వీఆర్‌ఓ వ్వవస్థను తిరిగి అమలు చేయాలి

– డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌
నవ తెలంగాణ- గజ్వేల్‌
గత ప్రభుత్వం రద్దు చేసిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్వవస్థను తిరిగి అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌లో బుధవారం శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ అవినీతి పేరుతో వీఆర్‌ఓ వ్వవస్ధను రద్దు చేసిన గత ప్రభుత్వం భూ పరిపాలనను విధ్వంసం చేసి పేదలకు భూ హక్కులను నిరాకరించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో భూ వివాదాలు, భూహక్కుల పరిష్కారానికి వీఆర్‌ఓ వ్వవస్థ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ధరణి అధ్యయనం కోసం కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కమిటీ ప్రజా సంఘాలతో చర్చించాలని, ధరణి బాధితులను కలిసి సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, డీబీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు పాల్గొన్నారు.