మేలుకో భారత్‌…

Wake up India...”ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ హింసను ప్రోత్సహించదు. అలాంటి సమాజం హింసను సహించదు. కానీ నేడు భారతీయ సమాజంలో హింసాత్మక అల్లర్లు సంస్థాగత వ్యవస్థగా రూపొందాయి” అన్నారు రాజనీతి శాస్త్రవేత్త ‘పాల్‌ అర్‌ అబ్రాస్‌’. అది నిజమేనని బీజేపీ డబులింజన్‌ సర్కారు పాలనలో జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఎన్నికలకు ముందుగా ఉద్దేశ పూర్వకంగానే హింసాత్మక ఎత్తుగడలను చేపడుతున్నది బీజేపీ! దేశభక్తి మేలి ముసుగులో, మత ఘర్షణలు సృష్టించి, తద్వారా వచ్చే సానుభూతితో, మెజారిటీ మతస్తుల పోలరైజేషన్‌తో ఎన్నికల్లో లబ్ధిపొందటాన్ని ఆనవాయితీగా మార్చుకున్నది బీజేపీ! ఇంటర్నెట్‌ను తొలగించాం గనుక తమ అల్లర్లను దేశం, ప్రపంచం చూడలేవనుకుంటున్నది మోడీ ప్రభుత్వం! కానీ అలా ప్రజల్ని ఎంతోకాలం నిలువరించలేమన్న విషయం అర్థం కాకపోతే ఎలా? కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా కండ్లు తెరవాలి కదా! ఇంటర్నెట్‌ను రద్దు చేయటంతో భారత్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందన్న విమర్శను, జీ-20 సమావేశాల్లోనే ఎదుర్కొన్నారు మోడీ!, మోడీ ప్యారిస్‌లో అడుగుపెట్టబోయే ముందుగానే ‘మణిపూర్‌ హింసాకాండపట్ల ఆందోళన వెలిబుచ్చుతూ, అందుకు కారకులైన కొందరు బీజేపీ నేతల వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఐరోపా యూనియన్‌ (ఇయూ) తీర్మానం చేసింది. అమెరికన్‌ సెనేటర్లు కొందరు ఆ విషయంపై భారత ప్రధానిని నిలదీయాలని బైడెన్‌కు సంయుక్తంగా లేఖ రాసారు! మణిపూర్‌ అత్యాచార సంఘటనలను ‘వాషింగ్టన్‌ పోస్టు’ మొదలు అమెరికా, బ్రిటన్‌ పత్రికలు పతాక శీర్షికన ప్రచురించినాయి! మణిపూర్‌ హింసాకాండ పూర్వపరాలను పరిశీలించిన ‘అశోక్‌ స్వైన్‌’ అను స్వీడన్‌ ప్రొఫెసర్‌ ఇలా విశ్లేషించాడు… ”మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌, 2002 నాటి మోడీ గుజరాత్‌ మోడల్‌ను అనుసరి స్తున్నాడు. అందులో భాగంగానే మణిపూర్‌ మైనారిటీ కుకీ ఆదివాసీ క్రైస్తవుల పైకి ‘మెజారిటీ మెయితీ హిందూ మూకదాడులకు గేట్లు తెరిచాడు! తత్ఫలితంగా వేలాది గ్రామాలు, వందలాది చర్చీలు భస్మమైనాయి. 148 మంది చనిపోయారు. వేలాది మంది క్షతగాత్రు లయ్యారు నిరాశ్రయులై 60వేల మంది కొండ, కోనల్లో తలదాచుకుంటున్నారు. మైనారిటీలపై జుగుప్సాకరమైన సామూహిక అత్యాచారం, మెజారిటీయన్ల ఆయుధంగా రూపొందింది బీజేపీ పాలనలో’ అంటూ వాపోయా రాయన! ‘మణిపూర్‌కు విద్వేషపు నిప్పంటించి, ఆ మంటలారకుండా ఆజ్యం పోస్తున్నది బీజేపీ డబులింజన్‌ సర్కారే! తద్వారా వాళ్లు నెరవేర్చుకోదల్చుకున్న లక్ష్యాలివి…
మొదటిది బీజేపీ పాలనలో కొందరు కార్పొరేట్ల సిరులు అంబరాన్నంటినా, కోట్లాది ప్రజల ఆదాయాలు పాతాళానికి, అన్నింటి ధరలు ఆకాశానికి చేరటం దేశమెరిగిన సత్యం! అందుకే దేశంతో పాటు మెయితీలతో సహా, మణిపూర్‌ ప్రజలందరిలోనూ బీజేపీ పట్ల ఆగ్రహం పెల్లుబికింది! మెయితీ మహిళలు బీజేపీ పీడబ్ల్యూడీ మంత్రి ఇంటిని తగలబెట్టడం వాళ్ళ ఆగ్రహానికి పరాకాష్ట! రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, వాళ్ళ ఆగ్రహాన్ని బీజేపీ పైనుండి దారి మళ్ళించటం! రెండోది కుకీ క్రైస్తవులను టార్గెట్‌ చేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి 55శాతం మెజారిటీ మెయితీ హిందూ ఓటర్ల పోలరైజేషన్‌తో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం బీరేన్‌సింగ్‌ లక్ష్యం! మూడవది మణులు, వజ్రాలతో సహా 42 రకాల విలువైన ఖనిజాలున్న మణిపూర్‌ పర్వత భూములపై బీజేపీ ఆత్మీయ కార్పొరేట్ల కన్నుబడింది! వాళ్ళ దురాశను నెరవేర్చేందుకు అక్కన్నుండి కుకీల ఆదివాసులను పారగొట్టాలి! కార్పొరేట్లకు ఖనిజ భూములనప్పగించేందుకు అక్కడి గిరిజనులపై దాడులు చేయించడం బీజేపీ ఆరెస్సెస్‌ల నైజాం! మోడీ హయాంలో ఛత్తీస్‌గడ్‌, ఒరిస్సా, నేడు మణిపూర్‌ గిరిజనులపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనా