మార్పు కోసం ఓటేయండి

మిజోరాంలో కొత్త పార్టీ జెపీఎం పిలుపు– మిజోరాంలో కొత్త పార్టీ జెపీఎం పిలుపు
– రాష్ట్రంలో అధికార ఎంఎన్‌ఎఫ్‌కు పోటీనిస్తూ ముందుకు

– ఇప్పటికే మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా
ఐజ్వాల్‌ : ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. అక్కడి పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగి తేలుతున్నాయి. అయితే, ఇక్కడ ఐదేండ్ల క్రితం పుట్టుకొచ్చిన ఒక కొత్త పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ ఏడాది ప్రారంభంలో మిజోరాంలోని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2018లో రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెపీఎం) పార్టీ హడావుడిగా ఏర్పడింది. అయితే, ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా అయిన లుంగ్లీలో మొత్తం 11 స్థానాల్లో జేపీఎం సత్తా చాటింది. రెండు ప్రధాన పార్టీలైన అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చింది. ఎన్నికల్లో పోల్‌ అయిన ఓట్లలో దాదాపు సగం ఓట్లను జేపీఎం సాధించటం విశేషం.
ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మానసికంగా బలాన్ని కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అంతేకాదు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎంఎన్‌ఎఫ్‌ పార్టీ నుంచి వెలువడే ప్రకటనలే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా.. తమకు పోటీగా ఉన్న కాంగ్రెస్‌ స్థానంలో జేపీఎం రావచ్చని ఒప్పుకోవటం గమనార్హం. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో నవంబర్‌ 7న మిజోరాంలో ఓటింగ్‌ జరగనున్నది.
జెపీఎం 2018లో ప్రారంభమైంది. దాని బ్యానర్‌ క్రింద అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు 2018లో ఎన్నికలలో పోరాడారు. ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 22 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. 40 సీట్లున్న మిజోరాం అసెంబ్లీకి ఎనిమిది మంది అభ్యర్థులు కూడా ఎన్నిక కావటం గమనార్హం. ముఖ్యంగా, ఈ పార్టీ అరంగేట్రం కాంగ్రెస్‌కు నష్టాన్ని తీసుకొచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై ప్రభావం పడింది. 2019లో జెపీఎం రాష్ట్ర పార్టీ హౌదాను పొందింది. నెమ్మదిగా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ప్రతిపక్ష శక్తిగా ఉద్భవించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరాంలో పోటీ ఆసక్తికరంగా మారనున్నదనీ, జెపీఎం కీలకంగా మారన్నుదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
”మార్పు కోసం ఓటు వేయండి. ఈ కొత్త పార్టీకి అవకాశం ఇవ్వండి” అని జెపీఎం అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం 40 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ పార్టీ 37 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ఎవరికీ ఎన్నికల అనుభవం లేకపోవటం గమనార్హం. ”మిజోరాం గత 36 సంవత్సరాలుగా ఇద్దరు వ్యక్తుల క్రింద ఉంది” అని జెపీఎం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహౌమా అన్నారు. ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ప్రజలు కొత్త ముఖాలు, కొత్త నినాదాలు, కొత్త నాయకత్వం, కొత్త విధానాలను చూడాలనుకుంటున్నారు. వారు పాత పాలనా విధానంతో విసిగిపోయారు” అని ఆయన తెలిపారు.