– అంగడిలో కనీస సౌకర్యాలు కరువు
నవతెలంగాణ – రాయపర్తి
కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారుల వద్ద నుండి అంగడి కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నాడు తప్ప అంగడిలో విద్యుత్ లైట్లు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కనిపించడం లేదని బాధిత చిరు వ్యాపారులు వాపోతున్నారు. మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే అంగడికి చిరు వ్యాపారులతోపాటు, కూరగాయలు సాగు చేసే రైతులు విచ్చేసి తమ సరుకులను విక్రయిస్తుంటారు. కూరగాయలు ఇతర నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి వందల మంది ప్రజలు వెళ్తుంటారు. అంగడిలో వీధి దీపాలు లేకపోవడంతో వ్యాపారులు టార్చిలైట్లను తలకాయలకు పెట్టుకొని, సెల్ ఫోన్ వెలుగులో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక్కో కాంటా నుండి రూ.30 – 40 వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు తెలుపుతున్నారు. డబ్బులు వసూలు చేసి రసీదు కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. చిన్నాచితక వ్యాపారం చేసుకునే తమ వద్ద అంగడి కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప లైట్లు కూడా ఏర్పాటు చేయడం లేదని బాధపడుతున్నారు. ఇప్పటినుండి అయినా అంగడిలో లైట్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు.