హెచ్చరికలు.. మార్గదర్శనం

Warnings.. Guidanceమహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటములే గెలుపొందాయి. మహారాష్ట్రలో బిజెపి, ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేన, అజిత్‌ పవార్‌కు సంబంధించిన ఎన్‌సిపి మహాయుతి ఫ్రంట్‌ సాధించిన అనూహ్య విజయం ఆశ్చర్యపరుస్తుంది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ 145 స్థానాలు కాగా మహాయుతికి 234 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ థాకరేకు చెందిన శివసేన, శరద్‌ పవార్‌కు సంబంధించిన ఎన్‌సిపి ఫ్రంట్‌ మహా వికాస్‌ అఘాడీ (ఎంవిఎ)కి 48 సీట్లే దక్కాయి. అంచనాలకు మించి ఓట్లు, సీట్లు రావడానికి బిజెపి సహజసిద్ధంగా ప్రయోగించిన హిందుత్వ కార్డు, అస్తిత్వ రాజకీయాలు ప్రధాన కారణం. కుల, మత, ప్రాంతీయ భావాలను తనకు అనుకూలంగా మరల్చు కోవడంలో, ఓట్లను సమీకరించడంలో సక్సెస్‌ అయిందని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మరాఠా కోటాను తానే తెరమీదకు తెచ్చి, నిరసనగా ఆందోళనలు చేస్తున్న తరగతులను సైతం తన వైపు తిప్పుకుంది. ఉచిత పథకాలొద్దని విపక్షాలకు సుద్దులు వల్లించే బిజెపి, అధికారం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది.
గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో జెఎంఎం నేతృత్వంలోని కూటమి ఘన విజయం బిజెపికి మింగుడు పడని వ్యవహారం. రాష్ట్రంలో 81 స్థానాలకుగాను జెఎంఎం ఫ్రంట్‌ 56 సీట్లు గెలుపొందింది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎకి కేవలం 24 సీట్లొచ్చాయి. అవినీతి ఆరోపణల కేసులో జెఎంఎం చీఫ్‌, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను కేంద్ర బిజెపి సర్కార్‌ జైలులో పెట్టించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఆయనను బయటికి రానీయలేదు. బెయిల్‌ సైతం రాకుండా అడ్డుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే హేమంత్‌కు బెయిల్‌ లభించింది. హేమంత్‌ జైలులో ఉండగా కొన్నాళ్లు సిఎంగా పని చేసిన ఆయన సోదరుడు చెంపయి సోరెన్‌ను బిజెపి తమలో చేర్చుకున్నా, ప్రధాని మోడీ, ఇతర బిజెపి పెద్దలు హేమంత్‌ అవినీతి పరుడంటూ పెడబొబ్బలు పెట్టినా, మత విద్వేషాలు, ఎస్‌టి, నాన్‌-ఎస్‌టి విద్వేషాలు రెచ్చగొట్టినా ఆ కుట్రలను పటాపంచలు చేసి జెఎంఎం ఫ్రంట్‌కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. హేమంత్‌పై బిజెపి చర్యలన్నీ రాజకీయ కక్షతో కూడుకున్నవని గ్రహించి జెఎంఎం ఫ్రంట్‌కు రెండోసారి పట్టం కట్టి తమ విజ్ఞతను చాటుకున్నారు. హేమంత్‌ సారథ్యంలోని ప్రభుత్వమే తమ హక్కులను పరిరక్షిస్తుందని ఆదివాసీలు, ఇతరులు సైతం నమ్మారు. జెఎంఎం కూటమి విజయానికి అది ప్రకటించిన, ఇంతకు ముందు అమలు చేసిన సంక్షేమ పథకాలూ కారణమే.
మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు పలు హెచ్చరికలతో పాటు మార్గదర్శనమూ కావిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడికి, నయా-ఉదారవాద విధానాలకు దేశానికి మహారాష్ట్ర ముఖద్వారం. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం సైతం ఈ రాష్ట్రంలోనే ఉంది. అందుకే మహారాష్ట్ర చేజారి పోకుండా ఎన్నికల ప్రకటనలో జాప్యం సహా అన్ని పాచికలనూ బిజెపి వాడింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన విపక్ష ఎంవిఎ చివరి వరకు అతి విశ్వాసంలోనే ఉంది. సీట్ల సర్దుబాట్లలో అసంతృప్తులు, పార్టీల ఆధిపత్య ధోరణి ఎంవిఎను ఘోరంగా దెబ్బతీసింది.
జార్ఖండ్‌లో బిజెపి కుయుక్తులను జెఎంఎం కూటమి సమర్ధవంతంగా ఎదుర్కొని విజయ తీరాలు చేరింది. మహారాష్ట్రలో మోడీ చరిష్మా పని చేసిందని ఊరేగుతున్న బిజెపికి జార్ఖండ్‌లో అదేమైందో విశదీకరిస్తే బాగుంటుంది. గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్‌లో సహజ వనరులను అదానీ, ఇతర కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న బిజెపి పన్నాగం పారలేదు. వయనాడ్‌లో ప్రియాంక గెలుపు ఊహించినదే. దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా అధికార కూటములు, పార్టీలు నెగ్గాయి. మహారాష్ట్రలో దహాను స్థానంలో సీపీఐ(ఎం) జయకేతనం వామపక్ష, ఆదివాసీ హక్కుల, కార్మిక, ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో స్వంతంగా మెజార్టీ కోల్పోయి కేంద్రంలో సంకీర్ణ సర్కారు నడుపుతున్న బిజెపికి హర్యానా, మహారాష్ట్ర గెలుపులు ఊతమిస్తున్నాయి. మతతత్వ-కార్పొరేట్‌ విధానాలను మరింత ముందుకు తీసికెళ్లేందుకు బిజెపి ప్రయత్నిస్తుంది. ప్రజలు అప్రమత్తతతో మెలగాలి.