నువ్వే కావాలయ్యా..

నువ్వే కావాలయ్యా..రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్‌ ఇడియట్‌’. సిమ్రాన్‌ శర్మ కథానాయిక. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందడి’ దర్శకురాలు గౌరీ రోణంకి దీన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల  కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా నుంచి ‘కావాలయ్యా..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. సాంగ్‌  కంపోజిషన్‌, పిక్చరైజేషన్‌ చాలా బాగుందన్న ఆయన హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ మంచి బీట్‌తో కంపోజ్‌ చేయగా, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్‌ అందించారు. గాయని మంగ్లీ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి అదోలా చూశావయ్యా, మాటల్తోనే మనసుకు మందే పెట్టావయ్యా, తస్సాదియ్యా, తస్సాదియ్యా, పచ్చి పచ్చిగ చెప్పాలంటే పిచ్చిగ ఫిదా అయ్యా, పూవుల్తోటి పొట్లం గట్టి మేరె దిల్‌ దియా, చూస్కోవయ్యా, తీస్కోవయ్యా, కావాలయ్యా, నువ్వే కావాలయ్యా…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట అని మేకర్స్‌ తెలిపారు. మాధవ్‌, సిమ్రాన్‌ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్‌ – శ్యామ్‌, వంశీ, సినిమాటోగ్రఫీ – రామ్‌ రెడ్డి, ఆర్ట్‌ – కిరణ్‌ కుమార్‌ మన్నె, ఎడిటింగ్‌ – విప్లవ్‌ నైషధం.