కొలతలతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కూలి చెల్లించాలి

– వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉపాధిహామీలో పని చేస్తున్న కార్మికులకు కొలతలతో సంబంధం వేతానాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బండ తూర్పుతండా,ఆజ్మీర్‌తండాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అధికారుల పర్యవేక్షణ లోపించడం మూలంగా ఉపాధి కార్మికులు పని వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేయడం మూలంగా యూపీఏ-1 ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని కమ్యూనిస్టుల ఒత్తిడితో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, తద్వారా ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెరిగాయని అట్లాగే పడవగా ఉన్న భూములన్నీ సేద్యంలోకి వచ్చాయన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర కుట్రపన్నిందని విమర్శించారు.చేసిన పనులకు నెలలతరబడిగా డబ్బులు రావడం లేదన్నారు. బడ్జెట్‌లో కోత విధించడం అంటే అందరికీ పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడమేనన్నారు. కూలీలకు పని దినాలను తగ్గించడం కోసం కొత్త విధానాలను ముందుకు తీసుకొస్తున్నదన్నారు. కూలీల జాబు కార్డు. ఆధార్‌ కార్డు. బ్యాంక్‌ అకౌంట్‌. ఫోన్‌ నెంబర్లను లింకు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిందని, పని ప్రదేశంలో ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు రెండు సార్లు పొటోలు దిగి ఆన్‌లైన్‌, అప్‌లోడ్‌ చేస్తేనే వేతనాలు ఇస్తామని చెబుతుందన్నారు. ఈ కొత్త విధానాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఉపాధి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జూన్‌ 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లుట్ల సైదులు, జటావత్‌ రవినాయక్‌,జిల్లా సహాయ కార్యదర్శి గండమల్ల రాములు,బొడ్డు బాలసైదులు, సంఘం అజ్మీర్‌ తండా అధ్యక్షులు అజ్మీర్‌ రమేష్‌, కార్యదర్శి అజ్మీర్‌రాంబాబు, బండ తూర్పుతండా అధ్యక్షులు ఏ.సరోజ, కార్యదర్శి ఏ.హుస్సేన్‌, నాయకులు బి .కృష్ణవేణి, ఏ.పార్వతి, అజ్మీర్‌వెంకన్న, అజ్మీర్‌ లలిత, అజ్మీర్‌ లక్ష్మానాయక్‌ పాల్గొన్నారు.