జీవనోపాధిని ఇచ్చే విధంగా ఆధునిక విద్య వుండాలని ఆకాంక్షించారు. ఈ దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు పాఠశాలల్లోనే నిర్మించబడుతుందనే దార్శనికతను గాంధీజీ బలంగా విశ్వసించారు.
గాంధీజీ ఆత్మ కథ ‘మై ఎక్స్‌పర్‌మెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ (సత్య శోధన) పుస్తకం మంచి గుర్తింపు పొందింది. ఇలాంటి ఎన్నో సజీవ సాక్ష్యాలతో రాసుకుంటూ పోయిన గాంధీజీ జీవన సంద్రంలో ఓ నీటిబొట్టుగా చెప్పగలం. ప్రపంచస్థాయిలో విశ్వమానవుడిగా అ’సాధారణ’ వ్యక్తిగా విశేష ప్రాచుర్యం పొందిన గాంధీజీని నేడు భారతీయులలో కొంతమంది కులం, మతం కోణంలో చూస్తూ, చూపిస్తూ సంకుచితంగా ఆలోచించడం ఆందోళన చెందాల్సిన విషయం. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి మాత్రమే ఆయనను పరిమితం చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు చేసే రాజకీయ నాటకీయపు పరిణామాలు ఇకనైనా ఆపాలి. అందరివాడుగా వున్న ఆయనను కొందరివాడుగా చేయడం మానుకోవాలి. మన దేశంలోనూ, విదేశాల్లోనూ అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి మానసిక పరిపక్వత లేని పనులను ఖండించాలి.
గాంధీజీ పుట్టిన దేశం అంటూ ప్రపంచం మనల్ని గౌరవిస్తున్న తీరుతో ప్రతి భారతీయుడి గుండె గర్వపడాలి. ఆయన కలలుగన్న విశ్వశాంతి వికాసానికి మనమంతా సమిధలు కావాలి. విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ‘రక్తమాంసాలతో కూడిన గాంధీజీ లాంటి యుగపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవు.’ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ‘జీసస్‌ చెప్పెను. గాంధీజి చేసెను’ అంటూ గాంధీజీకి అందించిన అక్షర నివాళి ఇంకా కొన్ని శతాబ్దాలు గాంధీని(యి)జం ను వేలకోట్ల తారల వెలుగై సత్యంతో ప్రకాశించేలా చేస్తాయి.

– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 394749536