మరో రోజు ఆగండి

Wait another day– కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయకుండా
– హైకోర్టు ఉత్తర్వులు
– ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో
– క్వాష్‌ పిటిషన్‌పై విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫార్ములా ఈ రేస్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఈ నెల 31వ తేదీ వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తూ జస్టిస్‌ లక్ష్మణ్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ చేసిన వినతిని తిరస్కరించారు. కేసులో ఇరుపక్షాల వాదనల తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఏసీబీ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఒప్పందాల్లో మంత్రి కేటీఆర్‌ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఆరోపించింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. దురుద్ధేశంతో, కుట్రపూరితంగా వ్యవహరించిన నాటి మంత్రి కేటీఆర్‌ క్యాబినెట్‌ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందకుండా నిధులు విడుదల య్యేలా చేశారని వివరించింది. విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే రూ.54 కోట్లు బదిలీ చేశారనీ, దీని వల్ల హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లు ఇన్‌కంట్యాక్స్‌ చెల్లించాల్సి వచ్చిందని వివరించింది. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ పైవిధంగా కౌంటర్‌ పిటిషన్‌ వేశారు. ఇదే కేసులో కేటీఆర్‌ కూడా ఏసీబీ కౌంటర్‌కు రిప్లై కౌంటర్‌ దాఖలు చేశారు. రాజకీయంగా కుట్రతో నమోదు చేసిన కేసు. ఒప్పందాల మేరకే చెల్లింపులు జరిగాయి. అనుమతులు, విదేశీ నిధుల వ్యవహారాలు, ఇతర లోపాలుంటే వాటిని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు ఉండేలా చేయాల్సింది అధికారులేగానీ మంత్రులు కాదు. అన్యాయంగా తనపై కేసు నమోదు అయింది. అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనే ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాలి అని కేటీఆర్‌ హైకోర్టును కోరారు. ఈ కేసు విచారణ ఈ నెల 31న జరగనుంది.