విశ్వగురువు మౌనం

భారత మాతాకీ జై
మన మణిపూర్‌ మంటల్లో కాలిపోనీరు

భారత మాతాకీ జై జై
మన బిడ్డల్ని నగంగా ఊరేగించనిరు

సైన్స్‌ పాఠాలు పీకేసి రాతియుగంవైపు సాగేవాళ్ళం
ఆటవికం మాకేమీ అసహజం అనిపించదు

ఒకేరోజు ఐదు వందేభారత్‌ రైళ్లకు
జెండా ఊపడమే ఇక్కడ హెడ్‌ లైన్స్‌

ఒక్క మహిళ మీద వంద మంది తెగబడే విషాదం
ఇక్కడ అసలు వార్తకాలేదు

తలకాయలు తెంపి తడికకు వెళ్ళాడదీస్తే
తలలూపే ఖాళీ బుర్రలకు ఇక్కడ కొదవలేదు

నాలుగు పాదాల మీద నడవాల్సిన నాలుగోస్తంభం
నడ్డివిరగ్గొట్టుకుని నపుంసక అవతారం ఎత్తింది

కన్నెర్ర చేయాల్సిన జాతీయ మహిళా కమిషన్‌
వ్యూహాత్మకంగా చెవుల్లో కమలంపూలు పెట్టుకుంది

ఆదేశాలిచ్చి ఈదేశంలో మంటల్ని ఆర్పాల్సినవారు
విదేశాలకు విహారంవెళ్లి అవార్డులు తెచ్చుకున్నారు

ఇక్కడి బండారం ప్రపంచానికి పొక్కకుండా
బూచి చూపెట్టి ఇంటర్నెట్‌ బందు పెట్టేసాము

ఆస్తుల్ని తగలబెట్టడం మా ఇష్టం
సామూహిక హత్యాచారం మా ఇంటిముచ్చట
నగంగా ఊరేగించడం మా అంతర్గత వ్యవహారం

కళ్ళుచెవులు మూసుకున్న ఇక్కడి మీడియా
నోరుపడిపోతే పక్కదేశపోడు ప్రశ్నించకూడదు

విదేశాలకు మాత్రం స్వయంప్రకటిత విశ్వగురువై
శాంతి సందేశాలు చిలుక పలుకుల్లా వల్లెవేస్తాము

భారత్‌ మాతాకీ జై
మతం మంటల్లో దేశం కాలిపోనిరు
– పెనుగొండ బసవేశ్వర్‌ కరీంనగర్‌
9441159615