– ఇంటర్ బోర్డు కార్యదర్శికి టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకన క్యాంపులను అధ్యాపకులకు అనుకూలంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వస్కుల శ్రీనివాస్, కొప్పిశెట్టి సురేష్ ఆన్‌లైన్ ద్వారా వినతి పత్రం పంపించారు. ఈనెల 16 నుంచి ఇంటర్ ఒకేషనల్ కోర్సుల జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 23 కోర్సుల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను, సుమారు వెయ్యి మందికిపైగా అధ్యాపకులు మూల్యాంకనం చేస్తారని పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ పట్టణాల్లో ఒకేషనల్ మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఏడాది అధ్యాపకులందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఒకేషనల్ మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ పట్టణంలో ఒకేషనల్‌లోని అన్ని కోర్సులతో క్యాంపు ఏర్పాటు చేయాలనీ, కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఒకేషనల్ అధ్యాపకులకు వరంగల్ పట్టణంలోని ఒకేషనల్ క్యాంపులో పాల్గొనేటట్టు అనుమతించాలని కోరారు.
నూతన అధ్యాపకులకు మూల్యాంకనం విధులు కేటాయించాలి
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కేంద్రాల్లో నూతన అధ్యాపకుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని విధులను కేటాయించాలని టీజీజేఎల్‌ఏ-475 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వస్కుల శ్రీనివాస్, కొప్పిశెట్టి సురేష్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతేడాది మే నాలుగున సుమారు మూడు వేల మందికిపైగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించారని తెలిపారు. 23 ఏండ్లుగా వారు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో సబ్జెక్టు నిపుణులుగా, చీఫ్ ఎగ్జామినర్లుగా, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా ఎంతో అనుభవాన్ని సాధించారని పేర్కొన్నారు. వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన అధ్యాపకులకు ఇంటర్ బోర్డు స్పష్టమైన విధులుతో మూల్యాంకనంలో పాల్గొనేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.