ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తం

ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తం– అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. అంతు చిక్కని ఓటరు నాడి
– స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
– పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్ల సరళిపై పోస్ట్‌మార్టం
– మూడు పార్టీల్లోనూ గెలుపుపై ధీమా.. ఎవరి లెక్కలు వారివే
– ఫలితాల కోసం 20 రోజుల నిరీక్షణ
అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఓటర్లు తమ అభిప్రాయాల్ని బ్యాలెట్‌ యూనిట్‌లో వ్యక్తం చేశారు. పోలింగ్‌ సరళి చూశాక ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ అధికమవుతోంది. నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటింగ్‌ సరళిపై పోస్ట్‌మార్టం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పట్టణ ఓటర్లు ఓ తీరుగా.. గ్రామీణ ప్రాంత ఓటర్లు మరో తీరుగా.. పార్టీల వైపు మొగ్గు చూపినట్టు విశ్లేషణలు చెప్తున్నారు. ఫలితాలు ఎట్లా ఉంటాయనేది అభ్యర్థులకే కాదు.. పార్టీ అధినేతలతో సహా ఓటేసిన ఓటర్లకు సైతం అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. తీరని ఉత్కంఠకు తెరపడేందుకు మరో 20 రోజుల పాటు నిరీక్షించక తప్పదు.
అంతు చిక్కని మెదక్‌ ఓటరు నాడి.. అభ్యర్థుల్లో టెన్షన్‌
పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఓటరు నాడి అంతు చిక్కట్లేదనే చెప్పాలి. ఓటర్ల తీర్పు పట్ల స్పష్టత రాకపోయే సరికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75.09 శాతం ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25 శాతం పోలవగా, పటాన్‌చెరు నియోజకవర్గంలో 63.01 శాతమే ఓట్లు పడ్డాయి. మెదక్‌ లోక్‌సభ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. ఓటర్లు సైతం ఒక వైపు మొగ్గలేదు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం హరీశ్‌రావు, కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయగలిగారు. కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకున్నారు. గ్రామీణ ఓటర్లు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపినప్పటికీ పట్టణాల్లో ఆ పరిస్థితి కనిపించలేదు. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధిస్తుందనే అంచనాల్లో ఆ పార్టీ నేతలున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లోనూ పోటాపోటీగా ఓట్లు వస్తాయంటున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన మేలు, కేసీఆర్‌, హరీశ్‌రావు పట్ల ఉన్న అభిమానం, బూత్‌ స్థాయిల్లో చేసిన తాయిలాల మేనేజ్‌మెంట్‌ వర్కవుట్‌ అవుతాయని ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు గెలుపుపై ధీమాగా ఉన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాకలో సైతం బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని లెక్కలేస్తున్నారు. ఆ మూడు స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే డబుల్‌ ఓట్లు ఎంపీ అభ్యర్థికి వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, బీసీ, ముదిరాజ్‌ కార్డ్‌ బాగా ప్రభావితం చేసిందని చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సైతం గెలుపు ఖాయమంటున్నారు. ఆయన రెండు ఎన్నికల్లో ఓడిపోవడం, స్థానికంగా తనకున్న సానుకూల పరిస్థితులు కలిసొస్తాయంటున్నారు. ప్రధాని మోడీ ప్రభావంతో యువత, వ్యాపారస్తులు, మధ్య తరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారనే ఆశలో ఉన్నారు.
జహీరాబాద్‌లో క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి మేలు చేస్తుందో..?
జహీరాబాద్‌ పార్లమెంట్‌లో 74.63 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ నియోజకవర్గం పరిస్థితి కూడా ఉత్కంఠగా ఉంది. లింగాయత్‌ సామాజిక తరగతి ఓట్లు ఎటు వైపు మొగ్గు చూపాయో తేలట్లేదు. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం జరగడంతో అది ఎవరికి కలిసొస్తుందనేది చూడాలి. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షేట్కర్‌, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఇద్దరూ లింగాయత్‌ సామాజిక తరగతికి చెందిన వారు కావడంతో ఓట్లు చీలాయి. ఆ సామాజిక తరగతి ఓట్లు గంప గుత్తగా ఒక్కరికే పడలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలున్న అందోల్‌, నారాయణఖేడ్‌, జక్కల్‌, ఎల్లారెడ్డిలో భారీ మెజార్టీ వస్తుందంటున్నారు. మిగతా మూడు చోట్ల కూడా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలతో ఓటర్లు హస్తం గుర్తుకే వేశారని చెబుతున్నారు. కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలున్నప్పటికీ ఆ పార్టీలో ఒకటి, రెండు చోట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే సహకరించలేదనే గుసగుసలూ ఉన్నాయి. అది ఏ మేరకు నష్టం చేస్తుందనేది చూడాలి. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ సైతం గెలుస్తామంటున్నా.. క్షేత్రస్థాయిలో ఓట్లు పడలేదనే చర్చ నడుస్తోంది. పైగా గులాబీ ఓట్లు కారుకు పడకపోవడం వల్ల క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు. అది కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను చూసి అటు వైపు మళ్లిందా..? లేక బీఆర్‌ఎస్‌ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్‌కు అనుకూలంగా మారిందా..? వేచి చూడాలి.
పోలింగ్‌ సరళిపై పోస్ట్‌మార్టం.. 20 రోజుల నిరీక్షణతో ఉత్కంఠ
ఓటర్లు తీర్పు తెలుసుకునేందుకు మరో 20 రోజులు ఆగాల్సిందే. మరో మూడు దశల్లో పోలింగ్‌ పూర్తయ్యాక జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేస్తారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు ఫలితం తేలేందుకు 20 రోజుల పాటు ఉత్కంఠగా ఎదురు చూడక తప్పదు. నరాలు తెగే ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరవుతున్న అభ్యర్థులు అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు. పోలింగ్‌ సరళిపై పోస్ట్‌మార్టం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రభావం చూపిన పరిస్థితుల్ని అంచనా కడుతున్నారు. భారీ జన సమీకరణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌, కుల, మతం ప్రభావం, ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి, స్థానిక ఆంశాలు.. ఇలా అనేక కోణాల్లో లెక్కలేస్తున్నారు. ఎక్కడ వీక్‌గా ఉన్నాం.. ఎక్కడ ఆధిక్యంలో ఉన్నామనేది బూత్‌ కమిటీలు, పార్టీ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులిచ్చిన రిపోర్టులను తిరగేస్తున్నారు. పార్టీ పరమైన అంచనాలే కాకుండా వ్యక్తగతంగా అనుయాయులతో సేకరించిన గ్రౌండ్‌ రిపోర్టును బట్టి గెలుపునకు దగ్గరగా ఉన్నామా..? దూరంగా ఉన్నామా..? అనే స్పష్టతకు వస్తున్నారు.
స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సోమవారం పూర్తయ్యాక జియో ట్యాగింగ్‌ అనుసంధానంతో ఈవీఎంలను పోలీస్‌ బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూముల్లోకి చేర్చారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజవర్గం పరిధిలో ఉన్న 2124 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూముల్లో ఉంచారు. గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను నర్సాపూర్‌లో ఉన్న బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని ఈవీఎంలను ప్రభుత్వ గిరిజన జూనియర్‌ కళాశాల్లో భద్రపర్చారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఈవీఎంలు, పోస్టల్‌ బ్యాలెట్లను గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఉంచారు.