రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు – సాయం కోసం ఎదురుచూపులు

2023 వానాకాలం రుతుపవనాలు 45రోజులు ఆలస్యంగా వచ్చాయి. వస్తూనే తుఫాన్‌ను తీసుకుని వరదలతో ముంచెత్తాయి. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ రాష్ట్రంలో 122లక్షల ఎకరాలకు బదులు 65లక్షల ఎకరాలలో మెట్టపంటలు వేసారు. మెట్టపంటలతో పాటు 15లక్షల ఎకరాలలో బావులు, చెరువుల కింద వరిపంట వేసారు. జులై 23 నుండి 27వరకు వచ్చిన తుఫాన్‌వల్ల 12లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాలలో విపరీతమైన నష్టం జరిగింది. మోరంచ గ్రామం వరదలతో అదృశ్యమైంది. దాదాపు నష్టం రూ.4వేల కోట్లు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి, మొక్కజొన్న, పప్పులు, నూనెగింజలు, వరినార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంతవరకూ రెండుసార్లు విత్తనాలువేసి నష్టపోయారు. మూడోసారి పంటలు వేయాలి. ఈ వరదల తాకిడికి ప్రభుత్వ మంత్రులు పర్యటన చేసారు. హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడా వాస్తవ సమాచారం సేకరించి నష్టపోయినవారికి పరిహారం చెల్లించలేదు. 2023 ఏప్రిల్‌ 23న వచ్చిన వడగండ్ల వర్షం, భారీవర్షాల వల్ల మార్కెట్‌కు తెచ్చిన ధాన్యంతో పాటు మామిడి తోటలు, జొన్న, వరి కోతలకు నష్టం వాటిల్లింది. సుమారు వేయి కోట్ల నష్టం అంచనా వేసారు. ఈ ఒక్క సంవత్సరమే రెండు దఫాలుగా వచ్చిన తుఫాన్‌లకు రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లింది. మంత్రులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమవు తున్నాయి. 2020-21 నుండి 2022-23 వరకు 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రకృతి వైపరీత్యాల కోసం రూ.2400 కోట్లు పరిహారంగా ఇచ్చింది. ఆ నిధులు కూడా నష్టపోయిన రైతులకు ఇవ్వలేదు. ఏప్రిల్‌ 23న జరిగిన నష్టానికి ఎకరానికి రూ.10వేలు ఇస్తామని, మొత్తం 2,20,000 ఎకరాలకు పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఇంతవరకు 20వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి పెట్టుబడులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా కరువులు, వరదల వల్ల నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. 2014 నుండి 2020 వరకు ఆరు సంవత్సరాలలో కరువుల వల్ల రూ.16,812 కోట్లు నష్టం వాటిల్లింది. సగటున 230 మండలాల నుండి 300 మండలాలకు నష్టం కలిగింది. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఈ ఆరేండ్ల కాలానికి తెలంగాణకు రూ.2,306కోట్లు విడుదల చేసింది. జరిగిన నష్టంలో 10శాతం కూడా లేదు. ఈ నిధులు కూడా రైతులకు పంచకుండా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, రహదారుల శాఖకు, ఇతర అవసరాలకు వినియోగించారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లాలో బహిరంగసభ పెట్టి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 2018 నుండి 2023 ఆగస్టు వరకు రాష్ట్రంలో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. ఈ 6 సంవత్సరాలలో 56లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. ఇసుక మేటలు వేయడమే కాక కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. మెట్టపంటలు, వరి, పండ్లతోటలు, కూరగాయలు ఒకటేమిటి అన్ని రకాల పంటలూ దెబ్బతిన్నాయి. నిపుణులు వేసిన అంచనా ప్రకారం రూ.18,700కోట్లు నష్టం జరిగింది. ఈ కాలానికి సంబంధించి 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ రూ.4,133కోట్లు కేటాయించింది. కానీ ఆ నిధులు నష్టపోయిన రైతులకుగానీ, సంస్థలుకు గానీ ఇవ్వలేదు. కరువులు, వరదల వల్ల సగటున ఏటా రూ.3500కోట్ల నష్టం జరుగుతున్నది. ఈమధ్య వచ్చిన వరదలకు 20మందికి పైగా మరణించారు. 3వేల పశువులు కొట్టుకు పోయాయి. గొర్రెలు, మేకలు చనిపోయాయి. నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర వస్తువులు వరదలో కొట్టుకు పోయాయి. అంటు వ్యాధులు ప్రబలి అనేకమంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు.
