– ఎలక్టోరల్ బాండ్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– న్యాయస్థానం తీర్పు కార్పొరేట్ అనుకూల పార్టీలకు చెంపపెట్టు: మాజీ జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటు ఫ్రీగా వేయోచ్చు..కానీ..అది ఫెయిర్‌గా మాత్రం లేదని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు, ఎలక్టోరల్ బాండ్ స్కీం’ అంశంపై హైకోర్టు సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పౌరులకు ఇష్టం లేని అనేక విషయాలు దేశంలో జరుగుతున్నాయన్నారు. అందులో ప్రధానంగా గోవధకు పాల్పడుతున్నారంటూ చట్ట విరుద్దంగా వారిపై దాడులు చేయటం, లవ్‌జీహదీ పేరుతో,బుల్డోజర్ దాడులు ఇత్యాది అనేక చర్యలను చూస్తూ సమాజం భరిస్తుందని చెప్పారు. ఈ వ్యవహారాలు మనకు నచ్చకపోయినప్పటికీ వాటిని ఎదిరించటంలో వెనుకాడుతు న్నామన్నారు.ప్రస్తుతం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ గురించి ఎక్కువ చర్చిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయటం తగదని చెప్పారు.
ఈ తరహాలోనే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో వచ్చిన తీర్పు ఆహ్వానించదగిందేనన్నారు. ఈ తీర్పు కార్పొరేట్ అనుకూల పార్టీలకు చెంపపెట్టు లాంటిదని చెప్పక తప్పదన్నారు. సీపీఐ(ఎం) పార్టీ మినహా, అన్ని పార్టీలు ఈ వ్యవహారంలో లబ్దిపొందాయన్నారు. ఓట్లు కొనేవారికి ఇంత డబ్బెక్కడిది అనే ప్రశ్న ఓటరుకు రానంత కాలం ఫెయిర్ ఓటు కానే కాదన్నారు. వందల, వేల కోట్లు సహాయం చేసి కొన్ని పార్టీలను అధికారంలోకి రప్పిస్తున్నదీ, కొనసాగేలా చేస్తున్నదీ కార్పొరేట్ కంపెనీలేనని వివరించారు.
ఈ నిజాలు ప్రజల కండ్లల్లో పడకుండా వేల కోట్ల రూపాయిల ఎన్నికల నిధి కూడగట్టుకొనేందుకు చేసిన కుట్రే ‘ఎన్నికల బాండ్ స్కీమ్’ అని తెలిపారు. ఇది బ్లాక్ మనీని అరికట్టటానికేనని వంక చూపెట్టటం విడ్డూరమన్నారు.
ఎవరెవరు ఏఏ పార్టీకి ఎంత మొత్తం ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఇచ్చారనే వివరాలు ప్రజలకు, ప్రజాసంస్థలకు, చెప్పాల్సిన అవసరంలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడమంటే ప్రజాస్వామ్యం, హక్కులు ఉల్లంఘిచట మేనన్నారు. పారదర్శకతలేని ఈ ఎలక్టోరల్ బాండ్స్ నిష్పాక్షిక ఎన్నికలు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఐఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి కె వెణుగోపాల్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీ, ప్రభుత్వ విధానాలను కొనుక్కుంటున్నారని చెప్పారు. ఇది చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పటం హర్షణీయ మన్నారు. ఈ విధానాన్ని ఓప్పుకోవటం కుదరదని ఆ నాడే ఆర్‌బీఐ చెప్పిందని గుర్తు చేశారు. ఆర్‌బీఐ, ప్రతిపక్షాలు వద్దన్నా..బిల్లు పాస్ చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంలో 50శాతం బాండ్లు బీజేపీకి వచ్చాయంటే..ఆ పార్టీకి కార్పొరేట్లతో బంధం ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చన్నారు. అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీం సరైనది కాదని అనేక అభ్యంతరాలను ఆర్‌బీఐ, ఎలక్షన్ కమీషన్లు లేవెత్తినప్పటికీ తమ ఇష్టానుసారంగా ఎలక్టోరల్ బాండ్ స్కీంను ప్రవేశ పెట్టి వేలాదికోట్ల ధనాన్ని కార్పొరేట్ సంస్థలచే కొనుగోలు చేయించి అవి తమకు ఇచ్చేలా చేయటం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో ఐలు నాయకులు పార్థసారధి, డీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.