మావోలకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రజాస్వామ్య ఆదివాసి సంఘాల పేరిట మండల పరిధిలోని లక్ష్మీపురం, వెంకటాపురం, మర్కోడు పరిసర ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. వెలసిన పోస్టర్లు, కరపత్రాలలో ఈ విధంగా రాసుంది.. మావోయిస్టు దళంలో చేరాక మహిళలు అనేక బాధలు అనుభవిస్తున్నారు. అలాగే దళంలో మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. దళంలో చేరిన మహిళలతో వంట పని, బ్యాగులు మోపిస్తూ నాయకుల వ్యక్తిగత పనులకు బానిసలుగా చూసే పద్దతి నుండి విముక్తికై పోరాడుదాం. అదేవిధంగా విద్యా-ఉద్యోగం, వ్యాపార అవకాశాలను ఉపయోగించుకొని ప్రగతిని సాధిద్దాం. మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకుని మహిళలు స్వయం పాలకులుగా మారాలంటూ.. పిలుపునిస్తూ వాల్ పోస్టర్లు, కరపత్రాల సారాంశం పేర్కొని ఉంది. శుక్రవారం (మార్చి 8) మహిళా దినోత్సవం నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల చేత మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు వెలువడటంతో శుక్రవారం మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల ముఖ్య నాయకుల మధ్య, మండల వాసుల్లో చర్చా గోష్టి తారాస్థాయికి చేరుకుంది.