జులై 23-27 మధ్య వచ్చిన వరద నష్టాన్ని మంత్రుల పర్యటన ద్వారా తగ్గించగలిగామని శాసనసభలో మంత్రులు ప్రకటించారు. వరదల నష్టం జరుగుతుండగా పరిశీలించిన మంత్రులు నష్టాన్ని ఎలా తగ్గించారో వారే చెప్పాలి? ప్రతిసారి నష్టం జరుగుతున్నప్పుడు, గత ప్రభుత్వాలు చేసిన విధానాల ఫలితంగానే నష్టాలు జరుగుతున్నట్టు ఆరోపణ చేయడం ప్రస్తుత పాలకవర్గానికి అలవాటుగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కేంద్రానికి లేఖ రాసి, పరిశీలక బృందాన్ని రప్పించి, నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక కమిషన్‌ ఇచ్చే పరిహారంతో పాటు అదనంగా కొంత పరిహారాన్ని కేంద్రం నుండి కోరాలి. కానీ తెలంగాణ మిగులు రాష్ట్రం అన్న అహంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలను రప్పించడంలేదు. 2015-16లో కేంద్ర బృందం వచ్చినప్పుడు వారి పరిశీలన తర్వాత రూ.791కోట్లు విడుదల చేసారు. తిరిగి 2003లో పర్యటనకు వచ్చారు. ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు. కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖలు జరిగిన నష్టాన్ని వివరిస్తూ నివేదికలు ఇవ్వాలి. కేంద్ర బృందాల రాకనే అంగీకరించని తెలంగాణ ప్రభుత్వం నివేదికను తయారు చేయలేదు. సహజంగా కేంద్ర బృందాలు వాటంతటవే వచ్చి కొన్ని సందర్భాలలో పర్యటించి వెళ్ళాయి. ఆశ్చర్యం ఏమిటంటే, 2015-16లో రాష్ట్ర ప్రభుత్వం కరువు నష్టాన్ని రూ.2500కోట్లుగా అంచనా వేసింది. కేంద్ర బృందాలు ఆ నష్టాన్ని పెంచి రూ.3,506 కోట్లు నష్టం అంచనా వేసారు. కానీ కేంద్రం నుండి రూ.791కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడానికి ప్రకృతి వైపరీత్యాల శాఖ గానీ, వ్యవసాయ శాఖ గానీ ఎలాంటి చొరవ చూపడంలేదు. ఈ కాలంలో వచ్చిన హుదూద్‌, తిత్లీ, పెథారు, తాల్కే లాంటి తుఫాన్‌లు వచ్చి పెద్దఎత్తున నష్టం కలిగించాయి. వరదలు, కరువుల వల్ల రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున నష్టం జరుగుతున్నప్పటికీ పెద్దగా సహాయ చర్యలు రాష్ట్రం తీసుకోకపోగా కేంద్రాన్ని అర్ధించిన దాఖలాలు కూడా లేవు.
తెలంగాణ పీఠభూమి కావడం వల్ల ఇక్కడ రాళ్ళ వర్షాలు అరుదుగా వస్తుంటాయి. పీఠభూములపై క్యుములోనింబస్‌ మేఘాల ద్వారా వర్షించడంతో రాళ్ళ వర్షాలు వస్తున్నాయి. ఇది ఇతర రాష్ట్రాలకు లేదు. ఆ సందర్భంగా పిడుగులు కూడా పడ్డాయి. రాళ్ళ వర్షాలు, పిడుగుల వల్ల ప్రాణ నష్టం, పశునష్టం, పండ్లతోటల నష్టం పెద్దఎత్తున జరుగుతున్నది. ప్రతి రాష్ట్రం తమకు జరిగిన నష్టాన్ని ఎక్కువగా అంచనా వేసి కేంద్రం నుండి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వరదలు, తుఫాన్‌లు వచ్చినపుడు ఆందోళన ఫలితంగా కేంద్రంనుండి నిధులు రాబట్టడం జరిగింది. కేంద్రం రాష్ట్రానికి సహకరించదు అన్న నెపంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడానికే సుముఖంగా లేదు. పైగా శాసనసభలో తన స్వంత నిధుల నుండి ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ 14వ, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల గురించి మాటమాత్రంగా శాసనసభలో ఉచ్చరించలేదు. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై మాట్లాడలేదు. ఇప్పటికే పంటలు దెబ్బతినడం వల్ల ఏటా 640మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు విద్యుత్‌ షాక్‌ల వల్ల మరో 600మంది రైతులు, 2500 పశువులు మరణిస్తున్నాయి. రైతుబీమాను పరిశీలించినప్పుడు, ఆగస్టు 15 నుండి మరుసటి సంవత్సరం 14 ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం 18-59 సంవత్సరాల మధ్య గల రైతులకు ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద చనిపోయినవారికి రూ.5లక్షలు వెంటనే ఇస్తారు. 2018 నుండి ప్రారంభమైన ఈ పథకం నివేదిక ప్రకారం ఏటా 16వేల మంది రైతులు మరణిస్తున్నారు. 59 సంవత్సరాలు దాటినవారి లెక్కలు కూడా వస్తే ఈ సంఖ్య పెరుగుతుంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో రైతుల హత్యలు, ఆత్మహత్యలు పెద్దఎత్తున జరుగుతున్నట్టు విశదమవుతున్నది. ఒకవైపు కౌలు చట్టాలు రద్దు చేసిన ప్రభుత్వం మరోవైపు ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. 2003 జూన్‌లో కౌలురైతులకు కూడా పరిహారం చెల్లిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎక్కడా ఇవ్వలేదు. ఏదైనా నష్టం జరగగానే సంబంధిత శాఖ ద్వారా గణాంకాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తేవాలి. ప్రభుత్వం బడ్జెట్‌ నుండి కొంత కేటాయించి మిగతా నిధులకు కేంద్రంపై ఒత్తిడి తెవాలి. కానీ ఈ కార్యక్రమం తెలంగాణలో అమలు కావడం లేదు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా మారిన తెలంగాణలో నష్టపోయినవారికి ఎలాంటి పరిహారాలు అందడంలేదు. ఆర్థిక సంఘాల నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం సాగులో దాదాపు 15శాతం భూమిలో పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల పాలవుతున్నాయి. పంటల నష్టమే కాక మనుషుల ప్రాణాలు పోవడం, పశుసంపద నష్టం, భూమి సాగుకు యోగ్యం కాకుండా ఇసుక మేటలు వేయడం జరుగుతున్నాయి. ఈ వాస్తవాలు మంత్రులు పర్యటన సందర్భంగా అంగీకరించినప్పటికీ అందుకు కావలసిన నిధులు మాత్రం విడుదల చేయడంలేదు. ఈ సంవత్సరం వచ్చిన వరదల వల్ల లక్షల ఎకరాల్లో ఇసుక మేటలు వేయడమే కాక గట్టు తెగిపోయి భూములు సాగుకు పనికిరాకుండా మారాయి. అందువల్ల కనీసం ఎకరాకు రూ.30వేలు వ్యయం చేయకుండా తిరిగి సాగుకు అనుకూలంగా పునరుద్ధరణ చేయడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా కనీసం రూ.3వేల కోట్లు ప్రకృతి వైపరీత్యాల కోసం కేటాయించాలి. నష్టపోయిన రైతులకు చెల్లించి ఆ తర్వాత కేంద్రం నుండి రాబట్టుకోవాలి. వరదల వల్ల నష్టపోయిన ప్రభుత్వ శాఖలు కేంద్రం ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలను పరిశీలించడానికి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ శాఖ ఐఏఎస్‌ అధికారి కన్వీనర్‌గా ఒక కన్వీనింగ్‌ కమిటీ నియమించాలి. ప్రతి జిల్లాలో జరిగిన నష్టాన్ని వెంటనే సేకరించి జిల్లాల్లో కలెక్టర్లు చర్యలు తీసుకునే విధంగా అధికారాన్ని వికేంద్రీకరించాలి. జిల్లా స్థాయిలో నిధులను విడుదల చేయాలి. పంటల బీమా పథకాన్ని, వ్యక్తుల బీమా పథకాలను అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పథకాలలో లోపాలను సరిచేసి అందరికీ పరిహారం వచ్చేవిధంగా చూడాలి. ప్రీమియం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లించాలి. ఆవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని తిరిగి పొందేవిధంగా ప్రణాళిక రూపొందించాలి.

సారంపల్లి మల్లారెడ్డి