– ఎన్నికల ర్యాలీలో మిచెలీ ఒబామా
మిచిగాన్: మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓటేస్తే, మహిళలకు వ్యతిరేకంగా ఓటేసినట్టేనని మిచిగాన్‌లోని పురుష ఓటర్లనుద్దేశించి మిచెలీ ఒబామా అన్నారు. అబార్షన్, ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్)కు సంబంధించిన చట్టాలను ట్రంప్ అధికారంలోకి వస్తే మరింత కఠినతరం చేస్తారని, ఆయన స్త్రీ వ్యతిరేకి అని మిచెలీ ఒబామా విమర్శించారు. పునరుత్పత్తి సమయంలో మహిళలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారని, ప్రసవ సమయంలో రక్త స్రావమైతే అది స్త్రీ మరణానికి దారి తీస్తుంది. గుర్తించబడని గర్భాశయ కేన్సర్‌తో బాధపదుతున్న వారి పరిస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. అబార్షన్ అనేది స్త్రీల హక్కు, దీనికి ట్రంప్ వ్యతిరేకి కాబట్టి ఆయనను ఓడించాలని మిచెల్ ఒబామా పిలుపునిచ్చారు.. శనివారం మిచిగాన్‌లోని కలమజూలోని వింగ్స్ ఈవెంట్ సెంటర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హారిస్‌తో కలసి పాల్గొన్న ఈ మాజీ అమెరికన్ ప్రథమ మహిళ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. వైట్ హౌస్‌కి డెమొక్రాటిక్ అభ్యర్థి హారిస్‌ను పంపాలని ఆమె పిలుపునిచ్చారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు ఓటేస్తే వచ్చే పర్యవసానాల గురించి ఆమె హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు5న జరగనున్న సంగతి తెలిసిందే. పురుషులలో ముఖ్యంగా యువకుల్లో ట్రంప్‌కు మొగ్గు ఉండగా, మహిళలు, ముఖ్యంగా యువతుల్లో హారిస్‌కు మద్దతు ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.