పౌర సమాజమా మేల్కో… మానవత్వంతో సాగిపో…

Wake up civil society...be humane...ఇటీవల కాలంలో కేరళలోని ‘వయనాడ్‌’ వరదలతో విలయనాడుగా మారిన తరుణంలో ఎంతోమంది ముందుకు వచ్చి చేయూత ఇవ్వడమే మానవత్వానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. అలాగే రెండేండ్ల కిందట ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొరదాబాద్‌కు చెందిన డాక్టర్‌ అర్వింద్‌ గోయిల్‌ తన సంపాదన అంతా సుమారు 600 కోట్ల రూపాయలు నిరుపేదల సంక్షేమం కోసం, ఉచిత విద్య కోసం వెచ్చించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాని రాసి ఇచ్చి, తనలో మానవత్వాన్ని చాటి, ప్రస్తుత సమాజానికి మార్గదర్శి అయ్యారనటంలో సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో మరెందరో ధనికలు పేదలు జీవితాల్లో వెలుగులు నింపుతారు అని ఆశిస్తూ…. ఆగష్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా మరెన్నో విషయాలు విశ్లేషణ చేద్దాం…

”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయనత్వం” అన్న శ్రీశ్రీ మాటలు పరిశీలిస్తే, ఒకరిని ఒకరు దోపిడీ చేయటం, శారీరక, మానసిక గాయాలతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ, లింగ, భాషా, మత, ప్రాంతీయ పరమైనటువంటి దోపిడీలతో బాధితులను చేయడం… నేటికీ మన దేశంలో కులాలు, మతాలు పేరిట జరుగుతున్న దాడుల్లో అణగారిన వర్గాల వారు బాధితులుగా, జాతి వివక్షత పేరున నల్ల జాతీయులు ప్రపంచ వ్యాప్తంగా బాధితులుగా మారటం మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. ఆ రకంగా ప్రపంచ నలుమూలలా బలవంతుడు బలహీనుడిని, పెద్దదేశం చిన్నదేశాన్ని గాయపరస్తూ సుమారు 18వ శతాబ్దం వరకూ ప్రపంచ జనాభాలో 3వ వంతు ప్రజలు ఆనాటి పాలక ప్రభువులకు, ప్రభుత్వాలకు కాలుకింద చెప్పులా జీవించే పరిస్థితి అని మానవ చరిత్ర ఘోషిస్తుంది.
దీనికి కారణం మానవ స్వార్థం, పదవీకాంక్ష, రాజ్య విస్తరణ. ఈ లక్ష్య సాధనలో సామాన్య ప్రజలు దాదాపు 12 శాతం దుర్భర పరిస్థితులు అనుభవించి, ఆరోగ్యం కోల్పోయి, కడు పేదరికంలోకి నెట్టవేయబడ్డారు. 90 శాతం ప్రపంచ జనాభా వ్యవసాయ పనులకే పరిమితం అయ్యారు. 80 శాతం జనాభా కటిక దారిద్య్రం చవిచూసింది. 19వ శతాబ్దం మొదటి కాలం నాటికి బానిసత్వం రద్దయి, కొంతమంది హదయాలలో మానవత్వం మూర్తీభవించి ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందివ్వాలనే భావన పురుడు పోసుకుంది.
ఇరాక్‌లో సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన బ్రెజిల్‌ మానవతావాది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్‌ ‘సెర్గియో వియోరా ి మెల్లోతో’, 22 మంది సభ్యులు బస చేసిన ‘కెనాల్‌ హోటల్‌’ దాడిలో 2003 ఆగష్టు 19న మరణించిన రోజునే ‘ప్రపంచ మానవతా దినోత్సవంగా’ ఐక్యరాజ్యసమితి 2009లో చేసిన తీర్మానం చేసింది. 2010, ఆగష్టు 19 నుండి ఈ దినోత్సవం జరుపుతూ ఆపదలో, అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటున్న వ్యక్తులను, సంస్థలను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సాహిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా 1876లో ‘గ్రేట్‌ నార్త్‌రన్‌ చైనా ఫెమిన్‌’ లో సుమారు 10 లక్షల మంది మరణించిన సందర్భంలో పెద్ద ఎత్తున మానవతా దక్పథంతో బాధితులకు సహయకార్యక్రమాలు అందించారు. 1,2 ప్రపంచ యుద్ధాలలో ప్రపంచ వ్యాప్తంగా 1.3 శాతం ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలోనూ కొందరు మానవత్వం చాటుకున్నారు.
అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూధర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలా, గాంధీజీ, మధర్‌ థెరిస్సా, బాబా ఆమ్టే వంటివారు వివిధ రకాల బాధితుల బాగు కోసం వారి జీవితాలను త్యాగం చేసి నేటికి కీర్తించబడుతున్నారు. ”ఈ విశ్వంలో మానవ జన్మ కంటే అద్భుతమైనది మరొకటి లేదు” అని గ్రీకు మేధావి ‘సోపోక్లిన్‌’ అనడం యదార్ధ మైనదేకదా! అనగా మనిషి మనిషిగా ప్రవర్తించి, సాటి మానవునికి సహకరించేవాళ్లు పాలకులు అయితే ఆయా దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ మూఖ్యంగా ‘మానవ అభివద్ధి సూచిక’లో ముందు వరుసలో ఉంటుంది. శాంతి సౌరభాలు వెదజల్లుతూ ప్రపంచం పరవసిస్తుంది. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పలువురిలో పెరగాలి.
ముఖ్యంగా 2019 చివరి నుండి నేటి వరకూ ‘కోవిడ్‌’ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అనారోగ్యాలకు గురయ్యారు. కొన్ని లక్షల మంది కరోనాతో కైవల్యం చెందిన సందర్భంలో ‘ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌’ గా డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది, అధికారులు ప్రజాప్రతినిధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, మీడియా ప్రతినిధులు తమ కుటుంబాలను వదిలి రాత్రనక పగలనక సేవలు అందించి, ఎన్నో ప్రాణాలు కాపాడిన ‘అద్భుత మానవతా మూర్తులు’ మన కళ్ళముంద కదలాడే మానవతా మూర్తులు. జయహో…
వీరి ద్వారా ‘ఆపదలోను, అవసరంలోను ఆదుకోవాలనే ఆశయం’ అందరికీ కలగాలి. ‘గివింగ్‌ -హెల్పింగ్‌’… అదే మానవత్వ గుణం. హ్యుమానిటీ, న్యూట్రాలిటీ, ఇమ్‌ పార్షియాలిటీ, ఇండిపెండెన్స్‌ ఈ నాలుగు సూత్రాలు కలయికే మానవత్వం. మన భవిష్యత్తు జీవిత ఆచరణ మార్గాలు.
ప్రస్తుతం ప్రపంచంలో 54 దేశాల్లో ముఖ్యంగా 9 దేశాల్లో సిరియా, కాంగో, ఆఫ్గనిస్తాన్‌, దక్షిణ సూడాన్‌ మొదలగు దేశాల వారికి మానవత్వంతో సేవలు అందివ్వాలి. మహిళలు, చిన్న పిల్లలు తీవ్రంగా శారీరకంగా మానసికంగా హింస పొందుతున్నారు. అక్రమ రవాణాకు గురై లైంగిక దోపిడికి, అవయవాల దోపిడీకి గురవుతున్నారు. బానిసత్వంలో మగ్గుతున్నారు. మానవహక్కులు ఎండమావి వలే ఉన్నాయి. ఉగ్ర దాడులు, యుద్ధ వాతావరణంలో పలు దేశాల్లో ప్రజలు భీతావహ, భయానిక పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నారు. కనీసం తాగేందుకు నీరు, ఆహారం లేమితో చివరికి మహిళలు ఒకపూట భోజనం కోసం శీలాన్ని అర్పించే దుస్థితి సిరియా శరణార్థులు అవస్థలు పడే పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ప్రభుత్వాలు, ప్రజలు బాధితులకు అండగా, పునరావాసానికి పురుడు పోయాలి. మానవత్వానికి కొత్త అధ్యాయం అద్దాలి.
