బట్టలు ఉతికే పని రజక వృత్తిదారులకే

– జీవో విడుదల చేసిన ప్రభుత్వం
– హర్షం వ్యక్తం చేసిన రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ రంగ సంస్థల్లోని బట్టలను ఉతికే పని రజక వృత్తిదారులకే కేటాయించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నెంబర్‌ 102ను విడుదల చేయటం పట్ల తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నరేశ్‌, పి ఆశయ్య ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలు ,పోలీస్‌ శాఖలు ,అతిథి గృహాలు, దేవాదాయ శాఖ, ఆస్పత్రుల్లోని లాండ్రీ పనిని పెట్టుబడిదారులకు కాంట్రాక్టు పద్దతిలో ఇస్తున్న క్రమంలో ఆ వృత్తి పనిని తిరిగి రజక వృత్తిదారుల సొసైటీలకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అత్యంత వెనుకబడ్డ రజక వృత్తిదారులకు ఉపాధి కల్పించే విధంగా వృత్తి పనిని రజక సొసైటీలకు ఇవ్వాలని ఆలోచించిన సీఎం కేసీఆర్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగులకమలాకర్‌, శాసనమండలి సభ్యులు బస్వరాజ్‌ సారయ్య, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. వెంటనే టెండర్లను పిలవాలనీ, ప్రస్తుత కాంటాక్ట్‌లన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తిదారులకు ఉపాధి కల్పించే విధంగా తక్షణమే అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించి.. అమలు చేయించాలని కోరారు.