వైరా కారులో వార్‌

War in Vaira's car– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ తీరుపై రాములునాయక్‌ ఆగ్రహం
–  కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటించినా ఎమ్మెల్యే నాయక్‌కు చేదు అనుభవం
–  బంధువుల మధ్య చిచ్చుపెట్టిన దళితబంధు దరఖాస్తులు
–  నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ జోక్యంపైనా ఎమ్మెల్యే సీరియస్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ దూరపు బంధువులు. వరుసకు బావబామ్మర్దులయ్యే వీరిరువురి మధ్య నెలకొన్న ‘కారు’ టిక్కెట్‌ పోరులో బామ్మర్ది మదన్‌లాల్‌ పైచేయి సాధించారు. అయినప్పటికీ కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటిస్తూ…పార్టీ వీడనని, మదన్‌లాల్‌కు సహకరిస్తానన్న ఎమ్మెల్యే రాములునాయక్‌ మధ్య ‘బంధా’నికి దళితబంధు చిచ్చుపెట్టింది. ‘మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకున్నారని’ రాములునాయక్‌, మదన్‌లాల్‌ తీరుపై కన్నెర్ర చేశారు. అదేవిధంగా మదన్‌లాల్‌కు టిక్కెట్‌ ఇప్పించారనే భావనతో మంత్రి పువ్వాడ అజరుకుమార్‌పైనా ఆగ్రహించారు.
నాయక్‌ ఆగ్రహం వెనుక…
తనకు టిక్కెట్‌ రాకున్నా పార్టీ అభివృద్ధికి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యేలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికడానికి ప్రధాన కారణం మదన్‌లాల్‌ వ్యవహరశైలేనని రాములునాయక్‌ గ్రూపు మాట. ఎమ్మెల్యే హౌదాలో రాములునాయక్‌ 600 మంది పేర్లతో దళితబంధు జాబితాను కలెక్టరేట్‌కు పంపారు. మదన్‌లాల్‌ 472 పేర్లతో మరో జాబితాను ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యేగా రాములునాయక్‌ ఉండగా మదన్‌లాల్‌ ఎలా ప్రభుత్వ పథకాల్లో జోక్యం చేసుకుంటారని ఎమ్మెల్యే వర్గీయుల ప్రశ్న. ‘ఎమ్మెల్యే మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారని’ వారంటున్నారు.
అయితే, మదన్‌లాల్‌ పంపిన పేర్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్టు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మదన్‌లాల్‌ గ్రూపు మంతనాలు సాగించారని తెలుస్తోంది. రాములునాయక్‌ నిర్వహించే సమావేశాలకు వెళ్లద్దని ఆ మీటింగ్‌ల సారాంశంగా వినిపిస్తోంది. సంక్షేమ పథకాలపై వైరా మార్కెట్‌ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అటు మదన్‌లాల్‌పై, ఇటు మంత్రిపై ఎమ్మెల్యే మండిపడ్డారు.
బామ్మర్దితో పాటు మంత్రికి వార్నింగ్‌…
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ తీరుపై మండిపడుతూనే మంత్రి అజరు వ్యవహారశైలిపైనా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏ అధికారంతోని మదన్‌లాల్‌ పెట్టిన లిస్టును మంత్రి అజరు ఆమోదిస్తారు. మీ బాధ్యతలు నిర్వహించడం మర్చిపోయి వైరా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దు. ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు, అభ్యర్థుల మధ్య చిచ్చుపెట్టి ఆయనొక్కడినే గెలిచాననే పేరుతో మంత్రి పదవి పొందాడు. మళ్లీ ఆ విధంగానే చేయాలని చూస్తున్నారు. మంత్రి పువ్వాడ నా విధులకు ఆటంకం కలిగిస్తే తగిన గుణపాఠం చెబుతా. కేసీఆర్‌ రాజైతే… కేటీఆర్‌ యువరాజు…మంత్రి పువ్వాడ అజరు..సామంతరాజులా వ్యవహరిస్తున్నాడు. మంత్రి నా నియోజకర్గంలో వేలుపెట్టడమేంటి?’ అంటూ ఎమ్మెల్యే మంత్రిపై మండిపడ్డారు. వేదిక మీద నుంచే ‘మంత్రి అజరు డౌన్‌..డౌన్‌’ అని ఎమ్మెల్యే నినదించటం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ప్రభుత్వ పథకాలపై ‘గులాబీ’ గుత్తాధిపత్యానికి అధికారపార్టీ ఎమ్మెల్యే మాటలే ఓ నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
జై కేసీఆర్‌..జై రాములునాయక్‌…
రాములునాయక్‌ ఉపన్యాసం సాగుతుండగా కార్యకర్తలు నినాదాలు చేశారు. జై కేసీఆర్‌…జై రాములు నాయక్‌ అని నినదించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ మాటే వేదం…వైరా నియోజకవర్గంలో రాములునాయక్‌ మాటే వేదం…అని నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో త్వరలో రాములునాయక్‌ అనుచరగణం మొత్తం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైంది. రాములునాయక్‌ మాట్లాడిన తీరుపై ప్రశ్నించేందుకు వైరా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌కు ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదు.