యథేేచ్ఛగా మట్టి తవ్వకాలు

– అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
నవతెలంగాణ -బొమ్మలరామారం
మండలంలో మత్స్య అభివద్ధి శాఖ కార్యాలయం ఆధీనంలో ఉన్న చెరువుల నుండి అక్రమంగా మట్టిని తరలించిపోతున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం అన్నారు. మండలంలో పలు గ్రామాలలో విచ్చలవిడిగా మట్టి తర్వాకాలు చేస్తున్నారని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారన్నారు. ఆయన శుక్రవారం చెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క గుంత 80 నుంచి 100 ఫీట్ల లోతు ఉందన్నారు. నెలల తరబడి చెరువుల నుంచి భూమి నుండి ప్రయివేటు వ్యక్తులు యథేచ్చగా చెరువు మట్టిని తరలించకపోతున్నారని, ఇటుకల బట్టిలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. మిషన్ల ద్వారా లోడింగ్‌ చేసి ట్రాక్టర్ల ద్వారా ఇటుకల బట్టిలకు, వ్యాపార సంస్థలకు అమ్ముకొని లాభాలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.ఇంతజరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టు పోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మట్టితరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.