16 శాతం పెరిగిన హమాలీ కార్మికుల కూలి రేట్లు

– మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులతో సీఐటీయూ నాయకుల చర్చలు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కాగజ్‌నగర్‌ హమాలీ కార్మికుల రేట్లు 16 శాతం పెరిగాయి. ప్రతి రెండేళ్లకోసారి హమాలీ కూలి రేట్లను పెంచాల్సి ఉండగా, దీని గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 30తో ముగిసింది. అప్పటి నుండి సీఐటీయూ అనుబంధ హమాలీ యూనియన్‌ నాయకులు మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారం జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. పాత కూలీ రేట్లపై 16 శాతం పెంచేందుకు మర్చంట్స్‌ అసోషియేషన్‌ నాయకులు అంగీకరించడంతో చర్చలు సఫలమయ్యాయి. పెంచిన కూలీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని, 2015, ఏప్రిల్‌ 30 వరకు ఈ రేట్లు కొనసాగుతాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఈ చర్చలలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్‌, హమాలీ యూనియన్‌ నాయకులు అల్వల చంద్రయ్య, గులాం దస్తగిరి, మర్చంట్స్‌ అసోషియేషన్‌ నాయకులు వెంకటరమణ, కమల్‌కిషోర్‌భంగ్‌, తూడూరు విజరు, గడ్డం శ్రీనివాస్‌, నందు కిషోర్‌జాజు, బండ ముత్తన్న, అరుణ్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.