ఓ మురికి వాడలో పుట్టింది. పదేండ్ల వయసులో మొదటిసారి పెన్సిల్ పట్టుకుంది. అప్పటి వరకు అక్షరమంటే ఏమిటో తెలియని అమ్మాయి. ఇప్పుడు అదే మురికివాడల పిల్లలకు వారి భవిష్యత్తును తిరిగి రాయడంలో సహాయం చేస్తోంది. ఆమే చాందినీ ఖాన్. వీధి బాలల సాధికారత కోసం వాయిస్ ఆఫ్ స్లమ్ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించి విశేష కృషి చేస్తున్న ఆ స్ఫూర్తిదాయక యువతి పరిపచయం నేటి జోష్‌లో…
చాందినీ నోయిడాలోని ఓ మారుమూల మురికివాడలో పుట్టింది. చాలామంది మురికివాడల పిల్లల్లాగే ఆమె కూడా బాల కార్మికురాలిగా తన జీవితం ప్రారంభించింది. ‘ఐదేండ్ల వయసు నుండి నేను మా నాన్నతో పాటు వీధి మ్యాజిక్ షోలు ప్రదర్శించడానికి, డ్యాన్స్ చేయడానికి, పాములు ఆడించడానికి వెళ్లేదాన్ని. అర్థరాత్రి కూడా ప్రయాణించేవాళ్లం’ అని ఆమె గుర్తుచేసుకుంది. తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యత చాందినీ తీసుకోవాల్సి వచ్చింది. ‘ఆ సమయంలో నేను వేరొకరి కింద పని చేయాల్సి వచ్చింది. రోజుకు కేవలం రూ. 30 మాత్రమే నా సంపాదన’ అంటూ ఆనాటి తన జీవన పోరాటం గురించి పంచుకుంది.
టర్నింగ్ పాయింట్
‘ఏడేండ్ల వయసులో నేను రాగ్ పికింగ్ అనే ప్రాంతానికి మారాను. ఎన్నో అవమానాలు నా దినచర్యలో భాగంగా మారాయి. చివరికి దొంగతనం చేశాననే తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లాను. పూలు, మొక్కజొన్నలు అమ్మడం వంటి అనేక పనులు చేశాను. ఇలాంటి కష్టకాలంలో నాకు ఓ మంచి అవకాశం వచ్చింది. మురికివాడల్లోని పిల్లలకు విద్యను అందిస్తున్న వాలంటీర్లను కలిశాను. అప్పుడే నేను నా లక్ష్యాన్ని కనిపెట్టాను. బద్ధే కదమ్ అనే ఎన్‌జీఓలో నా పేరు నమోదు చేసుకున్నాను’ ఆమె చెప్పింది. ఆ సమయంలో చాందినీకి పెన్సిల్ పట్టుకోవడం కూడా తెలియదు. కానీ పట్టుదలతో ఓ నెల తర్వాత ఓపెన్ స్కూల్ ప్రోగ్రామ్‌లో చేరింది. పదేండ్ల వయసులో చదువు ప్రారంభించింది. తర్వాత ఆమె ఇంటర్ పూర్తి చేసింది.
గర్వించదగ్గ క్షణాలు
‘చదువు తర్వాత నా జీవితం మంచి మలుపు తిరిగింది. బాద్ధే కదమ్‌లో చేరి వీలైనన్ని ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. కొత్త విద్యా కేంద్రాలను తెరవడంలో వారికి సహాయపడ్డాను. కమ్యూనిటీ సభ్యులను, తల్లిదండ్రులను కూడా వారి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాను. నాపై దొంగతనం నేరంతో జైలుకు పంపించిన సంఘటన నా మనసునెప్పుడూ బాధపెట్టేది. నా తర్వాత మరో ఇద్దరు పిల్లలు ఇలాగే జైలుకు వెళ్ళారు. జైల్లో గడిపిన భయంకరమైన రోజులు గుర్తుకొస్తే భరించలేని బాధ. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ పిల్లలను విడిపించాను. ఇది నా జీవితంలో గర్వించదగ్గ క్షణాలలో ఒకటి’ అంటుంది ఆమె. అంతి తక్కువ కాలంలోనే ఆమె జిల్లా కార్యదర్శిగా నియమించబడ్డది. తర్వాత జాతీయ కార్యదర్శిగా పదోన్నతి పొందింది.
