వాలీబాల్ విజేత మర్కోడు ఆశ్రమ పాఠశాల 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సీఎం కప్ టోర్నమెంట్ లో వాలీబాల్, ఖో-ఖో, రన్నింగ్ విభాగాల్లో మర్కోడు గ్రామంలోని బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈసం ముత్తయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్ లో మండలంలో ఉన్న 12 గ్రామ పంచాయితీల క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. మర్కోడు గ్రామ పంచాయతీ తరుపున ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. పోటీలలో ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఖో -ఖో, వాలీబాల్, రన్నింగ్ పోటీలలో విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు తనతో పాటు గ్రామ పంచాయతీ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారని పేర్కొన్నారు.