– జోడేఘాట్‌ను సందర్శించిన మంత్రి సీతక్క
– పోరాట యోధుడు భీమ్‌కు ఘన నివాళి
నవతెలంగాణ-కెరమెరి
ఆదివాసుల ఆరాధ్యదైవం, పోరాట యోధుడు అసువులు బాసిన పొరుగడ్డ జోడేఘాట్‌ను శుక్ర వారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సంద ర్శించారు. గ్రామస్తులు మంత్రిని డప్పు, వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం అమరుడు కుమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సమాధి వద్ద శ్రద్ధాం జలి ఘటించారు. ట్రైబల్ మ్యూజియంలో కలియ తిరిగి, మ్యూజియంలో ప్రదర్శనకై ఏర్పాటు చేసిన ఆదివాసీ గిరిజన సంప్రదాయ వస్తువులు, వ్యవ సాయ పనిముట్లు, గిరిజన సాంస్కృతిని ప్రతిబింబిం చే అలంకార ఆభరణాలు, తదితర వస్తువులను తిల కించి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. పోరు గ్రామాల పెద్ద కుమురం భీమ్ ఉత్సవ కమిటీ మాజీ చైర్మెన్ పెందూర్ రాజేశ్వర్, కోరేంగా గోవింద్ రావు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. హట్టి నుంచి టోకెన్ మోవాడ్ వరకు అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు అసంపూర్తిగా ఆగిపోయాయని తెలిపారు. పోరు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. జోడేఘాట్ నుంచి దెంబటి గూడెం 3 కి.మీ దూరంలోనే ఉంటుందని, రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆసిఫాబాద్‌కు కేవలం 13 కి.మీ దూరం మాత్రమే ఉంటుందని, రవాణాపరంగా సౌకర్యంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా గత ప్రభుత్వం జోడేఘాట్ గ్రామానికి 30 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేసిందని, గ్రామస్తులే స్వంత ఖర్చులతో రూఫ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నారని వాపోయారు.
వాటికి సంబంధించిన సగం బిల్లులు రావాల్సి ఉందని, పెండింగ్ బిల్లులు ఇప్పించాలని వేడుకు న్నారు. వేసవిలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు 400 మీటర్ల లోతుకు అడుగంటి పోతాయని, నీటి ఎద్దడి తీర్చేందుకు బోర్లు వేయించాలని కోరారు. మూగజీవాల దప్పిక తీర్చేందుకు చెరువు నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. గ్రామస్తుల సమ స్య లను విన్న మంత్రి సమీప గ్రామ ప్రజలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జోడేగాడ్ ప్రాంతంపైన ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పోరు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ సురేష్‌కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీఎస్పీ సదయ్య, భీమ్ మనుమడు సోనిరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, జడ్పీ చైర్మెన్ కోనేరు కృష్ణ, వాంకిడి సీఐ శ్రీనివాస్, కెరమెరి ఎస్‌ఐ గుంపుల విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.