మేడారంలో సందర్శకుల తాకిడి

మేడారంలో సందర్శకుల తాకిడి– కిటకిటలాడుతున్న వన దేవతల గద్దెలు
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సందర్శకులు భారీగా వస్తున్నారు. వనదేవతలు దర్శనానికి బుధవారం అధిక సంఖ్యలో తరలిరావడంతో మేడారం కిక్కిరిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భారీగా తరలివచ్చారు. రోజూ లక్ష మందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా మహాజాతరకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంపై దృష్టి సారించారు. పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేస్తామని ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్‌ తెలిపారు.