వెలుగులు లేని విఓఏల జీ(వి)తాలు

– ఎస్‌.వి. రమ
 సెల్‌:9490098899
మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని నిత్యావసర

సరుకుల ధరలు సామాన్యుడు
అందుకోలేనంతగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం కూడా ఇదే చెబుతుంది. నిజమే.. ఆ
విధానాల వల్ల సహజంగానే కార్మిక, కర్షక
ఇతర అన్ని వర్గాలపై ఆ ప్రభావం పడుతుంది.
అంతంత మాత్రం పారితోషికాలాయే… ఆ
గౌరవ వేతనంలో సంసారాన్ని నెట్టుకురావడం
ఎలా సాధ్యం ? ఎలాగో కేంద్ర బీజేపీ
ప్రభుత్వానికి మనసూ లేదూ… ప్రజలు
బాధపడుతున్నారన్న మానవత్వం అంతకన్నా
లేదు. మోడీ సర్కార్‌కు భిన్నంగా ఉన్నామంటూ
నిరూపించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా!
‘సమైఖ్య రాష్ట్రంలో పాలనెలా ఉందో మనం చూసినం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నం. ఇగ నాటి పరిస్థితులు మారాలే. అందుకే తగిన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే గ్రామీణాభివృద్ధి పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. డ్వాక్రా మహిళల ఆర్ధిక పరిస్థితి మెరుగవ్వాలె. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. మంచి పేరొచ్చింది. మహిళా సంఘాలకు వారధులుగా ఉన్న ఐకెపి విఓఏల కష్టాన్ని గుర్తించాం. అన్ని రకాలుగా వారిని ఆదుకుంటాం’. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేండ్ల కింద చెప్పిన మాట. ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. వీఓఏల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో గ్రామ స్థాయిలో సుమారు 18 వేల మంది విఓఏలు (గ్రామ సంఘాల సహాయకులు) పని చేస్తున్నారు. 19 ఏండ్ల నుంచి గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తూ వారు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. లోన్లు ఇప్పించి, తిరిగి సక్రమంగా చెల్లించే విధంగా కృషి చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తుంటారు. స్వయం సహాయక గ్రూపుల (ఎస్‌హెచ్‌జి) ప్రత్యక్ష మీటింగ్‌లు పెట్టి, ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో వీఓఏల పాత్ర కీలకం.కానీ వీరి కష్టాలను ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయం.
గౌరవం లేని వేతనం
19 ఏండ్లుగా గ్రామీణ పేదరిక నిర్మూలనా పథకం (సెర్ప్‌)లో భాగంగా ఐకెపి విఓఏలు శ్రమిస్తున్నారు. అయినా వీరికి గౌరవ వేతనం పేరుతో రూ.3,900 మాత్రమే చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ఇది అన్యాయం. సగటున రోజుకు రూ.130లతో ఆ కుటుంబం ఎలా బతకగలదో ప్రభుత్వం ఆలోచించాలి. చాలీచాలని వేతనంతో సమయానికి తిన్నా తినకపోయినా సామర్ధ్యానికి మించిన పనులన్నీ నిరాటంకంగా చేస్తున్నారు. విఓఏలపై పని ఒత్తిడి ఎక్కువ. నిర్ధేశించిన పనితో పాటు అనేక రకాల పనులు వీరే చేయాలి. అయినా ఉన్నతాధికారుల సూటిపోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ‘క్షణం తీరిక లేదు. దమ్మిడి ఆదాయం లేద’న్న చందంగా వీరి బతుకులు తెల్లారుతున్నాయి. గొర్రె తోక బెత్తెడు పారితోషకాలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ‘తాను, తన బిడ్డ ఓ పూట తింటూ పస్తులుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కాలేజీ ఫీజులు కూడా కట్టుకోలేక పోతున్నామంటూ ఓ..విఓఏ కన్నీళ్ళ పర్యంతమైంది. స్వరాష్ట్రంలోనూ మాకీ గతేంటనీ మరో వీఓఏ ఉద్వేగానికి గురైంది. ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే మా బతుకులు అగమ్య గోచరమేనని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళు చేస్తున్న కష్టాన్ని పై అధికారులు, ప్రభుత్వం గుర్తించిందో లేదో కానీ… స్వయం సహాయక గ్రూపు మహిళలు మాత్రం గుర్తు పెట్టుకుంటున్నారు. చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
విసిగిపోయిన విఓఏలు
