కళాఖండాలు సృష్టించిన విశ్వనాథ్‌

కళాఖండాలు సృష్టించిన విశ్వనాథ్‌తెలుగు సినీ ప్రపంచానికి సింగారాలద్దిన శిల్పి. చలనచిత్ర రంగానికి కొత్త సొగసులు కూర్చిన వినూత్న దర్శకుడు. కళాత్మక, కథాత్మక, వినూత్న, విశిష్ట చిత్రాల ఆవిష్కర్త. వెండితెరపై ఎన్నటికీ చెరగని సంతకం. ఆయనే కళాతపశ్వి విశ్వనాథ్‌. తన ప్రతిభకు రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 19 ఆయన జయంతి సందర్భంగా మరికొన్ని విశేషాలు…
కాశీనాధుని విశ్వనాథ్‌ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెదపులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు జన్మించారు. బీఎస్సీ వరకు చదువుకున్నారు. రేపల్లెలో నివసిస్తున్న సుప్రసిద్ధ గేయరచయిత సీనియర్‌ సముద్రాలతో కాశీనాధుని కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది. సముద్రాలతో స్నేహం విశ్వనాథ్‌లోని భావుకతను తట్టిలేపింది. ఆయన ప్రోత్సాహంతో విశ్వనాథ్‌ విజయవాడలోని వాహిని పిక్చర్స్‌ పంపిణీ సంస్థలో మేనేజర్‌గా చేశారు. ఇంతలో మద్రాసు వాహినీ స్టూడియోలో ‘సౌండ్‌ రికార్డిస్ట్‌’గా చేరాలని బి.ఎన్‌.రెడ్డి నుంచి స్వయంగా ఆహ్వానం అందింది. అప్పటి నుండి ఆయన జీవిత గమ్యం, గమనం మారిపోయాయి. అక్కడ ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశరావు వంటి గొప్ప దర్శకులతో, ఎన్టీ రామారావు లాంటి వారితో పరిచయమయింది. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. సౌండ్‌ అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సౌండ్‌ ఇంజనీర్‌గా 10 ఏండ్లు పనిచేశారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, కృషి, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఆయనకు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వరించింది. ఆయన ఈ తొలి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ‘నంది పురస్కారం’, ‘రాష్ట్రపతి యోగ్యతాపత్రం’ లభించాయి.
ఆయన పాటించే జీవన సూత్రాలు, క్రమశిక్షణ, అంకితభావం ఇవన్నీ ఆయన్ను ఓ గొప్ప దర్శకుడిగా తీర్చిదిద్వాయి. సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని మానవీయ కోణంలో అనేక చిత్రాలను ఆవిష్కరించారు. ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని సృష్టిస్తారు. అందులో చక్కని కథ ఉంటుంది, అంతకు మించి బలం ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో నవ్యత్వం, ప్రతి దృశ్యంలో వైవిద్యం, సంప్రదాయం దర్శనమిస్తాయి. శాస్త్రీయ, సంగీత, నృత్యాలు సమ్మోహనంగా కనిపిస్తాయి.
‘శారద’, ‘ఓ సీత కథ’ ద్వారా స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. అపారమైన ప్రేమను గుండెల్లో దాచుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు. ‘సిరిసిరిమువ్వలు’ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కళాతపస్వి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది ‘శంకరాభరణం’. జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఈ సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది. ఇక భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన ఎన్నో సినిమాలు తీశారు. వాటిలో సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం’ లాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ, సామాజిక అంశాలను తీసుకుని ‘సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి అద్భుతమైన సినిమాలు అందించారు.
దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కార అందుకున్న ఆయన గొప్ప దర్శకులే కాదు మంచి నటులు కూడా. సంతోషం, వజ్రం, శుభసంకల్పం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్‌ వంటి విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అందరినీ అలరించారు. కాశీనాధుని కళా తపస్సుకి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వంనంది పురస్కారం అందించింది. ఇంక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘పద్మశ్రీ’ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వదా’ అంటూ మనుధర్మపై సప్తపది చిత్రం ద్వారా పిలుపునిచ్చారు. ఈ చిత్రానికి అందమైన సంగీతాన్ని అందించారు. నృత్యం ఇతివృత్తంతో ఆయన తీసిన సినిమాలు అనేకమంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి. సినిమాలలో కళాత్మకమైన విలువల్ని మేల్కొలిపిన గొప్ప దర్శకుడు విశ్వనాధ్‌. తెలుగు సినిమా రంగం ఆయన రాకతో స్వరావళిని దిద్దుకుంది. కాబట్టే సకల జనావళి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతటి ప్రతిభ కలిగిన దర్శకుడు 2023 ఫిబ్రవరి 2న తుదిశ్వాస విడిచి సినీ ప్రపంచానికి శోక సంద్రంలో ముంచేశారు. సినీవినీలాకాశపు ధృవతార కె. విశ్వనాథ్‌కు అశృతప్త నాయనాలతో ఘననివాళి.
– పింగళి భాగ్యలక్ష్మి, 9704725609