అంబేద్కర్‌ది సహజ మరణమేనా?

Did Ambedkar die a natural death?బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 14 అక్టోబర్‌ 1956న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూమతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్‌ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక, వారంతా బౌద్ధులు గనక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ్‌పూర్‌ను ఎంచుకున్నానని ఆయన ప్రకటిం చారు. అంతేగాని, నాగ పూర్‌లో ఆరెస్సెస్‌ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచు కోలేదనీ, వివరణ ఇచ్చారు. అయితే ఆ తర్వాత 52 రోజులకే 6 డిసెంబర్‌ 1956న అంబేద్కర్‌ కన్నుమూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందని, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నాయి.
ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్‌.పెరియర్‌ తన వార్తాపత్రిక ‘విడుతలై’లో ఇలా రాశారు. ”డాక్టర్‌ అంబేద్కర్‌ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఎదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేద్కర్‌ చనిపోవడం వెనుక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను”-అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేద్కర్‌ మరణాని క్కూడా కారకులని ఆయన నిర్ధారించారు. అందుకు అవకాశమిచ్చే పలు అంశాలను కూడా ఆరోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ”తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని” స్వయాన అంబేద్కర్‌ కుమారుడు యశ్వంత్‌-ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేద్కర్‌ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేద్కర్‌ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయ్యింది. ”తన తండ్రిది సహజ మరణం కాదని, హత్య అనీ-దోషులెవరో తేల్చాలనీ- అంబేద్కర్‌ కుమారుడు యశ్వంత్‌ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖిత పూర్వక నివేదికలు, విన్నపాలు అందజేశారు. అంబేద్కర్‌ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్‌ చేశారు.
నాటి ప్రధాని నెహ్రూ స్పందించి సక్సేనా నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్టయ్యేది కదా? ఢిల్లీ పోలీస్‌ ఐజి ఇచ్చిన వివరణను మాత్రం 27 నవంబర్‌ 1957 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి గృహమంత్రి గోవింద్‌ వల్లబ్‌ పంత్‌తో పార్లమెంట్‌లో ఒక ప్రకటన ఇప్పించారు. ”అంబేద్కర్‌ మరణం సహజమైందని”- ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్తకాలు ప్రచురింపబడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయటపడుతూనే ఉంది. 26 జనవరి 2021 నాగపూర్‌ ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం ముందు-అంబేద్కర్‌ ఎలా చనిపోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. 26న జనవరినే ఎందుకు ఎంచుకున్నారంటే – ఆ తేదీన అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! మనువాదులైన ఆరెస్సెస్‌ వారి పాత్ర లేకపోతే జనం వెళ్లి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవాల్సిన విషయం!
అంబేద్కర్‌ మరణానికి ముందు ఆయన కార్యకలాపాలు ఎలా జరిగాయో చూద్దాం! 3 డిసెంబరు 1956న అంబేద్కర్‌ రెండో భార్య సవితా కబీర్‌, ఆమె సోదరుడు బాలు కబీర్‌, తండ్రి కె.బి.కబీర్‌, ఫ్యామిలీ డాక్టర్‌, మాల్యాం కర్‌లు అంబేద్కర్‌తో కలిసి గ్రూప్‌ఫొటోలు దిగారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, తమది సంతోషకరమైన కుటుంబమని ప్రపంచానికి చెప్పడానికే డాక్టర్‌ శ్రీమతి సవిత ఆ ఫొటో షూట్‌ ఏర్పాటు చేశారని ఒక అభిప్రాయం ఉంది. 4 డిసెంబర్‌ 1956, రాజ్యసభ మెంబర్‌గా ఉన్న అంబేద్కర్‌, ఆ రోజు రాజ్యసభకు వెళ్లారు. పార్లమెంట్‌లో మిత్రులతో సరదాగా, చలాకీగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం శ్రీమతి సవిత బంధువులు తండ్రి, సోదరుడు అందరూ ముంబాయి వెళ్లిపోయారు. అయితే, వెళ్లేముందు వారు ఆమెకు నిబ్బరంగా ఉండమనీ, ధైర్యంగా అనుకున్న పని చేయమని ప్రోత్సహించి వెళ్లారు. దీనికి కేవలం రెండు రోజుల (డిసెంబరు 6న) తర్వాత – ఆయన మరణవార్త విని అందరూ ఆశ్చర్యపోయారు. ”ఇంత అకస్మాత్తుగా ఎలా చనిపోయారూ?” అంటూ ఆవేదనకు గురై, విషయం జీర్ణించుకోలేక పోయారు.
5 డిసెంబర్‌ 1956న అంబేద్కర్‌ రెండో భార్య సవిత, ఫ్యామిలీ డాక్టర్‌ మాల్యాంకర్‌లు కలిసి కావల్సిన వస్తువులేవో తేవడానికి బయటికి వెళ్లారు. వాళ్లుసాయంత్రం దాకా తిరిగి రాలేదు. ఇంతసేపు ఎటు వెళ్లారని అంబేద్కర్‌ టైపిస్టు రట్టూను విసుగ్గా అడిగారు. తనకు తెలియదన్నాడు రట్టూ. టైప్‌ చేయాల్సిన కొన్ని ఉత్తరాలు అంబేద్కర్‌ డిక్టేట్‌ చేశారు. సాయంత్రం 8 గంటలకు జైనుల బృందం ఒకటి ఆయన్ను కలవడానికి వచ్చింది. ఆ మరునాడు డిసెంబర్‌ 6న ఒక కార్యక్రమానికి రావల్సిందిగా ఆహ్వానించింది. అంబేద్కర్‌ వస్తానని ఒప్పుకున్నారు కూడా! ఆ బృందం వెళ్తూ వెళ్తూ ఆయనకు ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చి వెళ్లింది. అది బుద్ధుడిపై రాసిన పుస్తకం. జైనుల బృందంతో మాట్లాడుతున్నప్పుడే ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చి జనరల్‌ చెకప్‌ చేసి, తను ముంబాయి వెలుతున్నానని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటికి అంబేద్కర్‌ రచన ‘బుద్ధ అండ్‌ హిజ్‌ ద్ధమ్మ| కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు టైపిస్ట్‌ రట్టూతో టైప్‌ చేయించారు. టైపిస్ట్‌ వెళ్లిపోయిన కొంతసేపటికి అంబేద్కర్‌ రాత్రి భోజనం ముగించుకుని పడక గదిలోకి వెళ్లిపోయారు. అంతే!!
ఆ మరునాడే అనూహ్యంగా ఆయన మరణవార్త బయటికొచ్చింది. సజావుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న వ్యక్తి, ఆరోగ్యం ప్రమాదకరంగా లేని వ్యక్తి ఎలా మరణించారన్న అనుమానం దేశ ప్రజలకు కలిగింది. విష ప్రయోగం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఎవరు విషప్రయోగం చేశారూ? అన్నది అధికారికంగా బయటికి రాలేదు. మామూలుగా అయితే సరుకులు తీసుకురావడానికి శ్రీమతి సవితకు ఫ్యామిలీ డాక్టర్ను తీసుకుని వెళ్ళాల్సిన పనిలేదు. తీసుకు వెళ్లారంటే అతని సహాయంతో కొనవల్సిన వస్తువేదో ఉండి ఉంటుంది. పైగా ఆ ఫ్యామిలీ డాక్టరు ఉన్నఫళంగా ఊరు విడిచి వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందీ? వెళితే సవిత కుటుంబ సభ్యులతో పాటే ముంబాయి వెళ్లిపోవాల్సింది. ఒక రోజు ఆగి, ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటీ? అంబేద్కర్‌ రెండో భార్య డా.సవితది బ్రాహ్మణ కుటుంబం, ఫ్యామిలీ డాక్టరు బ్రాహ్మణుడు, ఆనాటి అగ్రశ్రేణి దేశ నాయకులంతా బ్రాహ్మణులు. వీరందరూ కలిసి, ఆనాటి బ్రాహ్మణాధిపత్య ఆరెస్సెస్‌ సంస్థకు సహకరించారా? అంబేద్కర్‌ ఎదుగుదలని జీర్ణించుకోలేకపోయారా? ఇలా ఆనాటి దేశప్రజల్లో వ్యక్తమైన సందేహాలు అనేకం. అవే సందేహాలు ఈనాటి ప్రజల్లో కూడా ఇంకా కొనసాగుతున్నాయి.
వీటికి నేపథ్యంగా మరి కొన్ని విషయాల్ని కూడా గమనించాల్సి ఉంటుంది. 1. బౌద్ధం స్వీకరించిన లక్షలాది మందిని ఉద్దేశించి అంబేద్కర్‌ 15 అక్టోబర్‌ 1956న నాగపూర్‌లో రెండు గంటల పాటు ఉపన్యసించడం. 2. బుద్ధుడు-కార్ల్‌మార్క్స్‌ శీర్షికన 4వ బుద్దిస్ట్‌ కాన్ఫరెన్స్‌: 20 నవంబర్‌ 1956న అంబేద్కర్‌ నేపాల్‌లో ఉపన్యసించడం. 3.ప్రాచీన భారతంలో హిందూ మతంలోని లొసుగులు-శీర్షికన అంబేద్కర్‌ గ్రంథ రచనకు పూనుకోవడం.4. బౌద్ధంలోని భారతదేశ ప్రజల్ని అధిక సంఖ్యలో మార్చాలని తలపెట్టడం- వీటన్నిటి కారణంగా హిందూత్వ మనువాదులు అంబేద్కర్‌పై ద్వేషం పెంచుకున్నారా? వారి ఆలోచనా ధోరణికి అంబేద్కర్‌ చాలా ప్రమాదకారి కాబోతున్నాడని గ్రహించి, అడ్డుతొలగించుకున్నారా? బహుశా? ఒకవైపు రాజకీయంగా, మరొకవైపు, తాత్త్వికంగా, ఆధ్యాత్మికంగా దేశంలో తిరుగులేని నాయకుడైన అంబేద్కర్‌తో తమకు ఎప్పటికైనా ప్రమాదమేనని అనుకున్నారా? ఇవన్నీ ఆనాటి, జనం వెలిబుచ్చిన సందేహాలు!
అంబేద్కర్‌ ఇంకొంత కాలం బతికిఉంటే, దేశంలో పరిస్థితులు వేరొక రకంగా ఉండేవి. దేశంలో బౌద్ధం ఉధృతంగా వ్యాపించేది. ఆర్య బ్రాహ్మణుల మనువాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) కుట్రలు సత్వరం బట్టబయలయ్యేది. వీరు కల్పించిన హిందూ దేవీ దేవతల మాయలు, మంత్రాలు నిర్వీర్యమై పోయేవి. అభ్యుదయం కొత్తపుంతలు తొక్కేది. కనీసం మత సామరస్యం కొనసాగేది. మత కలహాల పేరిట అఘాయి త్యాలు, మారణకాండలు ఆగేవి. ఎటు నుండి ఎటు చూసినా, ఏరకంగా విశ్లేషించుకున్నా – అంబేద్కర్‌ మరణం ఎవరికి లాభం? కేవలం మనువాదులకే! వారిచే నిర్వహించబడే ఆరెస్సెస్‌ సంస్థకే!! దాని ఇతర అనుబంధ సంస్థలకే!! భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న వారి కోరిక స్వాతంత్య్రం రాక ముందు నుండే ఉంది. దేశ విభజన జరిగినపుడు అటు ముస్లిం రాజ్యం పాకిస్థాన్‌ ఏర్పడింది. గనుక ఇటు హిందూ రాజ్యం ఏర్పడాలనే కదా వారు కోరుకున్నదీ? దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకోకుండా బ్రిటీష్‌వాని భజన చేసింది ఎందుకూ? జాతీయ జెండాను ఎగరేయకుండా ఏండ్లకేండ్లు తమ కాషాయ జెండానే ఎగరేసుకున్నది ఎందుకూ?
నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోషలిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా ఆశ వదులుకోకుండా వారి లక్ష్యసాధనకు వారు, నిరం తరం కృషిచేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! డా. అంబేద్కర్‌ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆ రోజుల్లో బయటికి రాలేదు. అరవైఎనిమేండ్ల తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆరెస్సెస్‌ నడిపిస్తున్న ప్రభుత్వ హయాంలో బయటికి వస్తుదన్న నమ్మకం లేదు గానీ- గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరమనిపించింది. అయితే, బాబాసాహెబ్‌ అర్ధాంతరంగా వదిలేసిన కర్తవ్యాలని, రాజ్యాంగబద్దమైన హక్కుల సాధనని ఈతరం యువతీ యువకులు ముందుకు తీసుకు పోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండాల్సిందే!
(Ref: 1st JAN,1818 REVOLT OF INDEPENDENCE BY; VILAS KHARAT-BAMCEF 2003 Rediff.com.India News\2016 Hindi.one India. Com 2017 BAMCEF 2019 Jaibheem.Bligspot.com\Ambedkar’s last
(6 డిసెంబర్‌, అంబేద్కర్‌ వర్థంతి)
– కేంద్ర సాహిత్య అకాడమీ, అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త.(మెల్బోర్న్‌)నుంచి
– డాక్టర్‌ దేవరాజు మహారాజు