నేడు యావత్ భారత దేశంలో కార్మిక కర్షకులంతా స్వచ్ఛందం గా గ్రామీణ భారత్ బంద్, సెక్టోరల్ వారీగా సమ్మెలకు పిలుపునిచ్చి దాని దిగ్విజయానికి తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ గ్రామీణ బంద్ పిలుపు సఫలం కాకూడదని కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, సమ్మెకు దిగుతున్న వారిని బెదిరిస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారు. పంజాబ్ నుండి ఢిల్లీకి బయలుదేరిన రైతన్నలను అడ్డుకుంటున్న తీ రు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉన్నది. తమ నిరసనను తెలుపడానికి వస్తున్న రైతులను ముండ్ల కంచెలతో, పెద్దపెద్ద బారికేడ్లతో, రోడ్డుపైన మేకు లు కొ ట్టించి, మొలలు నాటి, కాంక్రిట్‌తో గోడలు నిర్మించి ఆటం కాలు సృష్టిస్తున్న తీరు ఇరుదేశాల మధ్య జరుగుతున్న యు ద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. నిరసన గళాన్ని ఇంతలా నొక్కి వేయాలనుకునే కేంద్రపు ఆలోచన గర్హనీయ మైనది. నిరసన గళమే లేకపోతే ప్రజాస్వామ్యం రాచరిక వ్యవస్థ కన్నా చాలా ప్రమాదకరంగా మారుతది. నిరసన గళాన్ని ఒక రకంగా తన వీపును తనకు స్పష్టంగా కనిపించేలా చేసే ఒక అవకాశంగా పాలకులు భావిం చాలి. అయితే ‘ఎదురేలేదు’ అని తమకు తాము భావిస్తున్న ఇదే ప్రభు త్వాన్ని దేశ రైతన్నలు మెడలు వంచి క్షమాపణలు చెప్పించి పార్ల మెంటు చేత ఆమోదించబడిన బిల్లులను వెనక్కి రప్పించిన ఘనత రైతుల ఐక్యతా శక్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది.
ఈ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉపాధి పొందుతున్నది వ్యవసాయరంగం. స్థూల జాతీయోత్పత్తిలో దాని 20శాతం కూడా లేదని తెలిసినా దిక్కుతోచని స్థితిలో వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచు కుంటున్న దుస్థితి ఉన్నది. దానిని లాభసాటిగా మార్చడం వల్ల మాత్ర మే స్థూల జాతి ఉత్పత్తిలో దాని వాటా పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో పాలుపంచుకుంటున్న వారందరికీ మెరుగైన జీవన విధా నము ఏర్పడుతుంది. దీనిని పెడచెవిన పెడుతున్న దృష్ట్యా ప్రభుత్వా లను హెచ్చరిక చేయడం నేటి అవసరం. అందుకే ఫిబ్రవరి 16న జాతీయ స్థాయిలో గ్రామీణ బంద్ విజయవంతం కావడం సానుకూల ఫలితాలకు నాంది పడుతుంది. రైతు సంఘాలతో పాటు కేంద్ర కార్మిక సంఘాలన్నీ, సెక్టార్లవారీగా అనేక రంగాల్లోని కార్మికులందరూ కూడా ఈ గ్రామీణబంద్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పం చుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా నిర్మాణ, సేవారంగానిదైతే, పారి శ్రామిక రంగానిది 30 శాతంపైనే. ఈ రెండు ప్రధాన రంగాలలో అభివృద్ధి సా ధించాలంటే కార్మికులే కీలకం. కానీ అసంఘటితంగా ఉన్నటువంటి 96శాతం కార్మికులంతా అత్యంత తక్కువ వేతనాలతో, కొరగాని సౌకర్యాలతో జీవనాన్ని నెట్టుకొ స్తున్నారు. ఏ సమాజంలోనైతే శతకోటీశ్వర్లు బిలియనీర్ల సంఖ్యకన్నా లక్షాధికారులు కోటీశ్వరుల సంఖ్య అత్యధిక శాతం పెరిగితే అది మెరుగైనదిగా భావించవచ్చు.