వారి కథలు చెప్పుకుంటున్నారు
ఈ సంస్థ ఇప్పుడు 5,000 సభ్యులను కలిగి ఉంది. బాలక్‌నామా పేరుతో మురికివాడల పిల్లల కోసం నడిచే వార్తాపత్రికలో పని చేయడం ప్రారంభించింది. ‘నేర్చుకోవాలనే నా ఆత్రుత నన్ను బాలక్‌నామా రిపోర్టర్‌గా మార్చింది. మురికివాడల పిల్లల కథలను డాక్యుమెంట్ చేశాం. దాని ఆంగ్ల సంచికను కూడా ప్రారంభించగలిగాం. మంచి ప్రశంసలు కూడా అందుకున్నాం. ఇదే నన్ను బాలక్‌నామా సంపాదకురాలిగా చేసింది. వీధి బాలల జీవితాలు, లైంగిక వేధింపులు, బాల కార్మికులు, పోలీసుల క్రూరత్వంతో పాటు పిల్లల ఆశలు, సానుకూల మార్పుల గురించి కథలు అందించడం నా జీవితంలో ఒక భాగమైపోయింది’ అని ఆమె చెప్పింది. అయితే చాందిని తన 18 ఏండ్ల వయసులో బాలక్‌నామాను విడిచిపెట్టింది.
మురికివాడల పిల్లలతో కలిసి…
సొంతంగా ఏదైనా ప్రారంభించి వీధి బాలల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో చాందిని వాయిస్ ఆఫ్ స్లమ్‌ను ప్రారంభించింది. ’18 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉండి, ఏ ఎన్‌జీఓలు అంగీకరించని వారి కోసం నేను ఎన్‌జీఓను ఏర్పాటు చేశాను. వీధి పిల్లలకు ఆరోగ్యం, విద్య, నివాసం వంటి కనీస సౌకర్యాలు కల్పించడమే దీని లక్ష్యం. మా కంట్రిబ్యూటర్‌లు, వాలంటీర్లు, మెంటార్‌ల సహాయంతో మేము మా పని చేస్తున్నాం. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాయిస్ ఆఫ్ స్లమ్ పిల్లల కోసం వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆసక్తిని పెంచడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి మేము వీధి నాటకాల ద్వారా వారితో కనెక్ట్ అవుతాము. చదువుతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ ట్రైనింగ్, లీడర్‌షిప్ ట్రైనింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో పని చేస్తున్నాం’ అని ఆమె పంచుకుంది.
సోషల్ మీడియా ద్వారా…
మురికివాడల పిల్లల సమస్యలను, సవాళ్లను ప్రపంచానికి తెలియజేసేందుకు చాందినీ స్లమ్ పోస్ట్ పేరుతో డిజిటల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంది. ఆమె గత సంపాదకత్వ అనుభవం దీనికి ఎంతో ఉపయోగపడింది. ‘వాయిస్ ఆఫ్ స్లమ్ వృద్ధికి దోహదపడే పెద్ద నెట్‌వర్క్‌ను మేము ఫేస్‌బుక్ ద్వారా సృష్టించాం. స్లమ్ పోస్ట్ ఆ నెట్‌వర్క్‌కు చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం. సమాజంలో మార్పును తీసుకురావడానికి ఇది మాకు సహాయపడగలదని ఆశిస్తున్నాం. అందరూ సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకోవడం నేను గమనించాను. డిజిటల్ స్కిల్స్ ప్రాముఖ్యతను గుర్తించాను. అందుకే మా టీం సభ్యులకు ఫేస్‌బుక్ ఉపయోగించడం నేర్పించాను. అక్కడే నేను మిలియన్ల మందితో కనెక్ట్ అయ్యి వాయిస్ ఆఫ్ స్లమ్ గురించి, సమాజంలో మార్పు తీసుకురావడం గురించి వివరించగలిగాను’ అని ఆమె చెప్పింది. ఆమె తన సొంత ప్రొఫైల్ పేజీని ప్రారంభించి అందులో వీధి పిల్లల కథలను పోస్ట్ చేసేది. ‘సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచగలమని నేను నమ్ముతున్నాను. మన దేశ ప్రజలను విద్యావంతులను చేస్తే, రేపటి రోజును శక్తివంతం చేసినట్టే’ అని ఆమె జతచేస్తుంది.
ఆకాశమే హద్దు
చాందిని మిషన్ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆమె భవిష్యత్తు ఆశావాద ప్రణాళికలతో నిండి ఉంది. ‘భవిష్యత్తులో మేము మా విద్యా కార్యక్రమంలో కంప్యూటర్‌లను చేర్చాలనుకుంటున్నాం. అలాగే డిజిటల్ స్పేస్ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో పిల్లలకు నేర్పించాలనుకుంటున్నాం. వారిని మెయిన్ స్ట్రీమ్ చేయాలని, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించాలని, సమాన అవకాశాలను అందించాలని కోరుకుంటున్నాం’ అని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. వీధుల్లో ఉండటం నుండి ఇప్పుడు వీధుల్లో ఉన్నవారికి సహాయం చేయడం వరకు చాందిని ప్రయాణం ఓ అద్భుతం. ఆమె వయసు ఇప్పుడు 20. దృఢ సంకల్పంతో, పట్టుదలతో సాగిపోతున్న ఆమెకు ఆకాశమే హద్దు.
– సలీమ, 94900 99083