ప్రభుత్వానికి, వికలాంగులకు సంధానకర్తగా ‘వికలాంగుల వాయిస్‌’

– పదో వార్షికోత్సవ పోస్టర్‌ను అవిష్కరించిన ముత్తినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వానికి, వికలాంగులకు మధ్య సందాన కర్తగా ‘వికలాంగుల వాయిస్‌’ పత్రిక పనిచేస్తుందని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య వర్మ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని వికలాంగుల కార్పొరేషన్‌ కార్యాలయంలో వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక దశాబ్ది ఉత్సవాల పోస్టర్‌ను ఆయన అవిష్కరించారు. వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వారి హక్కుల పరిరక్షణ కోసం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. కార్పొరేషన్‌ ద్వారా వారికి అవసరమయిన పరికరాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా మాస పత్రిక తీయటం తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి సారన్నారు. ఆ పత్రిక పదో వార్షికోత్సవ ఉత్సవాలు జయప్రదం చేయటానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. పత్రిక గౌరవ సలహాదారులు పి ఉమ్మర్‌ ఖాన్‌ మాట్లాడుతూ వికలాంగులను చైతన్యం చేసేందుకు 2014 నుంచి వికలాంగుల వాయిస్‌ మాస పత్రిక నడుపుతున్నామని తెలిపారు. చట్టాలు, జీవోలు పత్రిక ద్వారా వికలాంగులకు చేరవేస్తున్నామని చెప్పారు. పత్రిక ప్రారంభించి పదేండ్లు అవుతున్న సందర్బంగా ఆగష్టు 12న దశబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా వికలాంగుల కళాకారులతో సంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికల, జె మల్లేష్‌, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి పి నాగమణి, నాయకులు అదర్శ్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు