
– గ్రామ శాఖల అభిప్రాయం మేరకే చేర్చుకోవాలి
నవతెలంగాణ – నూతనకల్
కాంగ్రెస్ లో చేరికలు షురు కావడంతో ‘మింగు అంటే కప్పకు కోపం.. వదులేయి అంటే పాముకు కోపం’ లాగా మారింది. రానున్న ఎంపీ ఎన్నికలలో కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు సాధించడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ఆయా గ్రామాల నుండి కార్యకర్తలు గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్, బీజేపీలను బలహీన పరిచేందుకు ఆ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి గత ఉద్యమ కాలం నాటి మిత్రనాయకులతో పాటు మరి కొంతమందిని చేర్చుకునే ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు ఇతర పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా చేర్చుకొని కరీంనగర్ పార్లమెంట్ సభ్యున్ని కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేదే ముఖ్య ఉద్దేశం.నియోజకవర్గంలో దాదాపు 15 ఏండ్లుగా కాంగ్రెస్ అధికారం కోల్పోయిన మొక్కవోని దీక్షతో కష్టనష్టాలకు ఓర్చి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నష్టాన్ని భరించి కాంగ్రెస్ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేశారు. అధికారంలోకొచ్చి100 రోజులు కాకముందే చేరికలతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో ఆసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మండల నాయకులు కాంగ్రెస్ నాయకులను,కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తూ ఇసుక అక్రమ వ్యాపారం, కాంట్రాక్టర్ పనిచేసే ఆర్ధికంగా, రాజకీయంగా బలపడి ఉన్నారు.ఇటీవలే అధికారం కోల్పోయిన వెంటనే పార్టీ మారాలనే ఆశావాదులకు అధికార కాంగ్రెస్లో చేరడానికి అవకాశం ఇస్తే, మళ్లీ బీఆర్ఎస్ నాయకులదే పెత్తనం కొనసాగుతదని, అన్ని రంగాలలోనూ వాళ్లే ముందుంటారని పార్టీకోసం పని చేసిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు గుర్తింపు తగ్గుతుందనే అభిప్రాయం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినవారే కొన్ని గ్రామాలలో బేదాభిప్రాయంగా వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మళ్లీ నూతనంగా కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్ గ్రామ శాఖల అభిప్రాయాల మేరకు మాత్రమే చేర్చుకోవాలని జిల్లా అధిష్టానం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ యకులు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడం కోసం అనేక ఇబ్బందులు పెట్టారనేది వారి అభిప్రాయం. ఇతర పార్టీలో ఉండి ఇబ్బందులుపెట్టిన నాయకులను చేర్చుకుంటే మళ్లీ కాంగ్రెస్ వర్గాలు ఏర్పడి పార్టీ బలహీనమయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి 600 మంది కాంగ్రెస్ లోకి…
టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో 100 రోజులు గడవక ముందే బిఆర్ఎస్ పార్టీ లో జెండాలు మోస్తూ అధిష్టానం చెప్పిన విధంగా పనులు చేసిన కొంతమంది మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆదివారం నాడు ఒక్కరోజే తంగళ్ళపల్లి మండలంలో దాదాపు 600 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల మైనారిటీ నాయకులతోపాటు తంగళ్ళపల్లి మండలంలో ఉన్న మైనారిటీ నాయకులందరూ హస్తం గూటికి చేరారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం నాయకులు కూడా కాంగ్రెస్లో చేరారు. మండలం లో ఉన్న ఒడ్డెర కులస్థులు,మండలంలో ఉన్న 30 గ్రామాల నుండి 600 మంది ఒకేసారి చేరడంతో టిఆర్ఎస్ పార్టీలో అనుమానం మొదలయ్యింది. అంతేకాకుండా వేణుగోపాల్ పూర్ మాజీ సర్పంచ్ కాయితి బాలయ్య, ఇందిరా నగర్ మాజీ ఉప సర్పంచ్, చింతల్తాన మాజీ ఎంపిటిసి లు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇక బిఆర్ఎస్ పార్టీ మండలం మొత్తం ఖాళీ అయ్యేనా అన్న విధంగా బిఆర్ఎస్ నాయకులకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
రాష్ర్ట నాయకుల చుట్టు ప్రదక్షణలు….
తంగళ్ళపల్లి మండలంలోని కొందరు టిఆర్ఎస్ నాయకులు మంత్రుల, ఎమ్మెల్యేల,రాష్ట్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక చేసేదేమీ లేక అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఉవ్విల్లు ఊరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలువురు కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరతామని మండల నాయకులను, జిల్లా నాయకులను కోరితే ససేమిరా అనడంతో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంత్రుల, ఎమ్మెల్యేల, రాష్ట్ర నాయకుల చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం. ఇక మండలంలో ఉన్న మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు కాకుండా ప్రస్తుత ఎంపీటీసీలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.