– అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం : ఎమ్మెల్యే హామీ
నవతెలంగాణ-ఇల్లందు
వీవోఏ, ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరంస్థానిక చెరువు కట్ట వద్ద వన మహౌత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ కోరం కనకయ్యకు ఆశా, వీఓఏ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సమస్యలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం సీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఆశా, వీవోఏ, మధ్యాహ్న భోజన కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీవోఏలు, ఆశాలు అనేక రోజులు సమ్మె చేసి ఆ సమ్మె సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో వీరి ఎజెండాలను పెట్టి చర్చించి పరిష్కరించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏ, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్‌ల జిల్లా నాయకురాలు సుల్తానా, ఆశా జిల్లా నేత చీమల రమణ, ఇల్లందు బాధ్యులు జీ.ఉమాదేవి, డీ.సునిత, ఈ.లత, చంద్రకళ, విమల, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.