యుద్ధం మానవాళిని కకావికలం చేస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, కేవలం మనిషి చేసే విధ్వంసం. బడుగుదేశాల వనరుల దోపిడీకి, ఆ దేశ ప్రజల శ్రమదోపిడీకి ఆయుధాలతో భయ భ్రాంతులు గావించి ఆయా దేశాలను లొంగదీసు కోవడానికి సామ్రాజ్య వాదశక్తులు చేసే దుందు డుకు చర్యలే యుద్ధాల రూపంలో ముందుకొస్తాయి. ఇది చరిత్ర చెబుతున్న పాఠం. ఎంతటి దేశాధినే తైనా కావచ్చు. గుణపాఠాలు నేర్వక యుద్ధహింసకు కారకుడయ్యా డంటే ఆధునిక అనాగరికుడిగా, నరహంత కునిగా మనం జమకట్ట వచ్చు.
1945 ఆగస్టు 6వ తేదీ ఉదయం 8గంటల 15 నిమిషాల పాత్ర:కాలవేళలో అమెరికా, జపాన్ నగరం హీరోషిమాపై ప్రపథమంగా అణుబాంబు వేసింది. అలాగే ఆగస్టు 9న నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసింది. ఈ రెండు బాంబుల ఫలితంగా లక్షమందికి పైగా మరణించారు. మరో యాభైవేల మందికి పైగా క్షత గాత్రులయ్యారు. మరికొన్ని వేలమంది ఆ అగ్నికీలల్లో ఆనవాలు కనిపించక ఆహుతై పోయారు. లక్షలాది మంది ఆ రేడియేషన్ ప్రభావానికి రోగగ్రస్తులయ్యారు. పారంపర్యంగా ఇప్పటికీ ఆ విషమబాధలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అణుబాంబులతో, మారణాయుధాలతో ప్రపం చాన్ని పాదాక్రాంతం చేసుకోవాలను కుంటున్న అమెరికా సామ్రాజ్యవాద రాక్షస దుగ్ద ఇది.
సమకాలీన ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. 1. ఇజ్రాయిల్-పాలస్తీనా (గాజా)పై చేసే యుద్ధదాడి. 2. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం.
దొంగే. దొంగ దొంగ. అని అరచిన చందంగా నరహంతకునిగా పేరొందిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కొత్త పల్లవిని అందుకు న్నాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, అల్లర్లు చేయడం కోసం ఇరాన్ నిధులు సమకూర్చుకుంటున్నదని ఆరోపిస్తున్నాడు. ఇటీవల అమెరికా పర్యటనలో, ఆదేశ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతూ ఇలాగే వాపోయాడు. విశేషం ఏమంటే అదే సందర్భంలో యుద్ధోన్మాది నెత న్యాహును అంతర్జాతీయ కోర్టులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో కలిసిన యువలోకం ఆగ్రహంతో నినదించింది. దిష్టిబొమ్మలను తగల బెట్టింది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయిల్‌కు వత్తాసు పలుకుతున్న విషయం ఎల్లరకూ తెలిసిందే. అయితే ఇదంతా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న కుట్రగా నెతన్యాహు అభివర్ణిం చాడు. అక్కడితో ఆగలా…తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని ‘ఇరాన్ యూజ్ఫుల్ ఇడియట్స్’ అని కూడా నిందించాడు. గాజాను ఆదుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా నిధులు వస్తుంటే వాటిని హమాస్ ఉగ్రవాద సంస్థ కైంకర్యం చేసి తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని ఏకరువు పెట్టాడు. పైగా పాలస్తీనాకు వ్యతిరేకంగా తాము చేస్తున్న యుద్ధం (దాడి) న్యాయబద్దమేనని సమర్థించుకున్నాడు. యుద్ధదాడులు చేయడమెందుకు? ఇలా ప్రేలాపనలు పేలడం ఎందుకు? ఉన్మాదులు ఇలానే ప్రవర్తిస్తారని మానసిక నిపుణుల అభిప్రాయం. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, ప్రెసిడెంట్ పోటీలో ఉన్న కమలాహారిస్‌తో సహా కాల్పుల విరమణకు ఇదే సరైన సమయం అని ఒత్తిడి తెస్తున్నారు కారణాలు ఏమైనా గానీ… .అయినా నెతన్యాహుకు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. మధ్యధరా సముద్రం తూర్పుతీరంలో సుమారు 60 కి.మీ. పొడవు, 10 కి.మీ. వెడల్పు గల గాజా పట్టి (గాజా స్ట్రిఫ్) ప్రాంతంలో దాదాపు పాతిక లక్షల మంది పాలస్తీనీయులు నివసిస్తు న్నారు. దీనిపై ఇజ్రాయిల్ ఆధిపత్య పాలన సాగుతున్నది. ఇజ్రాయిల్ సైనికులు నిత్యం మారణాయుధాలతో పాలస్తీనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ హింసాచర్యలకు పాల్పడుతుంటారు. ఈ సైనిక దాడుల్లో విదేశీ జర్నలిస్టులు సైతం బలైపోవడం గమనార్హం. గత పది నెలలుగా సాగుతున్న ఈ యుద్ధ దాడిని ఖండిస్తూ ఇప్పుడిప్పుడే విద్యార్థి యువజన లోకం వీధుల్లోకి వస్తున్నది. పాలస్తీనీయులకు సంఘీభావం ప్రకటిస్తున్నది. సుమారు నలభైవేల మంది ప్రజానీకం ఈ యుద్ధదాడికి బలైపోయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇజ్రాయిల్-లెబనాన్ యుద్ధ ఛాయలు కొత్తగా తెరమీదకు కమ్ముకొస్తున్నాయి. హమాస్‌కు మద్దతుగా లెబనాన్ ఎప్పటినుండో ఇజ్రాయిల్‌పై ప్రతిఘటనా వాణిని విన్పిస్తున్నది. తాజాగా ఇజ్రాయిల్‌లోని గొలన్‌హైట్స్ ఫుట్‌బాల్ కోర్టుపై బాంబుదాడి జరిగింది. ఇది లెబనాన్‌లోని హిజుబుల్లా ఉగ్రవాదదాడుల పనే అంటూ తగిన ప్రతీకారం తీసుకుంటామని నెతన్యాహు అంటున్నాడు. అసలు ఆ దాడితో తమకెలాంటి సంబంధం లేదని లెబనాన్ మొత్తుకుంటున్నా ఇజ్రాయిల్ వినడానికి సిద్ధంగా లేదు. కక్ష సాధింపు చర్యగా లెబనాన్‌లోని బక్కావ్యాలీ, కఫార్‌కిలా ప్రాంతాలను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆపకపోతే, తీవ్రపరిణామాలు చవిచూడవలసి వస్తుందని ఇరాన్ బాహాటంగా హెచ్చరించింది. ఈ వివాదం ముదిరితే విశ్వశాంతికి, ప్రపంచ మానవాళి భద్రతకు ముప్పు తప్పదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి నాజర్ కనాని పేర్కొంటున్నాడు.
