చిరుత ఉన్నది..జాగ్రత్త

There is a leopard..be careful– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సంచారం
– అప్రమత్తమైన అధికారులు.. బోన్ల ఏర్పాటు.. నిరంతర నిఘా
నవతెలంగాణ- శంషాబాద్‌
అడవుల్లో సంచారించాల్సిన జంతువులు జనజీవనం మధ్యకు వచ్చేస్తున్నాయి. పచ్చటి అడవులు కాస్త కనుమరుగవుతున్నాయి. ఇప్పటి వరకు పక్క రాష్ట్రాల్లో జనావాసాల మధ్యన జంతువులు సంచరిస్తున్నాయని వినేవాళ్లం. ఇపుడు మన రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లోకి నల్ల చిరుత పులి (పాంథర్‌) ఆదివారం తెల్లవారుజామున ప్రవేశించింది. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద పులి ఎయిర్‌పోర్టు బౌండరీ దాటి లోనికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూంలో అలారం మోగింది. దాంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో పులి సంచారాన్ని గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వారు పులి జాడ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక వాహనాలతో నిఘా పెట్టారు. పులి జాడ కోసం సీనియర్‌ అటవీ అధికారులతో పాటు వన్య మృగ ముఖ్య అధికారి కూడా పర్యవేక్షిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.