ఉమ్మడి ఖమ్మం గుమ్మం నుండి తెలుగు బాల సాహిత్యంలోకి అనేక మంది ప్రవేశించారు. వారిలో తొలితరం నుండి ఇవ్వాళ్ళ రాస్తున్న బాలబాలికల వరకు ఉన్నారు. గోదావరి అందాలను, ప్రళయాలను తమ రచనల్లో ఎంత బాగా చెబుతున్నారో పిల్లల కోసం కూడా అదే దిశగా రాస్తున్నారు. ఇటీవల తెలుగు నేల బాల సాహిత్య స్పృహ బాగా పెరిగింది. వరిష్ఠ రచయితలు మొదలు ఉదీయమాన, రచయితల వరకు బాల సాహిత్య సృజన చేస్తున్నారు. ఈ కోవలోనే నేటి తరంలో ఖమ్మం జిల్లా ‘వాజేడు బాల సాహిత్య రేడు’ డా|| అమ్మిన శ్రీనివాసరాజు తమ్ముడు అమ్మిన వెంకట అమ్మిరాజు కూడా బాల సాహితీవేత్త, కవి, ఉపాధ్యాయుడు. పిల్లల కోసం కథలు, వ్యాసాలు రాస్తున్నాడు. అన్నింటికి మించి ఈయన తాను పుట్టిన ప్రాంతాన్ని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని, స్థితిగతులను తన రచనల్లో చూపించే ప్రయత్నం చేయడం అభినందనీయం.
ఖమ్మం జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురంలో 29 సెప్టెంబర్, 1980న అమ్మిరాజు పుట్టాడు. ఈ లక్ష్మీపురం గర్ర గూడెం పేరుతో అందరికీ తెలిసిన ఒక గురిజన గూడెం. వీరి తల్లితండ్రులు శ్రీమతి అమ్మిన పల్లాలమ్మ – శ్రీ నూకరాజు. బి.ఎస్సీ, బి.ఎడ్‌తో పాటు సాహిత్యంలో ఎం.ఎ చదివి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుండి అమ్మ-నాన్నలు చెప్పిన కథలు విని, అన్న రాసిన కథలు చదివి రచయితగా ఎదిగిన అమ్మిరాజు బాల్యం నుండి బాలానందం వింటూనే, అనేక రచనలు, ఉత్తరాలు బాలానందంకు పంపించేవాడు. ఈయన రచనలు తొలుత రేడియోలో ప్రసారం కావడం విశేషం. కళాశాల స్థాయిలో అనేక రచనలు అచ్చయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాహిత్య వార్షిక సంచిక ‘గౌతమి’కి మూడేండ్లు సంపాదకులుగా వ్యవహరించాడు. కవిత్వం, హైకూలతో పాటు అనేక సాహిత్య వ్యాసాలు రాసిన అమ్మిన ‘అమ్మిరాజు హైకూలు’ పేర సంపుటిని సిద్ధం చేశాడు. మినీ కవిత్వం పట్ల ఆసక్తితో అనేక కవితలు రాశాడు. ఈ సంపుటి ప్రచురణ కోసం సిద్ధంగా ఉంది.
బాల సాహితీవేత్తగా అమ్మిన అమ్మిరాజు తొలి కథ ‘అసలు విషయం’ బుజ్జాయిలో 2001 డిసెంబర్‌లో వచ్చింది. అప్పటి నుండి వెనుకకు తిరిగి చూడకుండా కథలు రాస్తున్నాడు అమ్మిరాజు. కేవలం బాలల కథలు రాయడంతోనే సరిపెట్టుకోలేదు. గిరిజన గూడెం నుండి ఎదిగిన కథకుడు కనుక ఆ విషయం ఆయన కథల్లో, ఇతర రచనల్లో అక్షరమక్షరాన కనిపిస్తుంది. అడవులు అనగానే అనేక మందికి ప్రకృతి, పర్యావరణం, జలపాతాలు వంటివి గుర్తొస్తాయి. కాని అమ్మిరాజు కథలకు గిరిజనులు, అక్కడి బడి పిల్లల బాధలగాథలు వస్తువులుగా నిలుస్తాయి. అటువంటిదే ఈయన తొలికథ కూడా. వేరు పురుగు చెడు చేస్తుందని తెలుగు టీచర్ బడిలో పాఠం చెబుతాడు, అది విన్న విద్యార్థి మరుసటి రోజు పాఠశాల తోటలోని వేరు పురుగులను తొలగిస్తుండగా డ్రిల్లు టీచర్ చూసి తరగతి బయట గోడ కుర్చీ వేయిస్తాడు. తరువాత అసలు విషయం తెలుసుకుని తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థిని తరగతి గదిలోకి పంపిస్తాడు. ఇదీ అసలు కథ. అమ్మిరాజు కథలన్నీ ఇలాగే మట్టికీ, మనుషులకు దగ్గరగా ఉంటాయి.
