– అసైన్డ్ బాధితులకు పట్టాలివ్వాలి
– నార్సింగి కాంగ్రెస్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్
నవతెలంగాణ-గండిపేట్
పోడు భూములకు పట్టాలిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కారు అసైన్డ్ భూములున్న రైతులకు పట్టాలివ్వాలని నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యదర్శి మైలారం ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం వట్టినాగులపల్లి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోడు భూములు సరే కాని అసైన్డ్ భూముల మాటేదని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారుకు అసైన్డు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారంతా రైతులు కాదా అంటూ నిలదీశారు. పోడు భూములకు పట్టాలిస్తున్నట్టు అసైన్డ్ భూములకు సైతం పట్టాలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వట్టినాగుపల్లి గ్రామంల్లో దళితులు దాదాపు 50 కుటుంబాల వరకు అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి హక్కు లేదన్నారు. గండిపేట్ మండలంల్లో కేసీఆర్ సర్కారు విలువైన భూములను అమ్ముకుని ఖజానా నింపుకుంటున్నట్లు ఆరోపించారు. వట్టినాగులపల్లి పేద రైతులు యెడ్ల తరబడి పట్టాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ సర్కారు హక్కు దారులుగా ఉన్న రైతులను ధరణీ పేరుతో పేర్లు తొలగించడం దారుణమన్నారు. వట్టినాగులపల్లి సర్వే నంబర్ 124 నుండి 131 వరకు దాదాపు వంద ఎకరాల వరకు అసైన్డ్ భూమి ఉందన్నారు. అందులోనే పేద రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నట్లు తెలిపారు. రికార్డుల్లో 2017 సంవత్సరంలో పేర్లను తొలగించినట్లు తెలిపారు. వారికి రైతుబంధు, రైతు బీమాకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. పేద రైతుల భూములను గుర్తించి వారికి పోడు భూముల మాదిరిగా అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలని డిమాండ చేశారు. లేని యెడల కాంగ్రెస్ పార్టీ తరుపున గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేసీఆర్ సర్కారును హెచ్చరించారు.