– ఎల్‌ఐసీలో విజిలెన్స్ వారోత్సవాలు
నవతెలంగాణ -హైదరాబాద్
ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్ల భాగస్వామ్యంతో వాకథాన్‌ను నిర్వహించింది. సర్దార్ వల్లాభారు పటేల్ జన్మదినం సందర్బంగా ప్రతీ ఏడాది పీఎస్‌యూల్లో విజిలెన్స్ వారోత్సవాలు (అవినీతి దుష్పరిణామాలపై అవగాహన) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు జరిగాయి. చివరి రోజూ వాకథాన్‌తో కార్యక్రమాలు ముగిశాయని ఎల్‌ఐసి తెలిపింది. గడిచిన వారంలో ఆన్‌లైన్ క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఆదివారం ఏర్పాటు చేసిన వాకథాన్‌లో 450 మంది పైగా ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నట్లు వెల్లడించింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్, సైఫాబాద్ పోలీసు స్టేషన్, లుంబినీ పార్క్ మీదుగా సాగి ఎల్‌ఐసి జోనల్ కార్యాలయం వద్ద ముగిసిన వాకథాన్‌ను జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అవినీతి దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే విజిలెన్స్ అవేర్‌నెస్ లక్ష్యమని రీజినల్ మేనేజర్ ఆర్ సతీష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విజిలెన్స్ అధికారి కె సునందన్, ఉన్నతాధికారులు ఎం రవి కుమార్, ఉతుప్ జోసెఫ్, జి మధు సుధన్, ప్రమోద కుమార్ సాహు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.