‘చిన్న సైకిల్’ కథలో ఇటువంటి అంశాలనే మనం చూడొచ్చు. సైకిల్ తొక్కడం కేవలం సరదా కోసమో, ఆనందం కోసమో కాదు, తద్వారా దాని గురించిన మంచి చెడ్డలు, సాధక బాధకాలు తెలవాలన్నది రచయిత తలంపు. అదే ఈ కథలో చూపిస్తాడు. జంతు పాత్రలతోనూ అమ్మిరాజు అనేక కథలు రాసినప్పటికీ ఎక్కువ కథల్లో పాత్రలు పిల్లలు, మనుషులు కావడం విశేషం. ‘నూకరాజు-సోమరాజు’ కథ చదివినప్పుడు మన కళ్ళకు సాధారణంగా అనిపించొచ్చు కానీ, అందులోని సున్నితమైన అంశం గిరిజన, అట్టడుగువర్గాలు, దిగువ మద్యతరగతి ప్రజలు ఆర్థిక, సామాజిక స్థితికి అద్దం పడుతుంది. బడికెళ్ళే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ఇందులోని ప్రధాన అంశం. అయితే ఈ నేపథ్యంగా వివిధ సమస్యలు, ఇబ్బందులతో బడి మానేస్తున్న వారిని గురించి ఇందులో చెబుతాడు రచయిత. అమ్మిరాజు కథల్లోని పాత్రలు అనేక విషయాలను సూటిగా లేదా కొన్నిసార్లు బేరీజు వేసి చెప్పేవిగా ఉంటాయి. కారణం అంశాలు, వస్తువులు అన్నీ సామాజికం కావడం. నాకు నచ్చిన కథల్లో ‘సేవా’ ఒకటి. ఇది ఒక వ్యాపారి, అతని కొడుకు కథ. వ్యాపారి కొడుకు తండ్రి వేరే ఊరుకు వెళ్ళినప్పుడు నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్ముతాడు. అలా చేస్తే మళ్ళీ కొనేవాళ్ళు రారని తండ్రి సర్దిచెబుతాడు. మరోసారి తక్కవ ధరకు అమ్మగా లాసు వచ్చి దివాలా తీస్తామని హెచ్చరిస్తాడు. దానికి అలా అయితే ఎలా ఎక్కువకు అమ్మొద్దు, తక్కువకు అమ్మొద్దు అంటే ఎలా అంటాడు కొడుకు. అందుకు తండ్రి… మనం అమ్మేవి నిత్యావసరాలు. అందులో కొద్దిపాటి లాభాన్ని చూసుకుని దైవ ప్రసాదంగా భావించాలని సూచిస్తాడు. తొలి కథ నుండి నేటి వరకు అమ్మిరాజు కథలు దాదాపు అన్ని ప్రముఖ తెలుగు పత్రికలు, బాలల పత్రికల్లో అచ్చయ్యాయి. వ్యాసాలు, సమీక్షలు అన్ని సాహిత్య శీర్శికల్లో వచ్చాయి. పిల్లల కోసం చక్కని కథలను అందిస్తున్న ఈ గిరిజన గూడెం కథకునికి జేజేలు! జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548