పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు పాదయాత్ర

For environmental protection Walk to CM Camp Office– ప్రారంభించిన ఎల్‌.చంద్రశేఖర్‌
నవతెలంగాణ-సంగారెడ్డి
పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణవేత్తలు మంగళవారం సంగారెడ్డి నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, జీవాయువును పెంచేందుకు చేస్తున్న పాదయాత్రను ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌, బయోడీజిల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి కాలుష్య నియంత్రణకు తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రతి సిటీని, గల్లీని, రోడ్లను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించామని తెలిపారు. ఐబిలోని వివేకానంద విగ్రహానికి, డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రావ్‌, మహాత్మ జ్యోతిరావు పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు తెలంగాణ జర్నలిస్టు యునియన్‌ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి.అశోక్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య, సభ్యులు రాములు, కొండయ్య, మల్లేష్‌, రవిరాజు, వేణుగోపాల్‌ బాలకృష్ణారెడ్డి, ఇందూరి క్రిష్ణ, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.