వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలినవతెలంగాణ-నస్పూర్‌
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగల సంఘం(సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాల అభివృద్ధికి మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేస్తూ మహిళాల ఆర్థికంగా, సామాజికంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. 20 సంవత్సరాల నుంచి గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి మహిళ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తూ చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి వారికి లోన్స్‌ ఇప్పించి తిరిగి సక్రమంగా లోన్స్‌ వెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్‌ఎచ్‌కే లైవ్‌ మీటింగ్‌ పెట్టి అన్ని సంఘాలు ఆన్‌లైన్‌ ఎంట్రీ చేస్తున్నారని, మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పధకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చి 10 ఏళ్ళు దాటినా వీఓఏల బ్రతుకులు మారలేదని, వీఓఏలకు సెర్ప్‌ నుండి కేవలం రూ.5వేల గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. గ్రామ సంఘం పుస్తక నిర్వహణ కొరకు ఎంపిక చేసిన వీఓఏలకు నేడు అనేకరకాల పనులు చేయిస్తున్నారని, ఎంతో మంది వీఓఏలు ప్రభుత్వం ఇస్తున్న అతి తక్కువ గౌరవ వేతనంతో కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. విఓఏలు అనారోగ్యంతో, ప్రమాదాల వలన మరణిస్తన్నా కనీస బీమా సౌకర్యం లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి వీఓఏకు రూ.10 లక్షల సాధారణ బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం, కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. ప్రతినెలా రెగ్యులర్‌ వేతనాలు వ్యక్తిగత ఖాతాల ద్వారా ఇవ్వాలని, గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా చెల్లించాలని, స్త్రీనిధి ఇన్సెంటివ్‌ పెంచి ఇవ్వాలని, అర్హులైన వారికి సీసీలుగా ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. సెర్ప్‌ నుంచి రూ.5వేలు, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల నుంచి రూ.3వేలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ గ్రామ సంఘాలకు ఆదాయం లేక అమలు కావడంలేదని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంటల కుమార్‌, దుర్గం రాము, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లింగంపల్లి వెంకటేష్‌, కోశాధికారి పొట్ట పోషం, సమ్మన్న, లక్ష్మణ్‌, భీమరాజ్‌, వెంకటి, మహేష్‌, తుకారం, లక్ష్మీనారాయణ, రజిత, భాగ్య, లావణ్య, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.