ఓటు

ఓటు భారత పౌరుడి ధర్మ ఆయుధం. ఓటు అనే అస్త్రంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందిఓటు భారత పౌరుడి ధర్మ ఆయుధం. ఓటు అనే అస్త్రంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. జాతి, మత, ప్రాంత, బేధాలు లేకుండా పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓటు రూపంలో ప్రజలకు మేలుచేసే సమర్ధులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనే గొప్ప అవకాశాన్ని రాజ్యంగం కల్పించింది. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవిత్రమైనది. సమాజాభివద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు మన ఓటు గొప్ప ఆయుధం. కాబట్టి ఓటు హక్కు మన జన్మ హక్కు అని ప్రతి ఒక్కరు స్పష్టంగా తెలుసుకోవాలి.
ప్రజాస్వామ్య వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. ‘ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనలో నుంచే వచ్చింది’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగ నిపుణులు కోరుతున్నారు.
స్వార్థ రాజకీయ నాయకులు చూపుతున్న ప్రలోభాలకు లోనై నోటుకు నోరెళ్ళబెట్టుకొని ఓటు వేసి నోరుమెదపలేని పరిస్థితుల్లో కుంగిపోతున్నాం. ప్రజలకు నోట్లు పంచి, బలహీనపరిచి, గెలుపును పటిష్ఠం చేసుకొంటున్నారు కొందరు నాయకులు. నోటుకు ఓటు వేసి ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాం. ఓటుకు నోటు తీసుకొని అర్హతలేని వాళ్ళని గెలిపించడం న్యాయమా? డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి, కుళ్లు రాజకీయాలను ప్రోత్సహించడం ధర్మమా?
ఓటుకు నోటు ఇస్తే పాలకుడు నేరస్తుడైన, కామాంధుడైనా మౌనంగా ఉండిపోవలసిందే. ఇటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం గురించి సామాన్యులు ఇక మర్చిపోవలసిందే. వెన్నుపోటు రాజకీయాలను అణిచివేయాలంటే ఓటు హక్కుని వినియోగించుకోవల్సిందే. అంతకంటే ముందు నోటుకు లొంగిపోకుండా నిజమైన పాలకుడికి ఓటు వేసి గెల్పించుకోవాలి. ఒక వ్యవస్థ నిర్మించడానికైనా, కూల్చడానికైనా మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.
భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం మన వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతంగా సమాజం కోసం ఆలోచించే నాయకున్ని ఎన్నుకోవాలి. ఓటు హక్కు పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యానికి దిక్సూచి ఓటు వినియోగించుకోవటం ప్రధాన కర్తవ్యం. ప్రతి మనిషి తమ కర్తవ్యాన్ని గుర్తిస్తే మార్పు మొదలైనట్టే. అభ్యర్ధుల పూర్వ చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. ఓటు వేయడం అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే అధికారం పౌరుడికి ఉన్నట్టు. కాబట్టి నిర్భయంగా, ప్రశాంతంగా నోటుకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజ్యంగాన్ని గౌరవిస్తూ ఓటు హక్కునీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.