చాలీచాలని వేతనాలతో… అష్టకష్టాలతో ఐకెపి విఓఏలు విసిగిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం ముందు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. తొమ్మిదేండ్లుగా సెర్ప్‌ అధికారులను, ప్రభుత్వానికి తెలంగాణ ఐకెపి విఓఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) విజ్ఞప్తులు చేసింది. వారితో రాయభారాలు జరిపింది. విఓఏల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో పరిష్కారం కోసం శాంతియుత నిరసనలు చేపట్టారు. మార్చి నెలలో మూడు రోజుల పాటు టోకెన్‌ సమ్మె నిర్వహించారు. అయినా సర్కార్‌ పెడచెవిన పెట్టింది. అనివార్యమైన పరిస్థితుల్లోనే సమ్మె నోటీస్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 17 నుండి చట్టబద్ధంగా తెలంగాణ సాధన స్ఫూర్తితో ఐకెపి విఓఏలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఐకెపి విఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. సెర్ఫ్‌ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. ఇవేవీ గొంతెమ్మ కోర్కెలేమీ కావు. కష్టపడే వారు అడిగే కనీస హక్కు. ఇవే డిమాండ్లతో ఐకెపి విఓఏలు 39 రోజులుగా నిరాటంకంగా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ చంటి పిల్లలతో పాటు వచ్చి టెంట్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి నిరసన తెలుపుతున్నారు. ‘మా అమ్మకు కనీస వేతనం ఇవ్వండి అంకుల్‌’ అంటూ సీఎం కేసిఆర్‌నుద్దేశించి ఆ చంటి పిల్లలు దీనంగా అడుగుతున్నారు. ఆ దృశ్యాలు మనసున్న వారినెవరినైనా కదిలిస్తుంది.
బెదిరింపులు – అదిరింపులు – నిర్భంధం
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్మికుల ప్రత్యక్ష ప్రమేయంతో సమ్మె జరుగుతుంది. అయితే కొందరు విచ్చిన్నకర శక్తులు సమ్మెపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరిస్తున్నారు. మా మాట వినకపోతే మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు. సమ్మెను విచ్చిన్నం చేసి విఓఏల జీవితాల్లో మట్టికొట్టాలని ప్రయత్నిస్తున్నారు. వారి సమస్యలు ఇదిగో పరిష్కరిస్తామంటూ, అదిగో చేస్తున్నామంటూ మభ్యపెట్టిన కొన్ని సంఘాల నేతల అసలు రూపం బయటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. దీంతో వీరి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకుంటేనే మంచిదని నలుదిక్కులా మొక్కుకుంటున్నారు. మరోపక్క 22వ తారీఖున శాంతి యుతంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పోలీసులు నిర్భంధాన్ని ప్రయోగించారు. లాఠీఛార్జీ చేశారు. కేసులు పెట్టారు. విఓఏ నాయకులను బెదిరింపులకు గురి చేశారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మనసు పెట్టి ఆలోచించాలి
మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడు అందుకోలేనంతగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతుంది. నిజమే.. ఆ విధానాల వల్ల సహజంగానే కార్మిక, కర్షక ఇతర అన్ని వర్గాలపై ఆ ప్రభావం పడుతుంది. అంతంత మాత్రం పారితోషికాలాయే… ఆ గౌరవ వేతనంలో సంసారాన్ని నెట్టుకురావడం ఎలా సాధ్యం ? ఎలాగో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మనసూ లేదూ… ప్రజలు బాధపడుతున్నారన్న మానవత్వం అంతకన్నా లేదు. మోడీ సర్కార్‌కు భిన్నంగా ఉన్నామంటూ నిరూపించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా! ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్‌ విగ్రహాన్ని నగర నడిబొడ్డులో పెట్టారు. సచివాల యానికి ఆ సమతామూర్తి పేరును నామకరణం చేశారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలపై పలురకాల చర్చ సాగుతోంది. మోడీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు (మనుధర్మ నీతి, నియమాలు) గజ్జె కట్టి నాట్యం చేస్తున్న తరుణంలో, కార్మిక హక్కులనే హరించి వేస్తున్న కాలంలో అంబేద్కర్‌ ఆలోచనలు, రాజ్యాంగ పరిరక్షణ, ఆ స్ఫూర్తి చర్చలోకి తీసుకురావడం ఆహ్వానించ దగిందే. అయితే ఇప్పటికే నూతనంగా నిర్మితమైన డాక్టర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం నుండి విఆర్‌ఏ, జెపిఎస్‌, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించి తమ మాట నిలబెట్టుకున్నారు. ఇది కూడా హర్షించ తగినదే. వారితో పాటు అత్యంత పేదరికంలో జీవిస్తూ, మహిళల ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ఐకెపి విఓఏల సమస్యలను పరిష్కరించడం కూడా మన సర్కార్‌ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తున్నదని నమ్ముదాం. లేదంటే..ఉద్యమాలే శరణ్యం.