కానీ భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య అమాం తం పెరిగిపోయి ఒక్క శాతం ప్రజల దగ్గర సంపద పోగౌతున్నది. ఈ బిలినియర్లనే మతాబులు వెలుగుతుంటే ఎంత మంది సామాన్యులు భూ చక్రాలై తుస్సుమంటున్నారో లెక్కింపలేము. ప్రసంగాల ద్వారా పొగడ్తల ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపడవు. నిర్దిష్టమైన విధానాల ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకే కార్మిక వర్గం కన్నెర్ర జేసి గ్రామీణ భారత్‌బంద్‌లో భాగస్వాములై తమ బతు కులను బుగ్గిపాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని దిక్కరిస్తున్నాయి. రెండేండ్లకు పైబడి దేశ రైతన్నలకు ఇచ్చిన హామీలను అమలు పరచ కుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు. విడ్డూరకరమైన అంశం ఏమం టే ఎంఎస్ స్వామినాథన్ ప్రతిపాదించిన సంస్కరణలను అమలు పరచడం లేదు కానీ వారికి మాత్రం భారతరత్న అవార్డు ప్రకటిం చారు. కర్పూరి ఠాకూర్, చరణ్‌సింగ్ వంటి ప్రముఖులకు కూడా భార తరత్నలు ప్రకటించి ఒక మానసిక తృప్తిని కల్పించారు. వీరికి భారత రత్నలు ఇవ్వడాన్ని విమర్శించాలనే ఉద్దేశం లేదు.కానీ ఈ పేరుతో రాజకీయాలు చేస్తూ మరోసారి గద్దెనెక్కాలనే ఆలోచన తప్ప నిరసన గళాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్న భారత కార్మిక కార్షక వీరులను మాత్రం శాంతింపజేసే ప్రయత్నాలు ఏమీలేకపోవడం విచారకరం. అందుచేత రైతుల పోరాట విజయం అనివార్యం.
పార్లమెంటులో అధికారపక్షపు పెద్ద నాయకులు ప్రసంగాలు మొ దలుపెట్టినప్పటి నుండి జవహర్‌లాల్ నెహ్రూను, కాంగ్రెస్‌ను విమ ర్శించడం ఒకపక్క చేస్తూ, మరోపక్క భావోద్వేగపు అంశాలైన మతం, అతి జాతీయ వాదం, మందిరం అంటూ వారు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికల బాండ్ల అంశంపై వెలువడిన తీర్పు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఒక వారం రోజుల క్రితమే ఇదే సుప్రీం కోర్టు ”ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారంటూ” చండీగఢ్ మేయర్ ఎన్నికల విధానాన్ని ఉటంకిస్తూ బీజేపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు అంశాలు ప్రతిప క్షాల విమర్శలు కావు. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం దేశ ప్రజ లకు వివరించిన తీర్పు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించాలి? నిజా నికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఇదే పాకిస్తాన్ లాంటి చోట అయి ఉంటే ఇప్పటికే ప్రధానమంత్రి స్థాయి లాంటి వాళ్ల ని కూడా జైలుకు పంపేవారేమో! ఈ అంశాలను ఎందుకు ప్రస్తావిం చాల్సి వస్తోంది అంటే కేంద్ర ప్రభుత్వం గురువిందగింజల కాకుండా తమ తప్పిదాలను గుర్తించాలి, దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. ముగిసిన 17వ లోక్‌సభ పార్లమెంటు చివరి సెషన్ మొత్తం రామ మందిరం అంశంపైనే పరస్పర పొగడ్తలతో ముగిసింది.
నిజానికి దేశ కార్మిక కర్షక వర్గం ఎన్నో నెలల కిందనే ప్రకటించిన వారి డిమాండ్లపై చర్చించి ఒక విధానాన్ని ప్రకటించాల్సి ఉండే. ఎన్నో ఏండ్ల నుండి ఆనవాయితీగా నిర్వహింపబడుతున్న ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనగా 2015 నుండి అకారణంగా నిర్వహించడం లేదు. ఏకపక్షంగా లేబర్ కోడ్‌లను సిద్ధం చేసి అమలకు సిద్ధపడుతున్నారు. కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదింపుల వాతావరణాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. కేవలం పార్ల మెంట్‌లో తమకు నచ్చిన చట్టాలను తయారు చేసుకోవడం, రాజ కీయ పార్టీలను కూటములుగా ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి శతవిధాల యుక్తి కుయుక్తులను ప్రదర్శించడం, ఎన్నికల సందర్భాల్లో ప్రసంగాలు చేయడం, అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం…. వంటి వాటిపై ఉన్న శ్రద్ధ ప్రజాస్వా మ్య పద్ధతిలో ప్రతిస్పందనకు అవకాశం లేకుండా చేయబడిన నియం తృత్వపు పరిస్థితులు ఇప్పుడున్నవి. అందుచేత పరిణామాలకు వెరవకుండా నిరసన గళాన్ని వినిపించడమే కార్మిక కర్షకుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఎప్పటికైనా పోరాటానిదే విజయం.
జి. తిరుపతయ్య
9951300016