కోట్లు గడిస్తున్న బడాబాబులు లగ్జరీ కార్లలో విహరిస్తూ, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారు. కోవిడ్‌ సమయాన వలస కార్మికుల వెతలు తీర్చిన సోనూసూద్‌ పరిపూర్ణ మానవతావాదిగా పరిమళించి, దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసి, పలువురు మన్నలను పొందాడు. సామ్యవాద భావాలు కలిగిన ప్రజాసంఘాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, కోవిడ్‌ రోగులకు ప్రాణదాతలయ్యారు. ఈ కోవలోకే డాక్టర్‌ పెండ్యాల శ్రీరాములు, సి.హెచ్‌. సుధాకర్‌, మెగాస్టార్‌ చిరంజీవి చేరారు. వాస్తవంగా ఇతర దేశాల్లో పారిశ్రామిక వేత్తలు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌, క్రీడాకారులు తమ సంపాదనలో ఎక్కువగా సహయ కార్యక్రమాలకు అందిస్తూ మానవత్వానికి నమూనాగా ఉంటారు. చివరికి విఖ్యాత భారత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా తనకు బహుమతిగా వచ్చిన విలువైన ‘ఫెరిరా’ కారుకి పన్ను రాయితీలు పొందేడు. ఆ మేరకు పన్నులు కట్టివుంటే మరింత ఆరాధ్యుడుగా, పేదలకు సహకరించే ప్రభుత్వాలకు ఆసరాగా ఉండును. సంక్షేమ పథకాలు అమలుకు ప్రభుత్వానికి ధనికులు న్యాయ బద్ధంగా, సకాలంలో పన్నులు చెల్లించాలి. ఇటీవల వయనాడ్‌ బాధితులకు మెగా ఫ్యామిలీ కోటి విరాళం ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. సైనికులుగా మారి సినిమా హీరో సేవలు అందించారు.
ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీ 45 మందిలో ఒకరు అభ్రతతో ఉంటూ, ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నేటికీ కోవిడ్‌ వలన, ప్రకృతి ప్రకోపం వల్ల 2 కోట్ల మంది సహాయం కసం ఎదురు చూస్తున్నారు. ఉపాధి కోల్పోయి, ఆస్తులు తరిగిపోయి, ధరలు పెరిగి, హక్కులు క్షీణించి, జీవనోపాధి లేక తల్లడిల్లుతున్న ప్రజలు అధికమయ్యారు. అనారోగ్యాలు, పోషకాహారం లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, కార్పోరేట్స్‌ ఇతరుల పట్ల, పేదవారి కష్టాల పట్ల చలించి, మానవతను చాటాలి. మానవుని దురాశ వల్లే నేటి అన్ని సమస్యలకూ కారణం అని గ్రహించాలి. ప్రకృతిని పరిహసిస్తే వికృతిని చూడవలసిందే అని గ్రహించాలి. గతంలో కోవిడ్‌ మహమ్మారి, చైనా వరదలు, కెనడా అమెరికా ఉష్ణోగ్రతలు, పలుచోట్ల వర్షాలు, వరదలు, పిడుగులు, మానవ దాడులు వంటివి ఎంతోమందిని బలితీసుకుంటూ, మరెంతో మందిని బాధితులుగా మారుస్తున్న ఈ తరుణంలో ప్రకృతి సమతౌల్యం పాటిస్తూ, అవసరంలో ఉన్నవారికి మానవత్వం చూపుతూ సహాయం అందించటమే నూతన మతంగా భావించి మానవతా దినోత్సవ ప్రాధాన్యతని ప్రపంచానికి చాటుదాం. పౌరసమాజమా మేల్కో… మానవత్వంతో సాగిపో.
శ్రీశ్రీ అన్నట్లు ‘నేను సైతం’ బాసటగా నిలుస్తా. ఉపాధ్యాయ నాయకుడు డి.రామిరెడ్డి తన సర్వీసును, జీవితాన్నే కాక చివరికి తన ఆస్తిని కూడా సంఘానికి అందించిన అద్భుతమైన వ్యక్తి. సమాజ సేవలో అనేక స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ముందు వరుసలో వుండటం హర్షదాయకం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ వ్యక్తీ తనలో మానవత్వాన్ని చాటి, అవసరతలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించటమే ఈ మానవతా దినోత్సవ పరమార్థం. ఈ 2024 ”ప్రపంచ మానవతా దినోత్సవం’ ని ‘యాక్ట్‌ ఫర్‌ హ్యుమానిటీ’ థీమ్‌తో జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌ – పాలస్తీనా గాజా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని బలితీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. ఐక్యరాజ్యసమితి చొరవ చూపాలి. అమెరికా, నాటో కూటమి యుద్ధ కాంక్షను విడనాడాలి. సమస్యలు పరిష్కారానికి చర్చలే సమాధానం అని గ్రహించాలి. ముఖ్యంగా శాంతి, సహనం ఓర్పుతో ప్రపంచానికి నూతన ఒరవడులు అందించాలి. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భావనతో అందరూ కలిసి ముందుకు సాగాలి.
– ఐ.ప్రసాదరావు, 6305682733