– అసెంబ్లీలో మాటల తూటాలు…
రాష్ట్ర మూడో శాసనసభలో మాటల తూటాలు పేలాయి. ఇప్పటి వరకూ సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం… తదితర కార్యకలాపాలతో ప్రశాంతంగా, సాదాసీదాగా కొనసాగిన సభ శనివారం… అధికార, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ ఢ అంటే ఢ అనే స్థాయిలో వాగ్బాణాలను వదిలారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఒకదానిపై మరోటి పై చేయి సాధించేందుకు ప్రయత్నించాయి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. తమ వైపు నుంచి ఒక్కరు మాట్లాడితే అధికార పక్షం వైపు నుంచి ముఖ్యమంత్రితో సహా నలుగురు మంత్రులు దాడి చేయటమేంటని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ఆయన ఏకరువు పెడుతూ…’ఇంతటి దారుణమైన ప్రసంగాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఈ ప్రసంగాన్ని చూసి సభలో ఒక సభ్యుడిగా సిగ్గు పడుతున్నా…’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు. ‘వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయిందనే’ చందంగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉందంటూ దుయ్యబట్టారు. పదేండ్ల తమ హయాంని విధ్వంస పాలనంటూ అధికార పార్టీ చెబుతున్న నేపథ్యంలో దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల తరబడి పాలించి దివాళా తీయించిన కాంగ్రెస్ విధానాలను ఏమనాలంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ సైతం ధీటుగా సమాధానమిచ్చారు. కొంతమంది ‘ఎన్‌ఆర్‌ఐ’లకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే తెలియదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు సిరిసిల్లలో ఉద్యమ నాయకుడైన కెకె మహేందర్‌రెడ్డి చేసిన కృషిని పక్కనబెట్టి… తన కుమారుడైన ఎన్‌ఆర్‌ఐ కేటీఆర్‌కు మేనేజ్‌మెంట్ కోటాలో మాజీ సీఎం (కేసీఆర్) టిక్కెట్టును ఇచ్చారని దుయ్యబట్టారు. సభలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదనీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై సాయంత్రం సమాధానమిచ్చిన రేవంత్… గత బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలను తూర్పారబట్టారు. ప్రగతి భవన్ గడీలను బద్ధలు కొట్టాం.. ఇనుప కంచెలను తొలగించామంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ సభ్యుడు కూనంనేని అధికార, విపక్షాలు రెండింటికీ చురకలంటించారు. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు గతంలో బీఆర్‌ఎస్‌ను, ఇప్పుడు కాంగ్రెస్‌ను గెలిపించారని అక్బర్ గుర్తు చేశారు. కానీ ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థినీ గెలిపించుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఉద్యమాలపై అణచివేత, వాటిపై నిర్బంధం కొనసాగాయని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ మద్దతుతో గెలిచినప్పటికీ ఆ ప్రభుత్వం చేసే ప్రతి పనినీ సమర్థించబోనని అన్నారు. ఈ రకంగా శాసనసభ విమర్శలు, ప్రతి విమర్శలు, వాగ్బాణాలు, సెటైర్లతో గతంలో వైఎస్, చంద్రబాబుల హయాంను తలపించింది. సీఎం సమాధానం అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ : స్పీకర్
తొలుత ఉదయం 10.05 నిమిషాలకు సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నికైనట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమకు సమాచారం అందించారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అధికార పక్షం తర్వాత ఆ పార్టీకే అత్యధిక మంది సభ్యులున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నామని ఆయన తెలిపారు. అందువల్ల ఆ పార్టీ పక్షనేత కె.చంద్రశేఖరరావును ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభాపతి సూచన మేరకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అధికార పార్టీ సభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఆ తీర్మానాన్ని అదే పార్టీకి చెందిన జి.వివేక్ బలపరిచారు.