లంటున్నారు పరిశీలకులు! మెయితీలకు ఎస్టీ హౌదా రాకపోవటమే, వాళ్ళ బాధలకు కారణం అన్న బీజాన్ని నాటి వాళ్ళ ఆగ్రహాన్ని బీజేపీ నుండి, క్రైస్తవ కుకీల మీదికి మళ్ళించారు! ఎస్టీ హోదా కోసం మెయిలీలను కోర్టు కెక్కించటం, ఆ దిశగా ప్రయత్నించమని హైకోర్టు బీరేన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించటం కేంద్రం ఆదివాసీ మంత్రిత్వశాఖ తక్షణం సానుకూలంగా స్పందించటం అదే సమయాన కుకీలు మయన్మార్‌ నుండి వలసవచ్చిన సంచార జాతుల వారేకాని, భారతీయ ఆదివాసీలు కారన్న దుష్పచారాన్ని హోరెత్తించటం నాడు బ్రిటిష్‌వారు పర్వత ప్రాంత కుకీలకు ఎస్టీ హోదానిచ్చి, మైదాన మెయితీల కివ్వకుండా పరస్పర ద్వేషాన్ని రగించారు. అందుకే ఇప్పుడుడైనా మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ, తమ ఆర్గనైజర్‌ పత్రిక ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేయటం విహెచ్‌పి కూడా ‘హిందూవిశ్వ’ పత్రికలో అలాగే రాసి, దానికి కుకీ క్రైస్తవులుపలు హైందవ దేవాలయాలను కూల్చారన్న అభాండాన్ని జోడించి, మెయితీ హిందువుల్లో మత విద్వేష జ్వాలల్ని రేపాడు ‘మిళిందపాండే!” ఇవన్నీ ప్రణాళికా బద్ధంగా చకచకా జరిగాయంటున్నారు విశ్లేషకులు!
ఇక బీరేన్‌సింగ్‌ ఏకపక్షంగా కుకీల గ్రామాలతో సహా పలు పర్వత భూములను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించటం ఆక్రమణలన్న నెపంతో వాళ్ళ గ్రామాలను ఖాళీ చేయిస్తాననటం మణిపూర్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తాననటం ఆదివాసీలను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసాయి. సీఎం బీరేన్‌సింగ్‌, రాజ్యసభ సభ్యుడు ‘లెక్షింబసంజో’రహస్య సమాలోచనల ద్వారా రెండు మెయితీ తీవ్రవాద గ్రూపులను రెచ్చగొట్టి, మేనెలలో జరగబోయే విధ్వంస కాండకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసారన్నది స్థానికుల ఆరోపణ! అందుకు నిదర్శనాలు… 1. ఆ తీవ్రవాద గ్రూపులు, పోలీస్‌ స్టేషన్ల నుండి ఆయుధాలను సమకూర్చుకోవటం 2.పోలీసుల కనుసన్నల్లోనే వాళ్ళకు శిక్షణ ఇప్పించటం 3. కుకీ తెగకు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ (సీనియర్‌ ఐపీఎస్‌)ను బదిలీ చేయించటం. 4. ఆ తర్వాత సీనియరైన అతని తమ్ముని కాదని, త్రిపురలోని ఐపిఎస్‌ను నియమించటం 5. అమిత్‌షా వచ్చి దయచేసి మీరు కొల్ల గొట్టిన ఆయుధాలను తిరిగి ఇవ్వండని అభ్యర్థించి మిన్నకుండటం 6.ఆయుధాలను కొల్లగొట్టిన మొయితీల గ్రామాల నొదిలేసి కుకీ ఆదివాసీల గ్రామాల్లో ఆయుధాలున్నవంటూ ఇల్లిల్లూ సోదాలు చేయించటం ఇవన్నీ బీరేన్‌సింగ్‌ మీది ఆరోపణలను రుజువు చేస్తున్నాయి. అంతే కాదు పోలీసుల మద్దతుతోనే హింసాకాండ విజృంభిస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆరోపించారు. ఇంపాల్‌లో 9మంది ఎమ్మెల్యేల ఇళ్ళపై జరిగిన దాడులకు భీతిల్లిన వాళ్లు ఈ బీరేన్‌సింగ్‌ సీఎంగా ఉన్నంతకాలం ఈ దాడులు ఆగవు బాబోరు అంటూ వాపోతున్నారు. కేవలం రెండునెలల్లో 375 చర్చీలు, పలువురు ఫాస్టర్ల ఇండ్లు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. అయినా ఏమీ చేయలేక నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేసాడు బీజేపీ ఉపాధ్యక్షుడు ‘వన్‌రమ్‌చుంగ’. ”మణిపూర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినాయి. నా ఇల్లే తగలబడిందంటే, ఇక సామాన్యుల సంగతేంటి?” అని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజకుమార్‌ రాజాసింగ్‌ వాపోయాడు! సీఎం బీరేన్‌సింగ్‌ వత్తాసుతో పోలీసు కనుసన్నల్లోనే మణిపూర్‌ మండు తుంటే, ఇక ఈ మంటలాప గలిగేవారెవరంటూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్రోశించారు.
అందుకే భారతీయ సహోదరులారా! ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకండి! లేవండి, చేయీ చేయీ కలుపుదాం. మతవిద్వేష పాలన నుంచి దేశాన్ని విముక్తి చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి జీవిద్దాం.
సెల్‌: 9849081889
పాతూరి వెంకటేశ్వరరావు