బాధ్యతగా ఓటు హక్కును వినియోగించాలి

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా బాధ్యతగా తమ ఓటు హక్కును కూడా వినియోగించాలని ఆర్డీఓ వినోద్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల విశ్వశాంతి స్కూల్ స్వీప్ కార్యాలయంలో భాగంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. దీనికి ఆయన హాజరై పలు విషయాలను తెలియజేశారు.  ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు ఎంతో విలువైందని ఆర్డీఓ వినోద్ కుమార్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించాలన్నారు. గత సంవత్సరంలో ఒకే సారి నమోదుకు అవకాశం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరంలో నాలుగు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. జనవరి, జూలై, ఏప్రిల్, అక్టోబర్ నెలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తమతో పాటు ఇతరులను కూడా ఓటరు నమోదు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.