ఢిల్లీ నామినేటెడ్ సీఎం..ప్రజలెన్నుకున్న సీఎం కాదు
– చీమలు పెట్టిన పుట్టలో దూరింది ఆయనే
– గవర్నర్ ప్రసంగంలో అన్నీ అసత్యాలు, అభూతకల్పనలే
– ఇంతటి దారుణమైన ప్రసంగాన్ని అసెంబ్లీ చరిత్రలో వినలే
– పాలకపక్షమైనా..విపక్షమైనా..మేమెప్పుడూ ప్రజల పక్షమే
– బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అన్నోళ్లు నిలబెట్టుకోవాలే : కేటీఆర్
రేవంత్‌రెడ్డి ప్రజలెన్నుకున్న సీఎం కాదనీ, ఢిల్లీ పెద్దలు నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని బీఆర్‌ఎస్ సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అందులో అసత్యాలు, అభూతకల్పనలు, సత్యదూరాలున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రసంగం వినడానికి తాను సిగ్గుపడుతున్నాననీ, ఇంతటి దారుణమైన ప్రసంగం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ వినలేదని వ్యాఖ్యానించారు.
వెయ్యి ఎలుకల్ని పట్టి తిని పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుగా 10 ఏండ్ల తమ పాలనపై అన్నీ నెట్టేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని బట్టే వచ్చే ఐదేండ్లు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో తమకూ, ప్రజలకూ అర్ధమైందన్నారు. పాలకపక్షంలో కూర్చునా..విపక్షంలో కూర్చునా తామేప్పుడూ ప్రజల పక్షమే అని చెప్పారు. తెలంగాణ ప్రజల తరఫున గొంతు విప్పుతామన్నారు. తెలంగాణ ఏర్పడకముందు ప్రజాసమస్యలను ఏకరువు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజికేంద్రాలు, ఎన్‌కౌంటర్లు, ఆకలి చావులా? అని ప్రశ్నించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పదవుల కోసం పెదాలు మూసుకున్నది అప్పటి కాంగ్రెస్ మంత్రులు కాదా? అని నిలదీశారు.
‘తెలంగాణకు పైసా నిధులివ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని అంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. మంత్రుల వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘మొదటిరోజే మంత్రులు ఉలికిపడితే ఎలా? భయం ఎందుకు? గవర్నర్ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటే గతం గురించి ఎందుకు మాట్లాడుతాం?’ అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇద్దామని తమ నేత కేసీఆర్ సూచించారన్నారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అవుతుందని కూడా చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య 1.85 శాతమే ఓట్ల తేడా ఉందనీ, మిడిసిపాటు సరిగాదన్నారు. తమవైపు ప్రతిపక్షాలతో కలుపుకుని 54 మంది సభ్యులున్నారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకుని మాట్లాడుతూ..అచ్చోసిన ఆంబోతులా వ్యవహరించవద్దని సూచించారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నోట ఆ మాటలు రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నారైలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని సీఎం అనటం సరిగాదన్నారు. ఎన్నారైల పట్ల సీఎంకు ఉన్న ప్రేమను ఎన్నారైలు గమనించాలని కోరారు. వందల కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం వాళ్లను తీసుకొచ్చి అధ్యక్షులను చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడితే ఎట్ట? అని విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే గొప్పలు చెప్పుకోవడానికే వాడుకోవడం సరిగాదనీ, అన్నింటి గురించీ చర్చించాలని కేటీఆర్ అన్నారు. తాను ఒక్కడిని మాట్లాడుతుంటే ఐదుగురు మంత్రులు, సీఎం జోక్యం చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటికి దిక్కు లేదు. కరెంట్ అనేది అడ్రస్సే లేదు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌తో లక్షన్నర మంది నడుములు వంగిపోతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసలు పోయే వారని’ కేటీఆర్ గుర్తు చేశారు. పదేండ్ల గురించే చర్చించాలంటున్నారు..మరి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన గురించి తాము మాట్లాడొద్దా అని ప్రశ్నించారు.
