ఓట్ల పాట్లు..

– అభ్యర్థుల సర్కస్ ఫీట్లు, నోట్ల పంపిణీలో అభ్యర్థుల మధ్య పోరు
– డబ్బుల కోసం రేయింబవళ్లు ఓటర్ల ఎదురుచూపులు
– కొన్ని వార్డులో పంపిణీ, మరికొన్ని వార్డుల్లో మొండి చెయ్యి,
– వరదల డబ్బు  ప్రవాహం, రాత్రి 11 గంటల వరకు సాగిన ఓటింగ్
– గెలుపోటముల పై అభ్యర్థుల లెక్కలు.
నవతెలంగాణ – సూర్యాపేట
ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్న తపన తో అభ్యర్థులు ఓట్ల కోసం పలు రకాల పాట్లు పడ్డారు. ప్రధానంగా పోలింగ్ సమయంలో గురువారం నాడు అభ్యర్థులంతా ఓటర్లను ఏదో ఒక రూపంలో ప్రసన్నం చేసుకునేందుకు తపించారు. ఇందులో భాగంగానే డబ్బు విషయంలో ఎంత కైనా సరే పంపిణీ చేయడానికి కుస్తీ పట్టారు. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులతో కలుపుకొని దాదాపుగా 30 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధానమైన పోటీదారులైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి పార్టీల మధ్య భీకర పోరు నడిచింది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుండి ప్రచారంతో పాటు అన్ని విషయాలలో కూడా పోటీ పడుతూ వచ్చిన ఆ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అస్త్రంగా డబ్బులు పంపిణీ కి శ్రీకారం చుట్టారు.బుధవారం రాత్రి నుంచి గురువారం పోలింగ్ కొనసాగే వరకు అభ్యర్థులు తమ అనుచరులతో పాటు గ్రామ ,వార్డు బాధ్యుల ద్వారా డబ్బులను చేరవేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో డబ్బు ఏరులై పారింది. ఇక మద్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లాలో పోలీసుల నిఘా లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. అభ్యర్థుల అనుచరులు యథేచ్ఛగా  ఇంటింటికి తిరుగుతూ పంపకాలు చేస్తూ వచ్చారు. గురువారం కీలకం కావడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో డబ్బులు విచ్చలవిడిగా ఓటర్లకు వెదజల్లారు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఇంటింటికి 2000 రూపాయలు పంచినట్లు విమర్శలు నెలకొన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో 3000 రూపాయలు పంచినట్లు ప్రచారం నడిచింది. ప్రధానంగా ఈ పార్టీ వారు తమకు పక్కాగా ఓటు వేస్తారని భావించిన వారికి మాత్రమే డబ్బులు పంచారు.ఒకరకంగా వీరు కొన్ని వార్డుల్లో డబ్బులు పంపిణీ లో బీభత్సకరమైన బ్యాటింగ్ చేశారని చెప్పక తప్పదు.ఇక బి.ఆర్.యస్ మాత్రం 60% చొప్పున 2000 పంచినట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో వార్డులలో కొంతమంది కౌన్సిలర్లు డబ్బులు పంచక పోవడంతో ఆయా వార్డులకు చెందిన ప్రజలు రోడ్డుకెక్కి గగ్గోలు పెట్టారు. ఇందులోనే కొంతమంది కౌన్సిలర్లు 60% పంచకుండా అందులో 30% నొక్కి మిగతాది పంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరికొన్ని వార్డులో ఇంకొందరు కౌన్సిలర్లు తమకు నచ్చిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన వారికే డబ్బులు పంపిణీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అధికార పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ తన భార్య పుస్తె,తాడు అమ్మి వచ్చిన డబ్బును పంచుతున్నానని బిల్డప్ లు ఇస్తూ 1000 రూపాయలు పంచుతూ మిగతా పైకం అమాంతం నొక్కినట్లు ఆ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్  పార్టీ మాత్రం 500 రూపాయల చొప్పున పంచగా బిఎస్పి  పార్టీ మాత్రం ఎంపిక చేసిన వార్డులలో 500 రూపాయలు చొప్పున పంపిణీ చేసినట్లు బహిరంగ విమర్శలు నెలకొన్నాయి. ఇది గాక కొన్ని  వార్డులలో పంపిణీ చేయకపోవడంతో అవార్డుల వారు ప్రధాన పార్టీల పై గుర్రుగా ఉన్నారు. కాగా రెండు ప్రధాన పార్టీల వారు  పట్టణంలో పూర్తిస్థాయిలో డబ్బు పంపిణీ చేయక పోవడంతో ఇవి దక్కని ఆయా ప్రాంతాల ప్రజలు వీరిపై మండిపడుతున్నారు. డబ్బులు రాకపోవడంతో పంపిణీ దారుడి ఇంటి ముందుకు వెళ్లి ఓటర్లు గగ్గోలు పెట్టారు.ఇది గాక పోలింగ్ రోజున డబ్బు పంచుతారనే ఆశతో ఓటర్లు ఎదురుచూశారు. పట్టణ ప్రజలు ప్రధాన వార్డులలో ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో పనులను మానుకొని అభ్యర్థులు డబ్బులు ఇస్తారేమోనని ఆశతో నివాసాల ఎదుట పలు కూడళ్లలో అమ్మలక్కలు చేరి డబ్బులు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కానీ ఎవరు కూడా రాక పోవడంతో మరుసటిరోజు ఉదయం పూట నైనా పంపిణీ చేస్తారని ఆశతో నిట్టూరుస్తూ కనిపించారు.డబ్బులు అందక పోవడం తో పోలింగ్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నత్తనడకన సాగింది. అనంతరం బిజెపి, బి.ఆర్.యస్ లు డబ్బులు పంచడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు పోటెత్తారు. దీంతో ఓటింగ్ రాత్రి 11 గంటల వరకు సాగింది.అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రం బి.ఆర్.యస్ పార్టీ 1000 పంచగా కాంగ్రెస్ 500 పంచింది. కోదాడ,హుజుర్ నగర్ లలో  కాంగ్రెస్,బి.ఆర్.యస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బు పంచినట్లుగా చర్చ నడిచింది. ఈ రకంగా ప్రధాన పార్టీలు ఓటర్లను పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి కొనుగోలు చేయడానికి పలు రకాల సర్కస్ ఫీట్లు చేశారు.చివరి రోజును అభ్యర్థులంతా సాధ్యమైనంత వరకు డబ్బుతో ఓటర్లను గందరగోళానికి గురిచేశారు.  ప్రతి అభ్యర్థి ఇచ్చిన నగదు మద్యాన్ని తీసుకున్నారు. నీకే ఓటు వేస్తామని నమ్మబలుకుతున్నారు. కానీ ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు.ఈ క్రమంలో అభ్యర్థులు మాత్రం తమ గెలుపోటములపై లెక్కలు కడుతూ తమ నివాసాల్లో బిజీగా కనిపించారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు చాలా ఖరీదైనవి గా మారాయి. డబ్బులు ఏరులై పారాయి. ఏది ఏమైనప్పటికీ  3 వ తేదీన నిర్వహించే కౌంటింగ్ తో గెలిచే అభ్యర్థి భవితవ్యం తేలనుంది.