పెద్దవాగు వరద ఉధృతి పై ప్రజలను అప్రమత్తం చేయండి..

Warn people about Peddavagu flood surge..– అధికారులకు  మంత్రి పొంగులేటి ఆదేశం..
– భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు ఫోన్..
– ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశం..
– ఏపీ ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని అభయం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడం తో దిగువ భాగం,లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఆంధ్రా పరిధి కూడా ఉండడంతో అక్కడి ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని, పెద్దవాగు వరద ఉధృతి తో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.