విద్యుత్ రంగంపైనా గవర్నర్ ప్రసంగంలో చాలా అవాస్తవాలు మాట్లాడారన్నారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆస్తుల విలువలను దాచి అప్పులను మాత్రమే ఎత్తిచూపడం సరిగాదన్నారు. 2009 నుంచి 2013 మధ్యలో 8198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో పాలమూరు నుంచి వలసలు ఆగిపోయాయనీ, 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారని వివరించారు. నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించింది కేసీఆరే అన్నారు.
కేంద్రం కూడా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నేతన్నల ఆత్మహత్యలతో ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల తమ ప్రభుత్వ హయాంలో సిరిశాలగా మారిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం గెలుచుకున్నామన్నారు. బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని కాంగ్రెసోళ్లు గెలిచారనీ, వాటిని నిలబెట్టుకోవాలని సూచించారు. పదేండ్లలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేసిన కాబట్టే దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు. ఐటీఐఆర్ లేకున్నా..కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డినా 2022-23 ఏడాదికి 2 లక్షల 41 వేల కోట్లకు ఐటీ ఎగుమతులకు చేరుకున్న తీరును వివరించారు. కాంగ్రెస్ ప్రకటించిన మెగాడీఎస్సీ, జాబ్‌క్యాలెండర్‌పై అతీగతీ లేదని విమర్శించారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ నుంచి తెచ్చిఇస్తారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ 40 వేల ఉద్యోగాలు ఇస్తానన్న హామీని ఎలా నెరవేరుస్తాడని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారనీ, వాటిని నెరవేర్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఫార్మారంగంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో ఎదుగుతున్న తరుణంలో ఫార్మాసిటీని కొనసాగించాలని సూచించారు.
ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు : సీఎం రేవంత్‌రెడ్డి
ఎంత చెప్పినా ఎన్‌ఆర్‌ఐగా వచ్చి పదవిలోకి వచ్చిన వారికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 51 శాతం వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గుర్తెరుగాలని సూచించారు. ప్రభుత్వ విధానాలపై సహేతుకంగా విశ్లేషించాలనీ, సలహాలు, సూచనలు చేయాలని హితబోధ చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే నిరసనలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయాలిగానీ ఇలా మాట్లాడటం సరిగాదన్నారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారన్నారు.
ఎమ్మెల్యే కాకముందే హరీశ్‌రావును మంత్రిని చేసిందీ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి నాయిని నర్సింహారెడ్డి సైలెంట్‌గా ఉంటే కృష్ణా జలాల కోసం కొట్లాడిందీ తమ పార్టీ నేత పీజేఆర్ అని గుర్తుచేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టుగా మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేస్తే ఎన్‌ఆర్‌ఐ మేనేజ్‌మెంట్ కోటాలో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు. కేకే మహేందర్‌రెడ్డికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. 2014 నుంచి లోతుపాట్లపై గురించి చర్చిస్తామంటే తమకు అభ్యంతరం లేదన్నారు. పిల్లిశాపనార్ధాలకు ఉట్టి తెగపడదన్నారు.
కేటీఆర్‌కు భట్టి చురకలు
కేటీఆర్ స్పీచ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ..’ప్రభుత్వం మారింది. ప్రజలు అత్యంత విస్పష్టమై తీర్పు ఇచ్చారు. ఇంకా మారకపోతే ఎట్లా? ప్రజాస్వామ్యయుత సభను నడుపుకుందాం. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటాం.
తొలిరోజే దాడితో ప్రారంభించారు. సమాధానం చెప్పే స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దానిపై రివ్యూ చేస్తున్నాం. లెక్కలు తీస్తాం. ఏజేన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ ద్వారానే అందించే నీళ్లను తాగుతున్నారు. ‘ అంటూ చురకలంటించారు. సబ్జెక్టు మీదనే మాట్లాడాలనీ, గతంలోకి వెళ్లొద్దని శాసనసభవ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కేటీఆర్‌కు సూచించారు.