పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి

– అధికారుల లంచగొండి చర్యలు,కక్ష సాధింపు పద్ధతులు మానుకోవాలి
– సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా అధికారులు లంచగొండి చర్యలు, కక్ష సాధింపు పద్ధతులు మానుకోవాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇస్తున్నామని, ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తూ, అనేక చోట్ల ఆదివాసీల భూములు సర్వే చేయకుండా.. చేసిన వాటికి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తుందని ఆరోపించారు. కొందరు అధికారులు పెద్దఎత్తున లంచాలు తీసుకుని ప్రజలను దగా చేస్తున్నారన్నారు. అలాగే గిరిజనేతర పేదలకు వలస వచ్చిన గుత్తి కోయ వారికి పట్టా హక్కులు గాని, ఎలాంటి హక్కులు గాని ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని ఎల్లన్న నగర్‌ భూములను ఇంతవరకు సర్వే చేయలేదని, మంత్రులు, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చి ఎన్ని ఆందోళనలు చేసినా ఫారెస్ట్‌ అధికారులు తప్పుడు రిపోర్టును ఆధారం చేసుకుని సర్వే చేయలేదని తెలిపారు. ఫారెస్ట్‌ అధికారులే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొణిజర్ల మండలంలో వందలాది మంది గిరిజనులకు పట్టహక్కులు ఇవ్వలేదని, కావాలని పట్టా హక్కులు ఇవ్వకుండా పైరవీకారులను రంగంలోకి దింపి ఐటీడీఏ అధికారులు ఎకరాకు 5 వేల నుంచి 10వేల రూపాయలు తీసుకొని పట్టాలిస్తామని ప్రలోభాలకు, అవినీతికి గేట్లు తెరిచారని ఆరోపించారు. ఇల్లందు నియోజకవర్గంలోని గుండాల, టేకులపల్లి, ఇల్లందు, కారేపల్లి తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, సర్వే చేయడం… చేసింది పక్కన పడేయటం జరిగిందన్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ.. పోడు చేసుకున్న భూములన్నింటిని సర్వే చేయాలని, పోడు సాగుదారులందరికీ చట్ట ప్రకారం పట్టా హక్కులు కల్పించాలన్నారు. ఫారెస్ట్‌ అధికారుల కక్షసాధింపు చర్యలు విడిచి పెట్టాలని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో 152 మందిపై యూఏడీఏ చట్టాన్ని నమోదు చేయడం నిరంకుశ చర్య అని, పార్టీకి చెందిన న్యాయవాది రవీందర్‌ను సైతం ఈ కేసులో ఇరికించారన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు చండ్ర అరుణ, జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్య, అర్జున్‌ రావు, సి వై పుల్లయ్య, ఆవుల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.