మే 13న ఓటేయండి.. ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించండి

మే 13న ఓటేయండి.. ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించండి– తెలంగాణలో పాడిపంటలు బాగా పండాలి
– తెలుగు భాష అందమైనది..నృత్యకీర్తనలు గొప్పవి
– రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : రాజ్‌భవన్‌ ఉగాది వేడుకల్లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పిలుపునిచ్చారు. తెలుగు భాష అందమైనదనీ, తెలుగులోని నృత్యకీర్తనలు ప్రపంచంలోనే పేరొందినవని కొనియాడారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలనీ, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను పురస్కరించుకుని పంచాంగ పఠనం నిర్వహించారు. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు శాస్త్రీయ, బంజారా నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరధే, రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, గవర్నర్‌ కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ మరింత దూకుడుగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. మన దేశం అన్ని రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. జ్యోతిష్య అంచనాలు ఏమైనప్పటికీ నిరంతర ప్రయత్నాలు, నిబద్ధత, పట్టుదలతో అభ్యుదయ సమాజ నిర్మాణం అనే కలను సాకారం చేసుకోగలుగుతామనేది దృఢ విశ్వాసం తనకున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగాది పచ్చడి ఆరు రుచులను కలగలుపుకుని పోయినట్టు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వచ్చే కష్టాలను దృఢ సంకల్పంతో ఎదుర్కొని ముందుకెళ్లాలని సూచించారు. అరవై సంవత్సరాల కాలచక్రంలో క్రోధి ముప్పై ఏడవదనీ, ఈ సంఖ్య శుభసూచికమని చెప్పారు. దేశం సర్వతోముఖాభివృద్ధి, పురోగతి, స్వావలంబన కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానన్నారు. దేశీయ పరిశోధనలు, ఆవిష్కరణలు, అధిక ఉత్పత్తుల సంస్కృతిని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. జీవితంలో మనం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, మన ప్రయత్నాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.