ఆలస్యంగా మేల్కొన్నా..

 Editorialకాస్త ఆలస్యంగా మేల్కొన్నా.. సరైన దారిలోనే నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు వేయడం హర్షణీయం. ఆ అడుగులు ఈ దిశగా పడితేనే రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడుతాయి. ఏ మాత్రం తప్పటడుగులుగా మారినా రాష్ట్రాల హక్కులకు ప్రమాదం వాటిల్లక మానదు. నిజానికి కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నిబంధనలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. వారితో రేవంత్‌ రెడ్డి ఈపాటికే గొంతు కలిపి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కలిసి ఉద్యమిస్తామనడం ఆహ్వానించ దగ్గ పరిణామం.
విశాల భావాలతో విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలను కాషాయ రాజకీయ కేంద్రాలుగా మార్చాలన్న కమలనాథుల ఆలోచనల అమలులో భాగమే నేటి యూజీసీ ముసాయిదా. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ల నియామకంపై గవర్నర్లకు పూర్తి అధికారం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ రాష్ట్రాల హక్కులను పాతరేయడమే. సహజంగా యువతలో ఉరకలెత్తే తార్కిక ఆలోచనలకు ఊతమివ్వకుండా నిరర్ధక భావోద్వే గాలను వారి బుర్రలోకి జొప్పించే ప్రయత్నాలను అధికారికంగా చేయడమే తాజా నిబంధనల ఉద్దేశ్యం. యూజీసీ నిబంధనల ముసుగులో వర్సిటీలపై అధిపత్యం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నదని మన రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం.
ఉన్నత విద్యా వ్యవస్థను కాషాయికరించాలనుకోవడం మోడీ తలంపులో భాగమే. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను నామమాత్రం చేయడమే. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కాదు.. మన సంస్కృతిపై దాడి కూడా. బహుభాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆకాంక్షల సమాహారం మన దేశం. వాటిపై దాడి జరిగితే దేశం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇలాంటి దాడులను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత నేడు అన్ని రాష్ట్రాలపైనా ఉంది.
విశ్వవిద్యాలయాలంటేనే మేధో నిలయాలు! వేనవేల చర్చలకు, భావాల సంఘర్షణలకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రాలు! ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్‌ దేశ నిర్మాణం జరిగేది అక్కడే. అటువంటి చోట కనీసం పీహెచ్‌డీ నెట్‌ అర్హతలు లేని వారితో సాంకేతికత, నాటకం, సంగీతం, దృశ్య, ప్రదర్శన కళలు, శిల్పం, యోగా వంటి సబ్జెక్టులు బోధించాలని చూడడం ఆందోళనకరం.
సంస్థలకు నాయకత్వం వహించే వ్యక్తి ఆదర్శప్రాయంగా, అందరికీ ఆమోద యోగ్యుడిగా ఉండాలి. కానీ, తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రయివేటు రంగానికి చెందిన వారితో పాటు, ఎటువంటి విద్యానుభవమూ లేని వారిని కూడా వైస్‌ ఛాన్సలర్లుగా నియమించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇదంతా జరిగేది గవర్నర్‌ కన్నుసన్నల్లోనే! ఇప్పటికే రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అనారోగ్యకరంగా ఉన్నది. తాజాగా వీసీల నియామక బాధ్యత కూడా వారికే అప్పగించడమంటే రాష్ట్రప్రభుత్వాలను మరింత ఇబ్బందులకు గురి చేయడమే వారి హిడెన్‌ ఎజెండాగా ఉంది. విద్యా వ్యవస్థకు ప్రమాదకరంగా ఉన్న ఇలాంటి నిబంధనలను ఫిబ్రవరి 5లోగా వెనక్కి తీసుకోవాలని యూజీసీకి స్పష్టం చేయాల్సిన బాధ్యత విద్యావేత్తలు, అధికారులపై ఉంది.
మతతత్వ, కార్పొరేట్‌ శక్తుల కలయికగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక కీలక రంగాలను సంఫ్‌ు పరివారంతోనూ, ఆ భావజాలంతోనూ నింపిన ఘనత కేంద్ర సర్కారుకు ఉంది. ఇప్పుడు ఉన్నత విద్యా రంగాన్ని అటువంటి మౌఢ్యపు ఆలోచనలతో మెదళ్లను నింపుకున్న వారితోనూ, ఆ భావజాలాన్ని ప్రచారం చేసే వారి తోనూ నింపివేయడానికే ఈ కుటిల ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పనిలోపనిగా ఉన్నత విద్యను పూర్తి స్థాయిలో వ్యాపారమయం చేసి తమ కార్పొరేట్‌ స్నేహితుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కూడా ప్రతిపాదిత మార్పులు ఉపయోగపడతాయి. అందుకే, రాష్ట్ర ప్రభుత్వాలతో, విద్యారంగనిపుణులతో ఏ మాత్రం చర్చించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం, యూజీసీ ఈ ముసాయిదాను రూపొందించి విడుదల చేశాయి. ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికం!
యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల నిర్వహణ కోసం అవుతున్న ఖర్చులో 80 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. అయితే, ఈ వాస్తవ పరిస్థితులు, రాజ్యాంగ నిర్ధేశాలను కేంద్రంలోని మోడీ సర్కారు నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. అందుకే, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఈ చర్యపై తీవ్రంగా స్పందించాయి. రెండు రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మా నాలు చేశాయి. ఈ దిశగా తెలంగాణ శాసనసభలో కూడా తీర్మానం చేసి సీఎం తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యను కాషాయీకరించడాన్ని, వ్యాపా రమయం చేసే ఎత్తుగడలను తిప్పికొట్టడానికి జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రాజ్యాంగాన్ని, అది నెలకొల్పిన విలువలను రక్షించుకోవాలి. అప్పుడే దేశాన్ని కాపాడుకోగలిగిన వారమవుతాం.