యుద్ధాలు, సైనిక ఘర్షణల్లో బలిపశువులు మహిళలే !

– ఐక్యరాజ్య సమితి ఆందోళన
న్యూయార్క్‌ : యుద్ధాలు, సైనిక ఘర్షణలు, చర్యల వల్ల అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనేది మహిళలు, ఆడపిల్లలేనని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నటాలియా కనీమ్‌ హెచ్చరించారు. తాము చేయని తప్పుకు వారు మూల్యం చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఆమె, గాజా, సూడాన్‌ల్లో జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే శాంతి అనేది ఎంత దుర్బలంగా వుందో తెలుస్తోందని అన్నారు. ఘర్షణల కారణంగా అత్యంత సున్నితమైన వర్గాలు ప్రధానంగా అన్ని వయస్సులకు చెందిన మహిళలు ఇటువంటి వినాశకరమైన పర్యవసానాలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రతీ చోటా కూడా, మహిళలు, ఆడపిల్లలు యుద్ధం యొక్క వినాశనాన్ని ఎదుర్కొనడం చూస్తున్నాం. వారికి కావాల్సిందల్లా శాంతి, వారి ఇళ్ళల్లో, కమ్యూనిటీల్లో ప్రశాంతత అని అన్నారు.
ప్రజలు నిర్వాసితలైనపుడు ఏం జరుగుతుందీ అన్నదానికి సెంట్రల్‌ ఆఫ్రికాలోని చాద్‌ను ఉదహరణగా కనీమ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి నిరుపేద దేశాల్లో చాద్‌ ఒకటైనప్పటికీ అక్కడ 10లక్షల మందికి పైగా శరణార్ధులు ఆశ్రయం పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. వీరిలో దాదాపు 5లక్షల మంది గత ఆరు మాసాల్లో సూడాన్‌ ఘర్షణల నుండి పారిపోయిన వారేనని ఆమె తెలిపారు. వారిలో మెజారిటీ సంఖ్య మహిళలు, పిల్లలేనన్నారు. ఈ మహిళల్లో చాలామంది తాము పారిపోయిన దేశాల్లో లేదా తాము ఆశ్రయం పొంది ప్రస్తుతం జీవిస్తున్న దేశాల్లో లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధ ఘర్షణల వల్ల మహిళలు, బాలికలపై లైంగిక హింస ఏ స్థాయిలో వుంటుందో వివరిస్తూ డిసెంబరు 10 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి హై కమిషనర్‌ కార్యాలయం (ఒహెచ్‌సిహెచ్‌ఆర్‌) ఒక నివేదికను ప్రచురించింది. ఏకపక్ష హత్యలు, వేధింపులు, లైంగిక హింస, బలవంతపు వివాహాలు ఇవన్నీ యుద్ధంలో అమలు చేసే ఎత్తుగడలని, వీటికి మహిళలే లక్ష్యాలని ఆ నివేదిక పేర్కొంది. యుద్ధాలు, ఘర్షణల తర్వాత ఆయా సమాజాల్లో చట్ట బద్ధ పాలన సాధారణంగా విచ్ఛిన్నమవుతుందని, చిన్నపాటి ఆయుధాలు అందుబాటులో వుండడం, సామాజిక, కుటుంబ వ్యవస్థలు చెల్లాచెదురు కావడంతో మహిళలపై శారీరక హింస, దూషణలు బాగా పెరిగిపోతాయని ఒహెచ్‌సిహెచ్‌ఆర్‌ పేర్కొంది. ఈ సంక్షోభం పట్ల స్పందించాల్సి వుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సారా హెండ్రిక్స్‌ పేర్కొన్నారు. మానవతా, రాజకీయ క్రమాల్లో మహిళలు అర్ధవంతమైన పాత్ర పోషించేందుకు పాటు పడుతున్న మహిళా నేతృత్వ సంస్థలకు మనం పూర్తి స్థాయిలో మద్దతునివ్వాలని కోరారు.