హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా విఎస్‌ సంపత్‌

VS Sampath as HCA election officer– నియమించిన జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. విరుద్ధ ప్రయోజనాలు, బహుళ క్లబ్‌ల యాజమాన్యం సహా పలు కారణాలతో 57 క్రికెట్‌ క్లబ్‌లను మూడేండ్ల పాటు ఎలక్ట్రోరల్‌ జాబితా నుంచి తొలిగిస్తూ సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ జస్టిస్‌ లావు నాగేశ్వర రావు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 15న హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో.. భారత మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్‌ విఎస్‌ సంపత్‌ను హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా భారత ఎన్నికల కమిషనర్‌ గా పని చేసిన వ్యక్తిని నియమించాలని 2018లో హెచ్‌సీఏ రూల్స్‌లో పొందుపరిచారు. అపెక్స్‌ కౌన్సిల్‌ తరఫున జస్టిస్‌ నాగేశ్వరరావు ఈ మేరకు విఎస్‌ సంపత్‌ను నియమించారు. ఎన్నికల నిర్వహణ లో ఎవరైనా సహాయకుడిని నియమించుకునే స్వేచ్ఛ, వెసులుబాటును విఎస్‌ సంపత్‌కు కల్పించారు. ఇక, విరుద్ధ ప్రయోజనాలతో ఓటు హక్కు తొలగించడాన్ని ఓ సభ్యుడు ఏక సభ్య కమిటీకి ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదుపై సైతం విఎస్‌ సంపత్‌ ఎన్నికల అధికారి హోదాలో తగు నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్‌ నాగేశ్వర రావు సూచించారు.