ఇజ్రాయిల్ పిచ్చివాదనలు ఇకనైనా కట్టిపెట్టి, నిజానిజాలు తెలుసుకుని సఖ్యత కోసం రాజీకై ముందుకు రావాలని కనాని విజ్ఞప్తి చేశారు. తమదేశాల పౌరుల అశాంతిని చల్లార్చేందుకు ఇతరదేశాలపై కాలుదువ్వడం రెచ్చగొట్టడం ఎప్పటికీ సరికాదని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో గత బుధవారం నాడు హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ దేశంలోనే ఇజ్రాయిల్ సైన్యం హతమార్చింది. హిజుబుల్లా కమాండర్ ఫహీద్ షుక్రును కూడా బీరుట్‌లో అదే సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనలతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకార జ్వాలలతో రగిలి పోతున్నది. ఈ రెండు ఘటనల వెనుక అమెరికా హస్తం ఉన్నట్టు ఇరాన్ తలపోస్తున్నది.
కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యాతో రాజీమార్గం వైపునకు ప్రయాణించడం. శాంతికాముకులకు ఊరట కలిగిస్తున్నది. ఇదో శుభపరిణామం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధకాలం దాదాపు రెండున్నరేండ్లు. సుమారు ఐదు లక్షల మంది ప్రజానీకం నేలకొరిగారు.
జూలై 20న తన జాతి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రష్యాతో చర్చలు అవసరమని జెలెన్‌స్కీ అభిప్రాయ పడ్డారు. వచ్చే నవంబరులో జరిగే శాంతి-శిఖరాగ్ర సభలకు ప్రతినిధులను పంపమని రష్యాను కోరారు. అంతేకాదు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా ఇటీవల చైనా వెళ్లి, ఆ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూతో చర్చల కోసం రష్యాను ఒప్పించమని ప్రాధేయ పడ్డారు. యుద్ధ పరిష్కార చర్చలు ఉభయుల మధ్య జరగాలి తప్ప బయటవారి జోక్యం ఉండరాదనేది చైనా ఉద్ధేశ్యంగా కనిపిస్తున్నది.
ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకుని నాటో విస్తరణకు అవకాశం ఇవ్వడమంటే, తమ దేశ ప్రజలపై యుద్ధ ప్రమాదాన్ని నేరుగా ముంగిట్లోకి ఆహ్వానిచడమేనని రష్యా గగ్గోలు పెట్టడం అందరి కీ తెలిసిందే. తమ ఆత్మరక్షణ కోసమే ఉక్రెయిన్‌ను నాటోకి బయటే ఉంచాలన్నది రష్యా వాదన. అమెరికా కనుసన్నల్లోనే నాటో నడుస్తుంది మరి.
వాస్తవం ఏమిటంటే సోషలిస్టు దేశాలుగా పేరుగాంచిన రష్యా- చైనా మైత్రి చాలాకాలం తర్వాత బల పడటానికి బాటలు పడటం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాది పైచేయి కావడం, ఉక్రెయిన్ మరింత ఆయుధ సహకారానికి నాటో చేతులెత్తేయడం, అన్నింటికంటేమించి నాటో యుద్ధోన్మాదాన్ని ప్రజలు నానాటికి ప్రతిఘటిం చడం వలన జెలెన్‌స్కీ వెనక్కి తగ్గవలసి వచ్చింది.
ఈ ఆధునిక యుగంలో యుద్ధం ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు, ప్రకృతి మానవాళి విధ్వంసం తప్ప. యుద్ధోన్మాదులు వెనక్కి తగ్గాలంటే ప్రజా ఉద్యమాలు తప్పనిసరి. ఆ క్రమంలో నెతన్యాహు వంటి యుద్ధోన్మాదులు ఈ రోజు కాకపోయినా రేపైనా వెనకడుగు వేయక తప్పదు.
కె.శాంతారావు
9959745723