ఓటు వజ్రాయుధం..

Vote is a diamond weapon.– పార్టీల చరిత్ర చూసి ఓటేయండి..3 గంటలిస్తే పొలం పారుద్దా.!
– ధరణి పోతే భూములాగమైతయి
– కాంగ్రెసోళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే..
– ఈ సారి మోడీకి మెజార్టీ రాదు.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే 
– మతపిచ్చి లేపే బీజేపీని పాతరేయాలి : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/
ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/డిచ్‌పల్లి
‘కేసీఆర్‌కేం పనిలేదు. 24 గంటల కరెంటిస్తుండు వేస్ట్‌ అంటున్న కాంగ్రెసోళ్లు చెప్పినట్టు 3 గంటల కరెంటిస్తే పొలం పారుద్దా..? 10 హెచ్‌పీ మోటార్లు యాడదేవాలి. ధరణీ తీసేస్తే భూములాగమైతయి. భూమిపై హక్కు పోతది. వీఆర్‌ఏలు, రెవెన్యూ వాళ్లు భూమెంతుంది..? ఎంతిస్తరు..? అనే కథ వస్తది. కాంగ్రెసోళ్లు అబద్దాలు చెప్పే మోసగాళ్లు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. పార్టీల చరిత్ర ఏంటో అభ్యర్థుల గుణమేంటో ఆలోచించి ఓటేయండి. యాభైయేండ్ల కాంగ్రెస్‌ పాలన లో తెలంగాణెట్లుండే. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ యెట్లుందనేది పరిశీలించండి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో సీఎం మాట్లాడుతూ.. మోడీ సర్కారు తెలంగాణకు ద్రోహం చేసిందని, ఒక్క మెడికల్‌ కళాశాల, నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు. ఇక్కడ నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి గడ్డిపీకుతున్నారా అని ప్రశ్నించారు. మతపిచ్చి రేపే బీజీపీని పాతరేయాలని తెలిపారు. ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయకూడదని.. వేస్తే మురికి కాల్వలో వేసినట్లవుతుందని చెప్పారు. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోడీకి మెజార్టీ రాదని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుం దని జోస్యం చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ఈ తరుణంలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే తెలంగాణ నాశనం అవుతుందని, ఆ పార్టీకి ఓటు వేసినా మరింత వేస్ట్‌ అవుతుందని అన్నారు. రైతుల మేలు కోసం మూడేండ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి రైతులకే అధికారమిచ్చామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అధికారం ఉంచుకుంటారా.. పోగొట్టుకుంటారా.. అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో 50 ఏండ్ల చనాక-కోర్ట బ్యారేజీ కల నెరవేర్చామని, అక్కడ్నుంచి పిప్పల్‌కోటి రిజర్వాయర్‌కు లింక్‌ కలిపి నీటిని నింపుతామని చెప్పారు. తాను బతికున్నంత వరకు రాష్ట్రం సెక్యులర్‌గానే ఉంటుందని, 75ఏండ్లలో మైనార్టీల కోసం కాంగ్రెస్‌ కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ఈ పదేండ్లలోనే రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
మంచిప్ప రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తాం
నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే మంచిప్ప రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లోని వ్యవసాయానికి ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో ప్రతి మూడు ఎకరాలకు నీటిని అందిస్తామని అన్నారు. మంచిప్ప రిజర్వాయర్లో భూములు కోల్పోయిన బాధితులకు మంచి నష్ట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ నిచ్చారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని అన్నారు. త్వరలోనే ఐటీ రంగంలో బెంగుళూరు కంటే మెరుగైన రాష్ట్రంగా ఉంటామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టబోయే బ్యూరో పథకాన్ని గల్ఫ్‌ కుటుంబాలకు కూడా వర్తింపజేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. సంపదను పెంచి.. దాన్ని పేదోడికి పంచాలనే నినాదంతో ముందుకు సాగామని తెలిపారు. ఎవరూ అడగకముందే పెన్షన్‌ పెంచామని, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, ధాన్యాన్నీ కొనుగోలు చేస్తున్నామన్నారు.
ఓట్లు రాగానే ఆగమాగం కావొద్దు
ఓట్లు రాగానే ఆగమాగం కావొద్దని, ఆలోచించి ఓట్లేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌, తాగు, సాగునీరు రాలేదని, సంక్షేమమే లేదన్నారు. 24 గంటల కరెంట్‌, రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీనది నీటితో కళకళలాడుతుందన్నారు. నర్సాపూర్‌లో కొత్త మండలాలు, డివిజన్లు ఏర్పాటు, ఇతర పనులను అధికారంలోకి వచ్చాక తప్పక చేస్తామన్నారు. కాగా, నర్సాపూర్‌ సభలో పలువురు కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నాయకులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సాపూర్‌ టికెట్‌ ఆశించిన టీపీసీసీ నాయకులు గాలి అనిల్‌కుమార్‌, మెదక్‌ టికెట్‌ ఆశించిన టీపీసీసీ నాయకులు మేడం బాలకృష్ణ, సంగారెడ్డి బీజేపీ టికెట్‌ ఆశించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పటాన్‌చెరు టికెట్‌ ఆశించిన రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌ గౌడ్‌, తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

సీఎం కేసీఆర్‌ సభలో బుల్లెట్ల కలకలం
నవ తెలంగాణ – నర్సాపూర్‌

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ హల్‌చల్‌ చేశాడు. అతనిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పరిశీలించారు. అతని వద్ద రెండు బుల్లెట్లు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.